సీతమ్మను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం, భూమికి సంబంధించిన కాగితాలు చూపిస్తున్న వ్యక్తి
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి చెందిన సీతమ్మ అనే మహిళ తన భూమిని మరొకరు పట్టా చేయించుకున్నారని.. మనస్తాపానికి గురై మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు కొడుకు జీవన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీమపోగు సీతమ్మకు జూలూరుపాడులో 180/అ సర్వే నంబర్‌లో 1.21 కుంటల భూమి ఉంది. సీతమ్మ తండ్రి మోదుగు పుల్లయ్య మరణానంతరం తల్లి పసుపు కుంకుమ కింద సీతమ్మకు రాసిచ్చింది. అప్పటి నుంచి సీతమ్మ ఆ భూమిని సాగు చేసుకుంటుంది. 2002–03లో సీతమ్మ కుటుంబంతో సంబంధం లేని మోదుగు శ్రీకాంత్ అనే వ్యక్తి పేరును రికార్డుల్లో నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీతమ్మ అనేకసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో సీతమ్మ కోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులను పొందారు.
అనంతరం నోటీసులు తీసుకున్న శ్రీకాంత్ హైకోర్టులో రిట్ పిటీషన్ వేయగా రివిజన్ అప్పీలు వేసుకోమని కోర్టు సూచించింది. మండల రెవెన్యూ సిబ్బంది నుంచిగాని, హైకోర్టు నుంచిగాని తనకు ఎటు వంటి నోటీసులు అందలేదని సీతమ్మ తెలిపింది. కొత్తగూడెం ఆర్డీఓ కోర్టులో ఆర్‌ఓఆర్ కోసం శ్రీకాంత్ అప్పీలు చేయగా ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీకి కేసు విచారణను వాయిదా వేశారు. సీతమ్మ పేరు తొలగించి శ్రీకాంత్ పేరు నమోదు చేయాలంటూ సీతమ్మకు ఎలాంటి నోటీసులు అందలేదని కుమారుడు జీవన్ చెప్పాడు. అంతేగాక అసలు సీతమ్మ పేరును తొలగించి శ్రీకాంత్ పేరును ఎలా నమోదు చేశారని సంబంధిత రెవెన్యూ అధికారులను అడిగినా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 19వ తేదీన సీతమ్మ సాగు చేసుకుంటున్న భూమిని శ్రీకాంత్ ట్రాక్టర్‌తో దున్నించే ప్రయత్నం చేయడంతో ఆమె దానిని అడ్డుకున్నది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ తనను చంపుతానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయమై జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
గ్రీవెన్స్‌లో విన్నవించినా ఫలితంలేకనే..
ఈ సమస్యపై గ్రీవెన్స్‌లో సీతమ్మ కలెక్టర్‌ను కలిసి వివరించగా తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడగగా తహసీల్దార్, ఆర్‌ఐలు ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారని, దీంతో మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం కలెక్టరేట్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు స్పందించి ఆమెను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఇదిలా ఉండగా సీతమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడక ముందు ఒక మహిళా కానిస్టేబుల్ ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఆ మహిళా కానిస్టేబుల్ ఎవరనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతమ్మను జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. సీతమ్మకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్ కోటిరెడ్డిని ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ దగ్గరుండి సీతమ్మకు వైద్యం చేశారు.
సమగ్ర నివేదిక ఇవ్వాలి: తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశం
కొత్తగూడెంరూరల్: భూ రికార్డుల్లో తన పేరు మార్చారంటూ ఆత్మహత్యాయత్నం చేసిన సీతమ్మ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆమె పేరుపై ఉన్న భూ రికార్డులను మార్చలేదని భద్రాద్రి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. సీతమ్మ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న కలెక్టర్ ఈ విషయంపై తక్షణ విచారణ చేపట్టారు. కేసు పూర్వాపరాలు పరిశీలించారు. ఈ కేసుపై కొత్తగూడెం ఆర్డీఓ కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని, ఇప్పటికే రెండు వాయిదాలు నడిచాయని పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని కలెక్టర్ వివరించారు. సీతమ్మ తన భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇతరుల పేరుతో నమోదు చేస్తున్నారని ఆత్మహత్యాయత్నం చేయడంలో రెవెన్యూ అధికారుల పాత్ర ఏమీలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి నివేదికలు అందజేయాలని జేసీ, వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను ఆదేశించానని పేర్కొన్నారు. భూ రికార్డులను, రెవెన్యూ సిబ్బందిని కలెక్టరేట్‌కు పిలిపించి రికార్డులను పరిశీలించానన్నారు. ఆర్డీఓ స్వర్ణలతను సైతం సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించినట్లు కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment