ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు | Telangana govt to set up 150 Mahila Shakti canteens: Seethakka | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు

Published Fri, Jun 21 2024 6:30 AM | Last Updated on Fri, Jun 21 2024 6:30 AM

Telangana govt to set up 150 Mahila Shakti canteens: Seethakka

మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికే ‘మహిళా శక్తి’ 

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

సాక్షి, హైదరాబాద్‌: మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికే ‘మహిళా శక్తి’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థల వేధింపుల నుంచి మహిళలకు విముక్తి కలి్పంచేందుకే.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందిస్తామన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు, ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు తగ్గట్టుగా బిజినెస్‌ మోడల్‌ ఉండాలన్నారు. స్థానికంగా లభ్యమయ్యే వస్తువుల ఆధారంగా వ్యాపారం చేస్తే అద్భుతాలు సాధించగలమన్నారు. 

ఇందుకు అనుగుణంగా మహిళా సంఘాల కోసం మంచి బిజినెస్‌ మోడళ్లను అధికారులు గుర్తించాలని సూచించారు. మహిళా సంఘాలను డిమాండ్‌ ఉన్న వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళల ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని.. ఆధార్‌ కేంద్రాలు, మీసేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కలి్పస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయుతనందించేందుకు కలెక్టర్లతో త్వరలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు.

గురువారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా శక్తి రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారీపై డీఆర్‌డీవోలు, అదనపు డీఆర్‌డీవోలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులే ‘మహిళా శక్తి’కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్లు అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్‌లను సకాలంలో అందించిన అధికారులను అభినందించారు. ఆగస్టు 15 న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో జత యూనిఫామ్‌ అందించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. పీఆర్‌ఆర్‌డీ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, టీజీఐఆర్డీ సీఈవో కాత్యాయిని, స్పెషల్‌ కమిషనర్‌ షఫీ ఉల్లా, ఈఎస్‌డీ కమిషనర్‌ రవికిరణ్, శ్రీనిధి ఎండీ విద్యాసాగర్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేడు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్‌: సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రెండు మహిళా శక్తి క్యాంటీన్లను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభించనున్నారు. మహి ళా సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా మహిళల ఆర్థిక పురోగతికి కృషి చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా వీటికి మంత్రి తుదిరూపునిచ్చారు. బిహార్‌లో అమలు చేస్తున్న దీదీ–కి–రసోయి మోడల్‌కు అనుగుణంగా రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లను రూపొందిస్తున్నారు.

సచివాలయంతో పాటు కలెక్టర్‌ ఆఫీస్‌ కేంద్రాలు, ఆసుపత్రులు, పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, ఆర్టీíసీ బస్టాండ్‌లు, ఇండ్రస్టియల్‌ పార్కులు, రిజి్రస్టేషన్‌ ఆఫీసుల్లో వీటిని ఏర్పాటు చేయాలని సంకలి్పంచారు. రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున మొత్తం 150 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్యాంటీన్లు పెట్టే మహిళాసంఘాలకు హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ, వివిధ రూపాల్లో ప్రభుత్వ సహకారాన్ని అందించనున్నారు. క్యాంటీన్ల మోడళ్లను బట్టి ఒక్కో దానికి ఏటా రూ.ఏడున్నర లక్షల నుంచి రూ.12 లక్షల దాకా లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement