ఏది దక్కినా ఓకే..
- పదవి లేదా కాంట్రాక్టు కోసం తెలుగు తమ్ముళ్ల పైరవీలు
- సుజల స్రవంతి, అన్న క్యాంటీన్ కోసం ఒత్తిళ్లు
- పోటాపోటీ లాబీయింగ్
- నేతల చుట్టూ ప్రదక్షిణలు
పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండడంతో పలువురు టీడీపీ నేతలు ఇప్పుడు పదవుల కోసం ఆవురావురమంటు న్నారు. నామినేటెడ్ పీఠాల కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఎమ్మెల్యేలు మొదలుకుని సీనియర్ నేతలు,ఇతర ద్వితీయశ్రేణి నాయకులంతా ఏదోక పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. పోటీపెరగడంతో హైదరాబాద్ వెళ్లి అక్కడే మకాం వేసి బెర్త్ ఖాయం చేసుకుంటున్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు చెప్పడంతో ఏకంగా అధికారులకు ఫోన్లు చేసి పథకాల అమలు ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం : జిల్లాతోపాటు నగరంలోనూ జీవీఎంసీ మేయర్, వుడా ఛైర్మన్, పలు దేవాలయాల కమిటీ ఛైర్మన్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్,జీసీసీ ఛైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఇలా రకరకాల నామినేటెడ్ పదవులు ఇప్పుడు నేతల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే పాత ప్రభుత్వంలో నియమించిన వారంతా తప్పుకోవాలని జీవో ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈస్థానాల్లో తమ క్యాడర్‌ను నియమించుకోవడానికి రంగం సిద్ధం చేస్తుండడంతో జిల్లాలో పార్టీ నేతలు,ఎమ్మెల్యేలు ఎవరికివారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
కాసులు పండించే జీవీఎంసీ మేయర్ అభ్యర్థిత్వంపాటు వుడా ఛైర్మన్,జీసీసీ ఛైర్మన్ తదితర పదవులకు సూట్‌కేసులతో సిద్ధమవుతున్నారు. ఒకపక్క మంత్రులు చుట్టూ తిరుగుతున్నారు. హైదరాబాద్‌లో తిష్టవేసి అధినేత దృష్టిలో పడడం ఇలా బహుముఖ వ్యుహంతో కదులుతున్నారు. జీవీఎంసీ మేయర్ అభ్యర్థిత్వం కోసం బండారు,కోనతాతారావు, వుడా ఛైర్మన్ పోస్టుకు ఎంవీవీఎస్ మూర్తి, మాజీ ఛైర్మన్ రెహ్మాన్ ఇలా పలువురు నేతలు తమస్థాయి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
జీసీసీ ఛైర్మన్ పోస్టుకు మణికుమారి,గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, ఇతర దేవాలయ కమిటీ ఛైర్మన్‌లుగా ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు క్యూ కడుతున్నారు. తొందర్లోనే ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తానని చంద్రబాబు సంకేతాలు ఇవ్వడంతో పదవులు ఆశించే పలువురు నేతలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి హైదరాబాద్ వెళ్లిన ఎమ్మెల్యేల వెంటే వెళ్లారు. వీరంతా ఎమ్మెల్యేల ద్వారా మంత్రులు,చంద్రబాబును కలిసే ప్రయత్నాలు చేస్తుండడం విశేషం.
అయిదేళ్లపాటు నామినేటెడ్ పదవిలో కొనసాగితే సంపాదించే ఆదాయంతో రానున్న ఎన్నికల్లో ధన బలంతో టిక్కెట్ దక్కించుకోవడం సులువవుతుందనే ఆలోచనతో ముందుకు కదులుతున్నారు. కొందరైతే ఇద్దరు జిల్లా మంత్రులైన అయ్యన్న,గంటా చుట్టూనే తిరుగుతున్నారు. ఒకవేళ ఈ పదవులకు పోటీ ఏర్పడి అనుకున్న పోస్టు దక్కకపోతే ప్రభుత్వ పథకాల పనులు దక్కించుకోవడానికి అన్ని నియోజకవర్గాల్లో ఇటీవల ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోయినా ఎమ్మెల్యే అభ్యర్థులకు సహకరించిన నేతలు తమస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్ని ప్రాంతాల్లో మినరల్ వాటర్‌ప్లాంట్లను ఏర్పాటుకు ప్రయత్నిస్తుండడంతో ఆపనిపై కన్నేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో అన్న క్యాంటీన్లను పెడుతుండడంతో సిటీ పార్టీలోకి ఎన్నికలముందు వచ్చి చేరిన కొందరు నేతలు వాటిని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కలెక్టర్,ఇతర అధికారులకు ఫోన్లు చేస్తు ఈ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో ఆరాతీస్తున్నారు. రూ.5లక్షలలోపు కాంట్రాక్టు పనులు నామినేటెడ్ పద్ధతిలో కట్టబెట్టే వీలుండడంతో పంచాయతీ,మున్సిపాల్టీలో భారీగా డబ్బు వెదజల్లి గెలిచిన కొందరు నేతలు ఆపనులపై వాలిపోవడానికి మార్గాలు ఎంచుకుంటున్నారు.