Khammam Collectorate
-
కలెక్టరేట్ ఎదుట.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి చెందిన సీతమ్మ అనే మహిళ తన భూమిని మరొకరు పట్టా చేయించుకున్నారని.. మనస్తాపానికి గురై మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు కొడుకు జీవన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీమపోగు సీతమ్మకు జూలూరుపాడులో 180/అ సర్వే నంబర్లో 1.21 కుంటల భూమి ఉంది. సీతమ్మ తండ్రి మోదుగు పుల్లయ్య మరణానంతరం తల్లి పసుపు కుంకుమ కింద సీతమ్మకు రాసిచ్చింది. అప్పటి నుంచి సీతమ్మ ఆ భూమిని సాగు చేసుకుంటుంది. 2002–03లో సీతమ్మ కుటుంబంతో సంబంధం లేని మోదుగు శ్రీకాంత్ అనే వ్యక్తి పేరును రికార్డుల్లో నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీతమ్మ అనేకసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో సీతమ్మ కోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులను పొందారు. అనంతరం నోటీసులు తీసుకున్న శ్రీకాంత్ హైకోర్టులో రిట్ పిటీషన్ వేయగా రివిజన్ అప్పీలు వేసుకోమని కోర్టు సూచించింది. మండల రెవెన్యూ సిబ్బంది నుంచిగాని, హైకోర్టు నుంచిగాని తనకు ఎటు వంటి నోటీసులు అందలేదని సీతమ్మ తెలిపింది. కొత్తగూడెం ఆర్డీఓ కోర్టులో ఆర్ఓఆర్ కోసం శ్రీకాంత్ అప్పీలు చేయగా ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీకి కేసు విచారణను వాయిదా వేశారు. సీతమ్మ పేరు తొలగించి శ్రీకాంత్ పేరు నమోదు చేయాలంటూ సీతమ్మకు ఎలాంటి నోటీసులు అందలేదని కుమారుడు జీవన్ చెప్పాడు. అంతేగాక అసలు సీతమ్మ పేరును తొలగించి శ్రీకాంత్ పేరును ఎలా నమోదు చేశారని సంబంధిత రెవెన్యూ అధికారులను అడిగినా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 19వ తేదీన సీతమ్మ సాగు చేసుకుంటున్న భూమిని శ్రీకాంత్ ట్రాక్టర్‌తో దున్నించే ప్రయత్నం చేయడంతో ఆమె దానిని అడ్డుకున్నది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ తనను చంపుతానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయమై జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. గ్రీవెన్స్‌లో విన్నవించినా ఫలితంలేకనే.. ఈ సమస్యపై గ్రీవెన్స్‌లో సీతమ్మ కలెక్టర్‌ను కలిసి వివరించగా తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడగగా తహసీల్దార్, ఆర్ఐలు ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారని, దీంతో మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం కలెక్టరేట్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు స్పందించి ఆమెను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఇదిలా ఉండగా సీతమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడక ముందు ఒక మహిళా కానిస్టేబుల్ ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఆ మహిళా కానిస్టేబుల్ ఎవరనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతమ్మను జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. సీతమ్మకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్ కోటిరెడ్డిని ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ దగ్గరుండి సీతమ్మకు వైద్యం చేశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలి: తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశం కొత్తగూడెంరూరల్: భూ రికార్డుల్లో తన పేరు మార్చారంటూ ఆత్మహత్యాయత్నం చేసిన సీతమ్మ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆమె పేరుపై ఉన్న భూ రికార్డులను మార్చలేదని భద్రాద్రి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. సీతమ్మ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న కలెక్టర్ ఈ విషయంపై తక్షణ విచారణ చేపట్టారు. కేసు పూర్వాపరాలు పరిశీలించారు. ఈ కేసుపై కొత్తగూడెం ఆర్డీఓ కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని, ఇప్పటికే రెండు వాయిదాలు నడిచాయని పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని కలెక్టర్ వివరించారు. సీతమ్మ తన భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇతరుల పేరుతో నమోదు చేస్తున్నారని ఆత్మహత్యాయత్నం చేయడంలో రెవెన్యూ అధికారుల పాత్ర ఏమీలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి నివేదికలు అందజేయాలని జేసీ, వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను ఆదేశించానని పేర్కొన్నారు. భూ రికార్డులను, రెవెన్యూ సిబ్బందిని కలెక్టరేట్‌కు పిలిపించి రికార్డులను పరిశీలించానన్నారు. ఆర్డీఓ స్వర్ణలతను సైతం సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించినట్లు కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు. -
లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలి
ఖమ్మంసహకారనగర్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ఈనెల 23వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుపై గురువారం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ విధి విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి.. ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల వివరాల లెక్కింపు, అందులోని దశలు, ప్రతి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్‌లలో గల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్ కొండపల్లి శ్రీరామ్ శిక్షణ ఇచ్చారు. అనంతరం మైక్రో అబ్జర్వర్లకు సైతం శిక్షణ నిర్వహించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడిం బా, కలెక్టరేట్ ఏఓ మదన్‌గోపాల్, ఎన్నికల డీటీ రాంబాబు, ఈడీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
వీవీ.పాలెంలోనే ఖమ్మం కలెక్టరేట్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం కలెక్టరేట్ నూతన భవన సముదాయ నిర్మాణం ఎట్టకేలకు ఖరారైంది. దాదాపు పది నెలల క్రితం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఆధునిక వసతులతో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం 26.24 ఎకరాల స్థలం సేకరించింది. అయితే నగరానికి దూరంగా.. ప్రజలకు అసౌకర్యంగా ఉండే ప్రాంతంలో కలెక్టరేట్ భవన సముదాయం నిర్మించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కార్యాలయం పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు సరిపోతుందని, మళ్లీ కలెక్టర్ కార్యాలయాన్ని మరోచోట నిర్మించడాన్ని సవాల్ చేస్తూ ఎం.విజయభాస్కర్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది. పిటిషనర్ వ్యక్తం చేసిన పలు అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చినట్లు సమాచారం. దీంతో వి.వెంకటాయపాలెంలో కొత్త కలెక్టర్ కార్యాలయ భవన సముదాయానికి పాలనాపరంగా, న్యాయపరంగా ఏర్పడిన అవాంతరాలు ఒక్కొక్కటిగా తొలగినట్లయింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వి.వెంకటాయపాలెంలో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం 26.24 ఎకరాల స్థలం సేకరించాలని సంకల్పించి.. యుద్ధప్రాతిపదికన స్థల సేకరణ కూడా పూర్తి చేసింది. ఎకరానికి రూ.కోటి చొప్పున రైతులకు పరిహారంగా చెల్లించి.. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు సంకల్పించిన తరుణంలో కొత్తగా నిర్మించే ప్రాంతం జిల్లా ప్రజలకు అందుబాటులో లేదని, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ వంటి వాటికి దూరంగా ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని జిల్లాకు చెందిన న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే భవన సముదాయ నిర్మాణం వి.వెంకటాయపాలెంలో నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు.. కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణానికి సంబంధించి దాఖలైన అభ్యంతరాలను తోసిపుచ్చడంతో ఇక నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. కలెక్టరేట్లోని 53 శాఖలు విధులు నిర్వహించే అవకాశం ఉండగా, అందులో తొలి విడతగా ఆయా శాఖల నుంచి ఎన్ని గదులు అవసరం ఉన్నాయి.. ఎంత వైశాల్యం అవసరం ఉంటుందనే అంశాలపై ప్రతిపాదనలు శాఖలవారీగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఓ హోటల్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు సమాచారం. కాగా.. భవన నిర్మాణం బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖ చేపట్టనున్నట్లు సమాచారం. -
ఖమ్మం కలెక్టరేట్లో చెల్లప్ప కమిటీ విచారణ
ఖమ్మం: బోయ, వాల్మీకీ కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చే విషయమై చెల్లప్ప కమిటీ బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో అధ్యయనం నిర్వహించింది. దీనికి బోయ, వాల్మీకీ, లంబాడ, కోయ సామాజిక వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. బీసీల్లో ఉండడం వల్ల తాము ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని, తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని బోయ, వాల్మీకీ కులాల వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దీన్ని లంబాడ, కోయ కులాల వారు వ్యతిరేకించారు. ఎస్టీ జాబితాలో ఉన్నవారికే న్యాయం జరగడం లేదని, కొత్తగా మరిన్ని కులాలను చేర్చితే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విచారణలో జాయింట్ కలెక్టర్ దివ్య, చెల్లప్ప కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
'ఆ మండలాలను వదులుకోం'
తెలంగాణలోని ఏడు మండలాలను ఒదులుకొనేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్సష్టం చేశారు. పాలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, పువ్వాడ అజేయ్, రామిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... పోలవరం ఆర్డినెన్స్‌పై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. పోలవరంపై ఆంధ్రప్రదేశ్ న్యాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ఎదుర్కొంటామని వారు స్పష్టం చేశారు. లోక్‌సభలో శుక్రవారం పోలవరం ఆర్డినెన్స్ బిల్లు... తెలంగాణ ఎంపీలు నిరసనల మధ్య ఆమోదం పొందింది. పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజుకు అన్ని పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
‘లెహర్’ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: లెహర్ సూపర్ సైక్లోన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని , జిల్లా, మండల అధికారులు కార్యస్థానాల్లో అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో వర్షాలపై ముందస్తూ తీసుకోవాల్సిన అంశాలపై ఎస్పీ రంగనాధ్‌తో కలిసి మాట్లాడారు. వర్షాల వల్ల నష్టాలను కనిష్టస్థాయికి పరిమితం చేసేందుకు గ్రామ, మండల ,డివిజన్, జిల్లాస్థాయి అధికారులు ఆయా కార్యస్థానాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. లేకుంటే జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహలు సూచనలు చేయాలన్నారు. తాగునీటి, ఆరోగ్యం, నీటిపారుదల, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు ముందస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సీజన్ ప్రారంభమైనందున రైతులకు ఎలాంటి నష్టకలగకుండా ఉండేందుకు వరిని కోసేందుకు హార్వెస్టర్లను రప్పించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల నుంచి ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌తో పాటు మిగతా డివిజన్ కార్యాలయాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ రంగనాధ్ మాట్లాడుతూ ఈ నెల 28న లెహర్ సూపర్ సైక్లోను ప్రభావం జిల్లాపై పడే అవకాశం ఉందని, ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తొలుత లెహర్ సూపర్సైక్లోన్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి వీడియోకాన్పిరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ జేసీ బాబూరావు, డీఆర్వో శివశ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి... 23, 24 తేదీల్లో భారీ వర్షాలు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: హెలెన్ తుపాను కారణంగా జిల్లాలో ఈ నెల 23, 24 తేదీల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నద ని, ఆ రోజుల్లో మండల, జిల్లా స్థాయి అధికారులంతా విధుల్లో ఉండాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. తుపాను పట్ల అప్రమత్తం చేసేందుకు శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని ప్రజ్ఞసమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను నష్టాన్ని కనిష్టస్థాయికి పరిమితం చేసేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. వ్యవసాయాధికారులు మండల కేంద్రాల్లో ఉండి రైతులకు తగు సూచనలు, సలహాలు అందించాలని చెప్పారు. నీటి పారుదలశాఖ అధికారులు ఖమ్మం, పాల్వంచ, భద్రాచలం డివిజన్లలో చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా తగు చర్యలు తీసుకొని వరద ముంపునుంచి పంటలను కాపాడాలన్నారు. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండి వాటిని వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్లలో అత్యవసర మందులు సమృద్ధిగా నిల్వ చేసుకోవాల ని అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది 24 గం టలు అందుబాటులో ఉండాలని అన్నారు. నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సివిల్‌సప్లయీస్ డీఎంకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు నిరంతరాయంగా నడిపించేందుకు అన్నిరకాల సామగ్రి ని ముందస్తుగా నిల్వ చేసుకోవాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి తగు సమాచారం వెంటనే తెలపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేఏసీ బాబురావు, డీఆర్వో శివశ్రీనివాస్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
భద్రాచలాన్ని విడదీస్తే ఊరుకోం..
ఖమ్మం గాంధీచౌక్/ ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, దాన్ని విడదీస్తే ఊరుకునేది లేదని జర్నలిస్టుల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్‌క్లబ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మయూరిసెంటర్, బస్టాండ్, జడ్పీసెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అక్కడ దీక్ష చేస్తున్న పంచాయతీ రాజ్ ఉద్యోగులకు జర్నలిస్టులు సంఘీభావం ప్రకటించారు. భద్రాచలాన్ని కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని జర్నలిస్టు నేతలు ప్రకటించారు. భద్రాచలం డివిజన్‌ను పోలవరంతో ముంచేందుకే సీమాంధ్రులు ఆ డివిజన్ కావాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామ్‌నారాయణ, ఏనుగు వెంకటేశ్వరరావు, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎ.ఆదినారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా అసొసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసేన్, వెంకట్రావ్, జర్నలిస్టు నాయకులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాపారావు, కృష్ణమురారి, అప్పారావు, వనం వెంకటేశ్వర్లు, పోటు శ్రీనివాస్, వేణుగోపాల్, నాగేందర్ పాల్గొన్నారు. జర్నలిస్టుల ప్రదర్శనకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు, టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగారాజు, నడింపల్లి వెంకటపతిరాజు సంఘీభావం ప్రకటించారు -
‘చచ్చు’బండ
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పేరుతో అట్టహాసంగా ప్రచారం నిర్వహిస్తున్న రచ్చబండ.. చచ్చుబండగా మారింది. అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెపుతున్నప్పటికీ ఈ కార్యక్రమం వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడత దరఖాస్తుదారులలో ఏడాది తర్వాత సగం మందికి మాత్రమే మోక్షం కలిగింది. మిగిలిన సగం దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. మళ్లీ 2011 నవంబర్‌లో మలివిడత రచ్చబండ నిర్వహించగా... నేటికీ ఏ ఒక్క లబ్ధిదారుకూ ప్రయోజనం కలుగలేదు. కాగా, సోమవారం నుంచి మూడో విడత రచ్చబండ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో తొలివిడత రచ్చబండ కార్యక్రమాన్ని 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆర్భాటంగా నిర్వహించారు. గ్రామసభల్లో ప్రధానంగా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. మళ్లీ అదే సంవత్సరం నవంబర్‌లో మలివిడత రచ్చబండ నిర్వహించారు. అందులో మొదటి విడత లబ్ధిదారులు కొందరికి పథకాలు అందించి చేతులు దులుపుకున్నారు. రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న వారు ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ‘ఆన్లైన్ చేస్తున్నాం.. త్వరలో రేషన్‌కార్డులు, ఫించన్లు, ఇళ్లు వస్తాయి’ అంటూ అధికారులు తిప్పుకుంటున్నారే తప్ప.. ఒరిగిందేమీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, గతనెల 24 వరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులందరికీ మూడో విడత రచ్చబండలో సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే గత రచ్చబండ కార్యక్రమాల్లో ఇచ్చిన దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించకుండా గతనెల 24 వరకు వచ్చిన వాటిని పరిష్కరించడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. అమలుకు నోచని ఇందిరమ్మ ఇళ్లు.. అభివృద్ధి పథకాల అమలులో ప్రభుత్వ అలసత్వంతో మొదటి విడత లబ్దిదారులకు ఇప్పటివరకు ఇళ్లు మంజురు కాలేదు. రెండు విడతల్లో 1,13,928 మంది లబ్దిదారులు అర్హులుగా గుర్తించారు. ఇవికాకుండా గ్రీవెన్స్, ఇతర కార్యక్రమాల్లో మరికొందరు దరఖాస్తు చేస్తున్నారు. ఇలా అక్టోబర్ 24 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఈ రచ్చబండలో 61,958 మందికి మంజురూ చేస్తామని అధికారులు చెపుతున్నారు. గుర్తించిన వారిలోనూ కొందరికి రేషన్‌కార్డు లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం లేదు. ఫించన్ల కోసం గత రచ్చబండలో 29,678 మంది దరఖాస్తు చేసుకోగా, నేటికీ వారికి ఎదురుచూపులే మిగిలాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనిదే తామేమీ చేయలేమని అధికారులు చేతులెతేస్తున్నారు. రెండోవిడత రచ్చబండలో 62,558 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 42,096 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. కానీ వారికి ఇప్పటి వరకూ కార్డులు మంజురు చేయలేదు. దీంతో వారు ఏ ప్రభుత్వ పధకానికీ అర్హులు కావడం లేదు. ప్రచారానికే ప్రాధాన్యత.. రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండలో వచ్చిన దరఖాస్తులకు మోక్షం చూపని ప్రభుత్వం.. ఈ నెల 11 నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రచార ఆర్భాటాల కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.