ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పేరుతో అట్టహాసంగా ప్రచారం నిర్వహిస్తున్న రచ్చబండ.. చచ్చుబండగా మారింది. అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెపుతున్నప్పటికీ ఈ కార్యక్రమం వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడత దరఖాస్తుదారులలో ఏడాది తర్వాత సగం మందికి మాత్రమే మోక్షం కలిగింది. మిగిలిన సగం దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. మళ్లీ 2011 నవంబర్‌లో మలివిడత రచ్చబండ నిర్వహించగా... నేటికీ ఏ ఒక్క లబ్ధిదారుకూ ప్రయోజనం కలుగలేదు. కాగా, సోమవారం నుంచి మూడో విడత రచ్చబండ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
జిల్లాలో తొలివిడత రచ్చబండ కార్యక్రమాన్ని 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆర్భాటంగా నిర్వహించారు. గ్రామసభల్లో ప్రధానంగా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. మళ్లీ అదే సంవత్సరం నవంబర్‌లో మలివిడత రచ్చబండ నిర్వహించారు. అందులో మొదటి విడత లబ్ధిదారులు కొందరికి పథకాలు అందించి చేతులు దులుపుకున్నారు.
రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న వారు ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ‘ఆన్‌లైన్ చేస్తున్నాం.. త్వరలో రేషన్‌కార్డులు, ఫించన్లు, ఇళ్లు వస్తాయి’ అంటూ అధికారులు తిప్పుకుంటున్నారే తప్ప.. ఒరిగిందేమీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, గతనెల 24 వరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులందరికీ మూడో విడత రచ్చబండలో సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే గత రచ్చబండ కార్యక్రమాల్లో ఇచ్చిన దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించకుండా గతనెల 24 వరకు వచ్చిన వాటిని పరిష్కరించడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు.
అమలుకు నోచని
ఇందిరమ్మ ఇళ్లు..
అభివృద్ధి పథకాల అమలులో ప్రభుత్వ అలసత్వంతో మొదటి విడత లబ్దిదారులకు ఇప్పటివరకు ఇళ్లు మంజురు కాలేదు. రెండు విడతల్లో 1,13,928 మంది లబ్దిదారులు అర్హులుగా గుర్తించారు. ఇవికాకుండా గ్రీవెన్స్, ఇతర కార్యక్రమాల్లో మరికొందరు దరఖాస్తు చేస్తున్నారు. ఇలా అక్టోబర్ 24 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఈ రచ్చబండలో 61,958 మందికి మంజురూ చేస్తామని అధికారులు చెపుతున్నారు. గుర్తించిన వారిలోనూ కొందరికి రేషన్‌కార్డు లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం లేదు. ఫించన్ల కోసం గత రచ్చబండలో 29,678 మంది దరఖాస్తు చేసుకోగా, నేటికీ వారికి ఎదురుచూపులే మిగిలాయి.
ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనిదే తామేమీ చేయలేమని అధికారులు చేతులెతేస్తున్నారు. రెండోవిడత రచ్చబండలో 62,558 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 42,096 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. కానీ వారికి ఇప్పటి వరకూ కార్డులు మంజురు చేయలేదు. దీంతో వారు ఏ ప్రభుత్వ పధకానికీ అర్హులు కావడం లేదు.
ప్రచారానికే ప్రాధాన్యత..
రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండలో వచ్చిన దరఖాస్తులకు మోక్షం చూపని ప్రభుత్వం.. ఈ నెల 11 నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రచార ఆర్భాటాల కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.