ఇడ్లీ పార్శిల్ కడుతున్న చంద్రకాంత్
కర్నూలు (హాస్పిటల్): దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతుండడంతో ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. సిరి ధాన్యాలతో(మిల్లెట్స్‌తో) తయారు చేసిన ఆహారాన్ని తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు వీటిని ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉండగా, మరికొందరు వాటిని ఎలా వండుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసం కొందరు వినూత్న ఆలోచన చేశారు. సిరి ధాన్యాలతో అల్పాహారాన్ని తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. సాధారణ ప్రజలు సైతం వీటిని ఇష్టంగా తింటున్నారు.
రోగులను గమనించి...
కర్నూలుకు చెందిన టి. చంద్రకాంత్ ఎంబీఏ పూర్తి చేశాడు. నాలుగేళ్లు ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. ఈ సమయంలో డయాబెటీస్, బీపీ రోగుల ఇక్కట్లను గమనించాడు. వారికి అవసరమైన ఆహారాన్ని అందించాలని భావించి, కర్నూలు ఆర్‌ఎస్ రోడ్డు సర్కిల్‌లో మొబైల్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశాడు. తల్లి సహాయంతో రాత్రి సమయాల్లో రాగి ఇడ్లి, కొర్ర ఇడ్లి, రాగి దోశ, కొర్ర దోశలను పల్లీ, గోంగూర చట్నీతో అందిస్తున్నాడు. రెండు ఇడ్లీలు రూ.25, దోశ రూ.40 చొప్పున అమ్ముతున్నాడు. వ్యాపారం బాగా జరుగుతోందని, తన ఇద్దరు చెల్లెళ్ల వివాహం కూడా జరిపించినట్లు చంద్రకాంత్ తెలిపారు.
పల్లె నుంచి వచ్చి..
అందరూ ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా వంటి టిఫిన్లు చేస్తారు కానీ వాటికి భిన్నంగా, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తయారు చేయాలని భావించాడు ఎ. మద్దయ్య. సొంత ఊరు అవుకు. అక్కడ ఊళ్లో పొలం పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పిల్లల చదువు కోసం 1999లో కర్నూలుకు వచ్చి శ్రీకృష్ణకాలనీలో స్థిరపడ్డాడు. 2020 నుంచి స్థానిక వెంకట రమణ కాలనీలో రోడ్డులో మిల్లెట్స్ ఫుడ్స్ పేరుతో మొబైల్ క్యాంటీన్ కొనసాగిస్తున్నాడు. కొర్ర ఇడ్లీ, కొర్ర నెయ్యి దోశ, కొర్ర పొంగలి, పాలకూర పూరీలను రుచిగా, శుచిగా అందించడం ప్రారంభించాడు. తక్కువ కాలంలోనే వీటికి ప్రజల ఆదరణ లభించింది. వచ్చిన ఆదాయంతో భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నట్లు మద్దయ్య
తెలిపారు.
మారిన ఆహారపు అలవాట్లు
బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్లనొప్పులు, జీర్ణకోశ సమస్యలు ఉన్న వారికి జీవనశైలి మార్చుకోవాలని, కార్బోహైడ్రేడ్స్ అధికంగా ఉన్న వరి, గోధుమలు, మైదాతో వండి ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ క్రమంలో చిరుధాన్యాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొర్రలు, సామలు, ఆరికెలు, ఊదలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాల విక్రయ కేంద్రాలు జిల్లాలో పలు చోట్ల వెలిశాయి. చాలా మంది చిరు ధాన్యాల ఆహారంవైపు మళ్లుతున్నారు. తాము ఈ ఆహారాన్ని వాడటం వల్ల దీర్ఘకాలిక జబ్బులు తగ్గినట్లు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. దీంతో మిల్లెట్స్‌ను రోజువారీ ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
ఆరోగ్యానికి ఎంతో మేలు
నేను సీడ్స్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాను. కర్నూలులోనే ఉంటూ ఇక్కడి నుంచి ఇతర ఊళ్లకు ప్రతిరోజూ వ్యాపార నిమిత్తం వెళ్తుంటాను. వెంకటరమణ కాలనీలో మిల్లెట్స్ ఫుడ్స్ రుచి చూశాను. ప్రతిరోజూ ఇక్కడే టిఫిన్ చేసి వెళ్తున్నాను. నా లాంటి వారికి ఈ ఆహారం ఎంతో మేలు చేస్తుంది.
– కేశవరెడ్డి, పులివెందుల, వైఎస్సార్ జిల్లా
రాగి దోశ ఇష్టం
నాకు రాగి దోశ తినడం ఇష్టం. అందుకే వారంలో కనీసం మూడు, నాలుగు రోజులైనా వచ్చి ఆర్‌ఎస్ రోడ్డులో టిఫిన్ చేస్తాను. ఇక్కడ దోశలు రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యం కూడా.
–భవానీ శివనరేష్, కర్నూలు
షుగర్ నియంత్రణలో ఉంటుంది
చిరుధాన్యాల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల విరేచనం ఫ్రీగా అవుతుంది. జీర్ణాశయ సమస్యలు తగ్గిపోతాయి. వరి అన్నం తింటే 45 నిమిషాల్లోనే శరీరంలో గ్లూకోజ్‌గా మారుతుంది. అదే చిరు ధాన్యాలు అయితే 4 నుంచి 5 గంటలు సమయం పడుతుంది. దీని వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఒకసారి తింటే త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల బరువు తగ్గుతారు. చిరుధాన్యాల్లో అన్ని రకాల మైక్రో న్యూట్రిషిన్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
– డాక్టర్ ద్వారం ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment