‘ఫాస్ట్’ పథకంలో భాగంగా విద్యార్థులు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన నేటికీ ప్రారంభం కాలేదు.
ఘట్‌కేసర్ టౌన్: ‘ఫాస్ట్’ పథకంలో భాగంగా విద్యార్థులు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన నేటికీ ప్రారంభం కాలేదు. ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) కార్యక్రమంలో భా గంగా విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సూచించింది. మం డలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఫాస్ట్ పత్రాల కోసం మండలంలోని విద్యార్థు ల నుంచి 15,479 దరఖాస్తులందాయి.
పింఛన్ల పంపిణీలో అధికారులు బిజీ
తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లు, రేషన్‌కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అక్టోబర్ 5 నుంచి 30వరకు గడువునిచ్చింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో లక్షల సంఖ్యలో దరఖాస్తులందాయి.
మొదటగా పింఛన్ల అర్హులను తేల్చలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఆ పనిమొదలుపెట్టారు. పింఛన్లకు మండలంలో 11,894 దరఖాస్తులందగా అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపి అర్హుల జాబితా సిద్ధం చేశారు. వారికి పింఛన్లు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అనంతరం ఆహార భద్రతా కార్డులకు సంబంధించి అధికారులు విచారణ జరపాల్సి ఉంది. ఆహార భద్రతా కార్డుల కోసం మండలంలో 45,402 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను తేల్చిన తర్వాతే అధికారయంత్రాంగం ‘ఫాస్ట్’ దరఖాస్తులను విచారించే అవకాశం కనబడుతోంది.
ఆందోళనలో విద్యార్థులు
ఫాస్ట్ దరఖాస్తులు ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో మూలుగుతున్నాయి. ప్రస్తుతం పలు కోర్సులకు సంబంధించి విద్యార్థులకు కౌన్సిలింగ్ కొనసాగుతోంది. దీనికోసం విద్యార్థులకు నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. తమ దరఖాస్తులను పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేయాలని అధికారులను విద్యార్థులు సంప్రదిస్తే ఆహార భద్రత కార్డులు, పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో తాము బిజీగా ఉన్నామని, ఇప్పట్లో ‘ఫాస్ట్’ దరఖాస్తుల పరిశీలన సాధ్యం కాదని అధికారులు తేల్చిచెబుతున్నారు.
కౌన్సిలింగ్‌కు అవసరమైన పత్రాలు లేకపోతే తము సీటు దక్కుతుందో లేదో, ఉపకార వేతనాలను కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలో విద్యార్థులున్నారు. ఫాస్ట్ పథకంలో భాగంగా ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, ఆదేశాలు అందిన అనంతరం పత్రాలను జారీచేస్తామని తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.