మహిళోదయం | Jagananna Mahila Mart was established with 26,850 members | Sakshi
Sakshi News home page

మహిళోదయం

Published Wed, Mar 8 2023 3:28 AM | Last Updated on Wed, Mar 8 2023 3:28 AM

Jagananna Mahila Mart was established with 26,850 members - Sakshi

శ్రీకాకుళానికి చెందిన సుగుణరెడ్డి, రత్నకుమారి, రమాదేవి, నాగలక్ష్మి, విజయ ఇంటిని చక్కదిద్దుకునే దిగువ మధ్యతరగతి  గృహిణులు. 18,364 మంది మహిళా సమాఖ్య సభ్యులతో కలసి పట్టణంలో ఫిబ్రవరిలో జగనన్న మహిళా మార్టు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి నుంచి  రూ.150 చొప్పున మొత్తం రూ.27,54,600 స్త్రీనిధిగా సేకరించారు. మొదటి నెలలో రూ.10,75,013 మేర వ్యాపారం చేయడంతోపాటు రూ.లక్ష లాభం కూడా ఆర్జించారు.

కస్తూరి, ప్రీతి, ఇందిర, ప్రియ, హిమబిందు చిత్తూరుకు చెందిన మహిళా సమాఖ్య సభ్యులు. పట్టణంలో 26,850 మంది సభ్యులతో కలసి జగనన్న మహిళా మార్ట్‌ నెలకొల్పారు. రూ.40,27,500 స్త్రీనిధిని సేకరించి నెలకు రూ.32,56,152 మేర వ్యాపారం చేస్తున్నారు.  

ఏ బిజినెస్‌ స్కూల్‌లో పట్టాలు పొందలేదు.. ఆ మాటకొస్తే పెద్దగా చదువుకోలేదు.. గతంలో వ్యాపార అనుభవం కూడా లేదు. సంఘటితంగా మారి ‘పొదుపు’ బాట పట్టారు. సామాన్య మహిళలైన వీరంతా జగనన్న మహిళా మార్టుల ద్వారా వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తున్నారు. పులివెందుల,  అద్దంకి, రాయచోటి, తిరుపతి, పుంగనూరు సహా మొత్తం ఏడు చోట్ల జగనన్న మహిళా మార్ట్‌లను సమాఖ్య సభ్యులే నెలకొల్పి విజయవంతంగా నడిపిస్తున్నారు.

పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అందించిన శిక్షణతో  ఇంత పెద్ద విజయాన్ని సాధించారు. ఏడు మార్టుల్లో 1.19 లక్షల మందికి పైగా స్వయం సహాయక సంఘాల సభ్యులు వాటాదార్లుగా రూ.1.79 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ప్రతి నెలా రూ.1.35 కోట్ల టర్నోవర్‌ చేస్తున్నారు. సభ్యులే కమిటీలుగా ఏర్పడి సరుకు కొనుగోలు, నాణ్యత, నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇంటి సరుకుల కోసం చేసే ఖర్చును తగ్గించుకునేందుకు  చేపట్టిన ఈ ప్రాజెక్టు పట్టణ ప్రాంత  మహిళల్లో కొత్త శక్తిని నింపుతోంది.  – సాక్షి, అమరావతి 

రెండేళ్ల క్రితం పులివెందులలో  ‘మెప్మా’ అందించిన సాయంతో ప్రారంభమైన ‘జగనన్న మహిళా మార్ట్‌’ ప్రస్థానం ఏడు పట్టణాలకు విస్తరించింది. మహిళా సమాఖ్యలోని సభ్యులంతా దిగువ మధ్య తరగతి, నిరుపేద కుటుంబా­లకు చెందినవారే. ఇంటి అవసరాల సరుకులు కొనేందుకు ప్రతి నెలా కనీసం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు చేస్తు­ంటారు. మహిళా మార్టుల్లో వాటాదార్లకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు.

షాపులో సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్ల కంటే సభ్యు­లకు 0.50% అదనంగా డిస్కౌంట్‌ ఇస్తున్నారు. దీంతో ఇప్పు­డు ఒక్కో కుటుంబం నెలకు కనీసం రూ.700 నుంచి రూ.1,000 వరకు ఆదా చేయగలుగుతోంది. పేదలకు అది పెద్ద మొత్తమే. రూ.150 వాటాకు జీవితకాల సభ్యత్వంతోపాటు లాభాల్లో ఏటా 33 శాతం డివిడెండ్‌ రూపంలో చెల్లిస్తున్నారు. మూడేళ్లలో పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడంతో పాటు కొనుగోళ్లలో అదనపు డిస్కౌంట్‌ దక్కుతోంది. 

6 వేల నుంచి 37 వేల మంది సభ్యులు  
పట్టణ ప్రాంతాల్లోని మహిళా సమాఖ్యల సభ్యులతో మెప్మా స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. స్థానికంగా ఉన్న సభ్యులతో సమావేశాలు నిర్వహించి వ్యాపారంపై పూర్తి అవగాహన కల్పించాక వాటాదార్లుగా చేర్చుకుంటున్నారు. పట్టణాన్ని బట్టి ఒక్కో మార్టులో 6 వేల మంది నుంచి గరిష్టంగా 37 వేల మంది వరకు వాటాదార్లుగా ఉన్నారు. పులివెందుల స్టోర్‌లో 8 వేల మంది రూ.12 లక్షలు పెట్టుబడిగా పెట్టి ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వ్యాపారం చేస్తున్నారు. తిరుపతిలో 37,309 మంది సభ్యులు కలిసి రూ.56 లక్షలు వాటాగా పెట్టి ప్రతి నెలా రూ.29.88 లక్షల మేర వ్యాపారం చేస్తున్నారు.  

‘స్వయం’కృషితో ఎదిగిన స్త్రీ శక్తి 
మహిళా సమాఖ్యలు ప్రభుత్వం అందించే సాయాన్ని ఇన్నేళ్లు ఇంటి అవసరాలకే వినియోగించుకుంటుండగా వారికి ఆర్థిక స్వావలంబన ద్వారా సుస్థిర జీవనోపాధికి మార్గం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ‘మెప్మా’ ఎండీ విజయలక్ష్మి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సభ్యులంతా కలిసి సూపర్‌ మార్కెట్లు నెలకొల్పవచ్చని మహిళలకు వివరించారు. వారితో పలు దఫాలు సమావేశాలు నిర్వహించి ఎలా ముందుకెళ్లాలో మార్గనిర్దేశం చేశారు.

సమాఖ్య సభ్యులపై భారం లేకుండా ఒక్కొక్కరి పెట్టుబడి కేవలం రూ.150గా నిర్ణయించారు. ‘జగనన్న మహిళా మార్ట్‌’ పేరుతో 2021 జనవరి 3న తొలి మార్ట్‌ను పులివెందులలో ఏర్పాటు చేశారు. ఏడాది కాలంలోనే ఈ స్టోర్‌ రూ.2.50 కోట్ల మేర వ్యాపారం చేయడంతో పాటు వాటాదార్లకు లాభాల్లో 33 శాతం డివిడెంట్‌గా చెల్లించింది. గతేడాది జనవరిలో రాయచోటిలో నెలకొల్పిన జగనన్న మహిళా మార్ట్‌ మొదటి నెలలోనే రూ.14 లక్షల మేర వ్యాపారం చేసింది.

ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రారంభమైన స్టోర్‌ సైతం రూ.10.72 లక్షల వ్యాపారం నిర్వహించింది. ఈ మూడు స్టోర్లు విజయవంతం కావడంతో తిరుపతి, పుంగనూరు, చిత్తూరులోనూ జగనన్న మహిళా మార్ట్‌లను మెప్మా ఎండీ అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళంలోనూ మార్ట్‌ను ప్రా­రం­భించారు. ఏడుచోట్ల నెలకు రూ.1.35 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నారు.

నాణ్యతే ప్రమాణంగా వ్యాపార శిక్షణ  
వ్యాపారం ఏదైనా సరే నాణ్యతే పెట్టుబడిగా ఉంటే మంచి సరుకులు ఎక్కడున్నా కొనుగోలుదారులు వస్తుంటారు. ఈ సూత్రంతోనే స్టోర్ల భాగస్వాములైన మహిళా సమాఖ్య సభ్యులకు మెప్మా శిక్షణ ఇచ్చింది. స్టోర్‌ నిర్వహణ, సరుకుల కొనుగోలు, నాణ్యత పరిశీలనకు, ఖాతాల నిర్వహణకు వాటా­దార్లుగా ఉన్న మహిళల­తోనే కమిటీలు ఏర్పా­ట­య్యాయి. దీంతో వ్యాపార నిర్వహణ తేలికైంది. ఎక్కడ నాణ్యమైన సరుకులు దొరుకుతా­యో అక్కడి నుంచే నేరుగా కొనుగోలు చేసి అమ్మకానికి ఉంచుతున్నారు. మహిళా సమాఖ్య సభ్యులు సొంతంగా తయారు చేసిన వస్తువులను సైతం ఇక్కడ విక్రయించే ఏర్పాట్లు చేశారు.

మార్ట్‌ల్లో గృహ అవసరాలకు వినియోగించే అన్ని వస్తువులను అమ్ముతు­న్నారు. పెద్దగా లాభాలు ఆశించకుండా నాణ్యమైన సరు­కుల­ను అందిస్తుండటంతో ప్రజలకు వీటిపై నమ్మకం పెరిగింది. ప్రతి మార్ట్‌లోనూ ఒకే ధర ఉంటుంది. అన్నింటికీ ఒకే సాఫ్ట్‌వేర్‌ వినియోగిస్తుండడంతో నిర్వహణ తేలికైంది. జగనన్న మహిళా మార్టులు కార్పొరేట్‌ సూపర్‌ మార్కెట్లను తలదన్నేలా ఉండడమే కాకుండా లాభాల బాటలో నడుస్తున్నాయి.

ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా... 
ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచనల మేరకు పట్టణ పేద మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా జగనన్న మహిళా మార్ట్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఏడు స్టోర్లు విజయవంతంగా నడుస్తున్నాయి. స్వయం సహాయక గ్రూప్‌ మహిళలకు వీటి ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛందంగా రూ.150 పెట్టుబడిగా పెడుతున్నారు. పులివెందుల స్టోర్‌ వాటాదారులు డివిడెంట్‌ కూడా తీసుకున్నారు.

అన్ని స్టోర్లలోనూ ఒకే విధంగా మార్కెట్‌ కంటే తక్కువ ధరలుంటాయి. అన్ని స్టోర్లను అనుసంధానిస్తూ ఏకీకృత సాఫ్ట్‌వేర్‌ రూపొందించాం. స్థానిక మున్సిపాలిటీకి చెందిన వ్యాపార సముదాయల్లో షాపులను నెలకొల్పడం ద్వారా అద్దె భారం తగ్గుతోంది. సరుకులు కొనుగోళ్లను మార్ట్‌ కమిటీ సభ్యులే స్వయంగా చూసుకుంటున్నారు. మార్ట్‌లు అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతం కావడం ఆనందంగా ఉంది. ప్రతి మునిసిపాలిటీలో ఒక స్టోర్‌ ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నాం.   – విజయలక్ష్మి, మెప్మా ఎండీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement