ఘట్‌కేసర్ టౌన్: సమగ్ర కుటుంబ సర్వే బడా బాబుల్లో గుండెల్లో గుబులు రేపుతోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇప్పటి వరకు దొడ్దిదారిన సంక్షేమ పథకాలను కాజేసిన వారు సర్వే పేరు వింటేనే వణికిపోతున్నారు. అక్రమంగా పొందిన సేవలన్ని సర్వే ద్వారా బహిర్గతమయ్యే అవకాశముండటం వారిలో ఆందోళనకు కారణమవుతోంది.
వ్యతిరేకిస్తున్న ఉన్నత వర్గం, ఆహ్వానిస్తున్న
పేద వర్గం... కోట్ల కొలది ఆస్తులున్న తెల్ల తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ తదితర రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర సౌకర్యాలు పొందుతున్న ఉన్నత వర్గాలు సామాజిక సర్వేను వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలు పొందడానికి అన్ని అర్హతలున్నా ప్రభుత్వ రాయితీలను అందుకోలేకపోతున్న పేద వర్గం సర్వేను స్వాగతిస్తోంది. సర్వేలో ఉద్యోగ స్థితి, ఆధార్, స్థిరాస్తి, చరాస్థి, గ్యాస్, ఇంటి, కుటుంబ పరిస్థితి, పశు సంపద, పెన్షన్స్, భూములు, పాన్ కార్డు తదితర వివరాలను సర్వే సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది.
పాలకుల స్వార్థపూరిత పాలనలో సర్కారు ఉద్యోగమున్న వారు, భూస్వాములు వారి తల్లితండ్రులు నేడు తెలుపు కార్డులు పొంది పెన్షన్స్, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుల ద్వారా రాయితీలు పొందుతున్నారు. వైకల్యం లేకున్న పెన్షన్ పొందడం, ఇల్లు ఉండగానే స్థలాలు, ఇందిరమ్మ పథకాలను తిరిగి వినియోగించుకున్న వారికి ఇప్పుడు సర్వే అంటేనే దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. భూములు, ప్లాట్ల విక్రయాలన్ని నేడు ఆన్‌లైన్లో జరుగుతున్నందున ఎక్కడ తమ అక్రమ ఆస్తుల వివరాలు సర్కారుకు తెలిసిపోతాయోనని బడాబాబులు దడుసుకుంటున్నారు.
ప్రజా ప్రతినిధులకు తప్పని తిప్పలు...
నూతనంగా ఎన్నికలైన ప్రజా ప్రతినిధులను సర్వే తిప్పలు వదలడం లేదు. ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కినా సర్వే ద్వారా ప్రజల నమ్మకాన్ని కోల్పోయే అవకాశముందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఓటేసి గెలిపిస్తే ఉన్న సౌకర్యాల్లో కోతల విధిస్తున్నారని, ఇందుకోసమేనే మిమ్మల్ని గెలిపించామా అంటూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. మరి ఈనెల 19న జరిగే సర్వేలో అందరూ అనుకుంటున్నంటు అక్రమాలు బయటపడతాయా లేక ఇది ఓ సాధారణ సర్వేగా మిగిలిపోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
గుబులు రేపుతున్న సర్వే..!
Published Fri, Aug 15 2014 11:12 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement