
సాక్షి,సిటీబ్యూరో: రోగంతో బాధపడేవారికి ఉత్తమ వైద్యంతో ఆటు హైజనిక్ ఆహారం చాలా అవసరం. వాస్తవానికి తీసుకునే ఆహారాన్ని బట్టే రోగం తగ్గడమో.. పెరగడమో చేస్తుంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేక ప్రభుత్వం ఆస్పత్రుల్లో చేరుతున్న పేద రోగుల ఆరోగ్యాన్ని అక్కడి మెస్ కాంట్రాక్టర్ మరింత పాడు చేస్తున్నాడు. రోగులకు అందిందు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచినా రోగుల మెనులో మాత్రం ఉడకని కూరలు.. నీళ్లచారు.. కల్తీ నూనెలు.. పురుగుల బియ్యం మాత్రం తప్పడం లేదు. వైద్యులు సూచించిన ఆహారానికి బదులు ఎలాంటి రుచి, శుచి లేని ఆహారాన్ని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు మెస్‌లో తనిఖీలు చేయాల్సిన డైటీషన్లు కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి అటువైపు చూడ్డమే మానేశారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, సరోజినిదేవి, ఫీవర్, ఈఎన్‌టీ, ఛాతి, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంతో పాటు కింగ్‌కోఠి, మలక్‌పేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని క్యాంటీన్ల కాంట్రాక్టర్లు రోగుల ప్రా ణాలతో చెలగాటం ఆడుతున్నా అడిగే నాధుడు లేడు. రోగుల నిష్పత్తికి తగినంత ఆహారం సరఫరా చేస్తున్నారా..లేదా..? పదార్థాల నాణ్యాత ఎలా ఉంది.. అన్నది పట్టించుకున్నదే లేదు.
సగంమంది రోగులకే వడ్డించి..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు ప్రభుత్వం ఉచితంగా ఆహారం అందిస్తుంది. సాధారణ డైట్, హైప్రోటిన్ డైట్ ఇలా వేర్వేరు ధరల ప్రకారం సదరు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంది. అయితే, సదరు కాంట్రాక్టర్లు తీసుకుంటున్న బిల్లులకు.. వడ్డింపులకు పొంతన లేదు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లో నాశిరకం ఆహారాన్ని సరఫరా చేస్తుంటే.. నిలోఫర్, సుల్తాన్ బజార్, పేట్లబురుజు ఆస్పత్రులో మాత్రం కేవలం ఒక్కపూట పచ్చిపాలు, పాడైన బ్రెడ్డుతో సరిపెడుతున్నారు. అసలే బాలింతలు ఆపై సరైన ఆహారం అందక శిశువులకు పాలు పట్టడం లేదు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు దాతలు ఉదయం ఉచితంగా టిఫిన్ సరఫరా చేస్తున్నారు. దీన్ని కూడా సదరు కాంట్రాక్టర్లు తమ ఖాతాలో వేసుకుని బిల్లులు పొందుతున్నారు.
రాత్రి మిగిలింది మరుసటి రోజుకు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాసిరకం, కల్తీ ఆహారం వడ్డిస్తుండడం వల్ల వ్యాధులు నయంకాకపోగా కొత్త రోగాలు చుట్టుమడుతున్నాయి. ఖరీదైన హోటళ్లు, బార్లలో రెండు, మూడు సార్లు మరిగించిన నూనెను ఇక్కడు తెచ్చి దానితోనే తాలింపు పెడుతున్నారు. దీనివల్ల కేన్సర్ బారిన పడే ప్రమాదం లేకపోలేదు. రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లలో నిల్వచేసి మరుసటి రోజు రోగులకు పెడుతున్నారు. వంటశాలలో కనీస శుభ్రత లేదు. ఆహారం తయారీ, రోగులకు పంపిణీ చేస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన ఆస్పత్రుల సూపరింటిండెంట్లు కూడా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టడం లేదు. క్యాంటిన్ కాంట్రాక్టర్లు ఆస్పత్రి అధికారులను ఏ మేరకు మచ్చిక చేసుకున్నారో గాని రోగుల మెనూ సంగతి పటించుకున్న పాపానపోలేదు. మరోపక్క ఇన్‌పేషెంట్ల సంఖ్య కంటే ఎక్కువ మందికి వడ్డించినట్లు బిల్లులు పెడుతున్నారు. సూపరింటిండెంట్స్, ఆర్‌ఎంఓలు వాటాలు పంచుకుని ఈ తంతుకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ‘మా బంధువుకి సుస్తీ చేస్తే ఉస్మానియాలో అడ్మిట్ చేశాం. రోగికి ఆస్పత్రి క్యాంటిన్ నుంచి ఫుడ్డు అందిస్తామన్నారు. తీరా చూస్తే సాంబారు నీళ్లలా ఉంది. గుడ్డు గోళీ కాయాల్లా ఉన్నాయి. అవి కూడా సరిగా ఉడకలేదు. మురిగిపోయిన అరిటిపండ్లు చేతి కిచ్చారు. మరగని పాలు ఇచ్చారు. రోగా అవి తినలేకపోతుండడంతో హోటల్ నుంచి తెప్పించుకున్నాం’ అని మహబూబ్‌నగర్‌కు చెందిన రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
మెనూలో ఒకటి..వడ్డించేది మరొకటి
నిబంధనల ప్రకారం సాధారణ రోగులకు ఉదయం వంద గ్రాముల ఉప్మా, పది గ్రాముల చట్నీ లేదా పాలు బ్రెడ్డు సరఫరా చేయాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో 520 గ్రాముల రైస్, 150 ఎంఎల్ సాంబారు, వంద గ్రాముల కూర, ఉడకబెట్టిన గుడ్డు, శాకాహారులకు వంద గ్రాముల పెరుగు అందిం చాలి. హైప్రొటీన్ డైట్ పేషెంట్లకు ఉదయం అల్పాహారంలో 300 గ్రాముల ఉప్మా, 200 ఎంఎల్ పాలు, రెండు స్పూన్ల పుట్నాల చెట్నీ మధ్యాహ్నం 600 గ్రాముల రైస్, వంద గ్రాముల కూర, ఉడకబెట్టిన గుడ్డు, వంద గ్రాముల పెరుగు, డిన్నర్‌లో 600 గ్రాముల అన్నం, వంద గ్రాముల కూర, వంద గ్రాముల పెరుగు, ఉడక బెట్టిన గుడ్డు లేదా తాజా అరటి పండు అందించాలి. ప్లెయిన్ మిల్క్ డైట్ పేషెంట్లకు అల్పాహారంలో 200 ఎంఎల్ టోన్డ్‌మిల్క్, పది గ్రాముల పంచదార, మధ్యాహ్నం 500 ఎంఎల్ పాలు, 25 గ్రాముల పంచదార, రాత్రి పడుకునే ముందు 400 ఎంఎల్ పాలు 25 గ్రాముల పంచదారతో ఇవ్వాలి. కానీ రోగులకు అందులో సగం కూడా అదడం లేదంటే అతిశయోక్తి కాదు.
Comments
Please login to add a commentAdd a comment