ప్రతీకాత్మక చిత్రం
బెర్హంపూర్: దేశమంతా నిర్బంధంలో ఉన్నా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒడిశాలో కామాంధుల బారిన పడి ఓ గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోయింది. మల్కాన్‌గిరి పోలీస్ క్యాంటీన్‌లో సామూహిక లైంగిక దాడికి గురైన బాధితురాలు మంగళవారం బెర్హంపూర్ ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కన్నుమూసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుర్తుతెలియని దోషులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్టు వెల్లడించారు.
అసలేం జరిగింది?
పోలీసుల నివేదిక ప్రకారం... బాధితురాలు అనారోగ్యం పాలైందని మే 7న బాధితురాలి భర్తకు పోలీస్ క్యాంటీన్ ఇన్‌చార్జి సమాచారం ఇచ్చారు. విషమ పరిస్థితుల్లో ఉన్న ఆమెను మల్కాన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చేర్చారు. తన భార్య శరీరంపై గాయాలను గుర్తించిన బాధితురాలి భర్త మే 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యపై లైంగిక దాడి జరిగిందని అతడు ఆరోపించాడు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను బెర్హంపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె చనిపోయింది. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు మల్కాన్‌గిరి మోడల్ పోలీస్‌స్టేషన్ సీఐ రాంప్రసాద్ నాగ్ తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు చేస్తుందని, నేరానికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని మల్కాన్‌గిరి ఏఎస్‌పీ అన్నారు.
జూన్ 9లోగా నివేదిక ఇవ్వండి: ఓహెచ్‌ఆర్‌సీ
ఈ ఘటనపై దర్యాప్తు జరిపి జూన్ 9లోగా నివేదిక సమర్పించాలని మల్కాన్‌గిరి ఎస్‌పీని ఒడిశా మానవ హక్కుల సంఘం(ఓహెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. సామాజిక కార్యకర్త నమ్రతా చాద్దా ఫిర్యాదుతో ఓహెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఈ నేరంతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని మల్కాన్‌గిరి ఎస్‌పీకి ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి అన్ని రకాల చికిత్సలు అందేలా చూడాలని, వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఇంతకుముందు ఓహెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. రోజు కూలీ అయిన బాధితురాలి భర్తకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని నమ్రత తన పిటిషన్‌లో కోరారు.
పోలీసులపైనే అనుమానం
సాక్షాత్తు పోలీస్ క్యాంటీన్‌లోనే మహిళపై అఘాయిత్యం జరగడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిందితులను ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణం వెనుక పోలీసుల హస్తం ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీస్ క్యాంటీన్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు ఎలా వస్తారు? అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు లేవని అడుగుతున్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే పోలీస్ క్యాంటీన్ సంరక్షకులు ఏమి చేస్తున్నారు? పోలీసులు ఎక్కడ ఉన్నారని నిలదీస్తున్నారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (రైలు దిగగానే.. ‘ముద్ర’ పడింది!)
Comments
Please login to add a commentAdd a comment