సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారు, మార్కెట్లకు సరుకులు తెచ్చే రైతులు, వ్యాపారుల ఆకలి తీర్చేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నడుంబిగించింది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మహిళా మార్కెట్లను ఏర్పాటు చేసి సమాఖ్య సభ్యులతో దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరింత మంది పట్టణ మహిళా సమాఖ్య సభ్యులకు ఉపాధిని చూపించాలనే లక్ష్యంతో ‘ఆహా’ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది.
యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి ఉండి ముందుకు వచ్చిన మహిళా సమాఖ్య సభ్యులతో ఏర్పాటు చేయిస్తోంది. ఇప్పటికే ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లు విజయవంతం కావడం, సమాఖ్య సభ్యులు ఆదాయం సముపార్జించడంతో పాటు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రాష్ట్రంలోని 110 యూఎల్బీల్లో 140 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా సాధారణ ప్రజలు అధికంగా సంచరించే ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, మార్కెట్లు, మున్సిపల్ కార్యాలయాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తోంది.
రూ.13 వేల చొప్పున ప్రభుత్వ సాయం
పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపాధి చూపాలన్న లక్ష్యంగా మెప్మా కృషి చేస్తోంది. ‘ఆహా’ క్యాంటీన్ల యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చే సంఘ సభ్యులకు రూ. 13 వేల చొప్పున ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. క్యాంటీన్ల ఏర్పాటుకు ఆస్పత్రులు, ఆర్టీసీ, రైల్వే, మార్కెటింగ్ అధికారులతో మెప్మా అధికారులు మాట్లాడి అనుమతులు తీసుకున్నారు.
క్యాంటీన్ల నిర్వాహకులు ప్రతినెలా రూ. 500 చొప్పున స్థానిక టౌన్ లెవెల్ ఫెడరేషన్ (పట్టణ మహిళా సమాఖ్యల సొసైటీ)లో జమ చేసి మరింత మందికి ఆ ర్థిక సాయం అందేలా ఏర్పాట్లు చేశారు. ఆహారాన్ని రుచి, శుచిగా ఇంటి వద్దే వండి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ఏర్పాటు చేసిన కియోస్‌్కల్లో విక్రయిస్తారు.
ఆయా ప్రాంతాల్లోని డిమాండ్, అవసరాలను బట్టి ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాల వరకు విక్రయించేలా అవకాశం కల్పించారు. గరిష్టంగా రూ. 40కే విక్రయించేలా చర్యలు తీసుకున్నారు.
మహిళలకు అండగా ప్రభుత్వం
రాష్ట్రంలోని పట్టణాల్లో గల ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు మెప్మా కృషి చేస్తోంది. ప్రభుత్వం సైతం వారికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే విజయవంతమైన జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మార్టుల తరహాలో మహిళలకు ఉపాధి కల్పించనున్నాం.
ప్రజలకు తక్కువ ధరలో మంచి ఆహారం అందించేందుకు 140 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నాం. అవసరాన్ని బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తాం. లాభాలను నిర్వాహకులే తీసుకుంటారు. టౌన్ లెవెల్ ఫెడరేషన్ అకౌంట్‌లో జమచేసే నగదును సంఘ సభ్యులు రుణాలుగా తీసుకుంటారు. అంటే ప్రతి రూపాయి ఆ పట్టణంలోని సంఘ సభ్యులే తీసుకుంటారు. నిర్వహణ పర్యవేక్షణను మెప్మా సిబ్బంది చూస్తారు. – వి. విజయలక్ష్మి, మెప్మా ఎండీ
ఒక్కపూట రూ. 3 వేల వ్యాపారం
పదిహేను రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో మెప్మా సహకారంతో ఆహా క్యాంటీన్ ప్రారంభించాం. ముగ్గురం సభ్యులం కలిసి సాయంత్రం వేళ జొన్న, సజ్జ రొట్టెలు, భోజనం పెట్టాం. కేవలం 2.30 గంటలు మాత్రమే ఇక్కడ ఉంటాం. పూటకు రూ. 3 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం టిఫిన్లు కూడా పెట్టాలని నిర్ణయించాం. అప్పుడు ఇంకా ఎక్కువ వ్యాపారం, ఆదాయం వస్తుంది. పదార్థాలు మా ఇళ్లల్లోనే తయారు చేసి తెస్తున్నాం. ఆహా క్యాంటీన్‌తో మాకు ఉపాధి లభించింది. – పి.జయలక్ష్మి, ఆహా క్యాంటీన్ నిర్వాహకురాలు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment