ఖమ్మం కలెక్టరేట్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం కలెక్టరేట్ నూతన భవన సముదాయ నిర్మాణం ఎట్టకేలకు ఖరారైంది. దాదాపు పది నెలల క్రితం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఆధునిక వసతులతో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనికి అనుగుణంగా ప్రభుత్వం 26.24 ఎకరాల స్థలం సేకరించింది. అయితే నగరానికి దూరంగా.. ప్రజలకు అసౌకర్యంగా ఉండే ప్రాంతంలో కలెక్టరేట్ భవన సముదాయం నిర్మించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కార్యాలయం పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు సరిపోతుందని, మళ్లీ కలెక్టర్ కార్యాలయాన్ని మరోచోట నిర్మించడాన్ని సవాల్ చేస్తూ ఎం.విజయభాస్కర్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది.
పిటిషనర్ వ్యక్తం చేసిన పలు అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చినట్లు సమాచారం. దీంతో వి.వెంకటాయపాలెంలో కొత్త కలెక్టర్ కార్యాలయ భవన సముదాయానికి పాలనాపరంగా, న్యాయపరంగా ఏర్పడిన అవాంతరాలు ఒక్కొక్కటిగా తొలగినట్లయింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వి.వెంకటాయపాలెంలో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకోసం 26.24 ఎకరాల స్థలం సేకరించాలని సంకల్పించి.. యుద్ధప్రాతిపదికన స్థల సేకరణ కూడా పూర్తి చేసింది. ఎకరానికి రూ.కోటి చొప్పున రైతులకు పరిహారంగా చెల్లించి.. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు సంకల్పించిన తరుణంలో కొత్తగా నిర్మించే ప్రాంతం జిల్లా ప్రజలకు అందుబాటులో లేదని, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ వంటి వాటికి దూరంగా ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని జిల్లాకు చెందిన న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది.
అయితే భవన సముదాయ నిర్మాణం వి.వెంకటాయపాలెంలో నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు.. కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణానికి సంబంధించి దాఖలైన అభ్యంతరాలను తోసిపుచ్చడంతో ఇక నిర్మాణ పనులు మొదలుకానున్నాయి.
కలెక్టరేట్‌లోని 53 శాఖలు విధులు నిర్వహించే అవకాశం ఉండగా, అందులో తొలి విడతగా ఆయా శాఖల నుంచి ఎన్ని గదులు అవసరం ఉన్నాయి.. ఎంత వైశాల్యం అవసరం ఉంటుందనే అంశాలపై ప్రతిపాదనలు శాఖలవారీగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఓ హోటల్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు సమాచారం. కాగా.. భవన నిర్మాణం బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖ చేపట్టనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment