
కలెక్టరేట్‌కు పనుల కోసం వచ్చే వారికి ఏర్పాటు
ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ వినూత్న నిర్ణయం
రేపటి నుంచి కలెక్టరేట్ క్యాంటీన్‌లో అమలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడమే కాక వారి ఆకలి తీర్చేలా ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పాలనలో తనకంటూ ప్రత్యేకతను చూపుతున్న ఆయన.. ప్రజా సమస్యల పరిష్కారంలో వినూత్న పంథా అనుసరిస్తున్నారు. ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణితోపాటు వివిధ పనుల కోసం జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు కలెక్టరేట్‌కు వస్తుంటారు. అయితే వీరు ఆకలితో వెళ్లొద్దనే భావనతో కలెక్టరేట్ క్యాంటీన్‌లో ఉచితంగా మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ పథకం ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
కడుపు నిండా తినేలా..: ఉచిత భోజనం అంటే అన్నం, ఒక కూర కాకుండా.. పూర్తి మెనూతో అమలయ్యేలా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నం, ఆకుకూర పప్పు, రోటిపచ్చడి, రెండు కూరలు, సాంబార్ లేదా రసం, పెరుగుతో దివ్యాంగులకు భోజనాన్ని సమకూరుస్తారు. కలెక్టరేట్‌లోని కార్యాలయాలకు ఇందుకోసం కూపన్లు ఇస్తారు. ఆయా శాఖలకు 40% వైకల్యంతో ఉన్న దివ్యాంగులు వస్తే కూపన్లు అందజేయనున్నారు. ప్రతీరోజు జారీ చేసిన కూపన్ల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి, ఒక్కో భోజనానికి రూ. 80 చొప్పున క్యాంటీన్ నిర్వాహకులకు నెలకోమారు చెల్లిస్తారు. దివ్యాంగులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నామనే విషయాన్ని కలెక్టరేట్‌లోని ప్రవేశ మార్గాల్లో బోర్డులు ఏర్పాటు చేయించనున్నారు.
‘సదరం’నంబర్ ఆధారంగా..
దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ నంబర్ ఆధారంగా కూపన్ జారీ చేస్తారు. ఈ కూపన్‌తో కలెక్టరేట్ క్యాంటీన్‌లో ఉచితంగా భోజనం చేయొచ్చు. ఇందుకోసం క్యాంటీన్ బాధ్యులకు రూ.80 చొప్పున చెల్లిస్తాం. దివ్యాంగుల నుంచి వచ్చిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. బుధవారం నుంచి ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment