Mahila samakhya
-
పట్టణాల్లో ‘ఆహా’ క్యాంటీన్లు
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారు, మార్కెట్లకు సరుకులు తెచ్చే రైతులు, వ్యాపారుల ఆకలి తీర్చేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నడుంబిగించింది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మహిళా మార్కెట్లను ఏర్పాటు చేసి సమాఖ్య సభ్యులతో దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరింత మంది పట్టణ మహిళా సమాఖ్య సభ్యులకు ఉపాధిని చూపించాలనే లక్ష్యంతో ‘ఆహా’ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి ఉండి ముందుకు వచ్చిన మహిళా సమాఖ్య సభ్యులతో ఏర్పాటు చేయిస్తోంది. ఇప్పటికే ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లు విజయవంతం కావడం, సమాఖ్య సభ్యులు ఆదాయం సముపార్జించడంతో పాటు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రాష్ట్రంలోని 110 యూఎల్బీల్లో 140 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా సాధారణ ప్రజలు అధికంగా సంచరించే ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, మార్కెట్లు, మున్సిపల్ కార్యాలయాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తోంది. రూ.13 వేల చొప్పున ప్రభుత్వ సాయం పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపాధి చూపాలన్న లక్ష్యంగా మెప్మా కృషి చేస్తోంది. ‘ఆహా’ క్యాంటీన్ల యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చే సంఘ సభ్యులకు రూ. 13 వేల చొప్పున ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. క్యాంటీన్ల ఏర్పాటుకు ఆస్పత్రులు, ఆర్టీసీ, రైల్వే, మార్కెటింగ్ అధికారులతో మెప్మా అధికారులు మాట్లాడి అనుమతులు తీసుకున్నారు. క్యాంటీన్ల నిర్వాహకులు ప్రతినెలా రూ. 500 చొప్పున స్థానిక టౌన్ లెవెల్ ఫెడరేషన్ (పట్టణ మహిళా సమాఖ్యల సొసైటీ)లో జమ చేసి మరింత మందికి ఆ ర్థిక సాయం అందేలా ఏర్పాట్లు చేశారు. ఆహారాన్ని రుచి, శుచిగా ఇంటి వద్దే వండి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ఏర్పాటు చేసిన కియోస్‌్కల్లో విక్రయిస్తారు. ఆయా ప్రాంతాల్లోని డిమాండ్, అవసరాలను బట్టి ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాల వరకు విక్రయించేలా అవకాశం కల్పించారు. గరిష్టంగా రూ. 40కే విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. మహిళలకు అండగా ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణాల్లో గల ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు మెప్మా కృషి చేస్తోంది. ప్రభుత్వం సైతం వారికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే విజయవంతమైన జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మార్టుల తరహాలో మహిళలకు ఉపాధి కల్పించనున్నాం. ప్రజలకు తక్కువ ధరలో మంచి ఆహారం అందించేందుకు 140 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నాం. అవసరాన్ని బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తాం. లాభాలను నిర్వాహకులే తీసుకుంటారు. టౌన్ లెవెల్ ఫెడరేషన్ అకౌంట్లో జమచేసే నగదును సంఘ సభ్యులు రుణాలుగా తీసుకుంటారు. అంటే ప్రతి రూపాయి ఆ పట్టణంలోని సంఘ సభ్యులే తీసుకుంటారు. నిర్వహణ పర్యవేక్షణను మెప్మా సిబ్బంది చూస్తారు. – వి. విజయలక్ష్మి, మెప్మా ఎండీ ఒక్కపూట రూ. 3 వేల వ్యాపారం పదిహేను రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో మెప్మా సహకారంతో ఆహా క్యాంటీన్ ప్రారంభించాం. ముగ్గురం సభ్యులం కలిసి సాయంత్రం వేళ జొన్న, సజ్జ రొట్టెలు, భోజనం పెట్టాం. కేవలం 2.30 గంటలు మాత్రమే ఇక్కడ ఉంటాం. పూటకు రూ. 3 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం టిఫిన్లు కూడా పెట్టాలని నిర్ణయించాం. అప్పుడు ఇంకా ఎక్కువ వ్యాపారం, ఆదాయం వస్తుంది. పదార్థాలు మా ఇళ్లల్లోనే తయారు చేసి తెస్తున్నాం. ఆహా క్యాంటీన్‌తో మాకు ఉపాధి లభించింది. – పి.జయలక్ష్మి, ఆహా క్యాంటీన్ నిర్వాహకురాలు, కర్నూలు -
మహిళోదయం
శ్రీకాకుళానికి చెందిన సుగుణరెడ్డి, రత్నకుమారి, రమాదేవి, నాగలక్ష్మి, విజయ ఇంటిని చక్కదిద్దుకునే దిగువ మధ్యతరగతి గృహిణులు. 18,364 మంది మహిళా సమాఖ్య సభ్యులతో కలసి పట్టణంలో ఫిబ్రవరిలో జగనన్న మహిళా మార్టు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.150 చొప్పున మొత్తం రూ.27,54,600 స్త్రీనిధిగా సేకరించారు. మొదటి నెలలో రూ.10,75,013 మేర వ్యాపారం చేయడంతోపాటు రూ.లక్ష లాభం కూడా ఆర్జించారు. కస్తూరి, ప్రీతి, ఇందిర, ప్రియ, హిమబిందు చిత్తూరుకు చెందిన మహిళా సమాఖ్య సభ్యులు. పట్టణంలో 26,850 మంది సభ్యులతో కలసి జగనన్న మహిళా మార్ట్ నెలకొల్పారు. రూ.40,27,500 స్త్రీనిధిని సేకరించి నెలకు రూ.32,56,152 మేర వ్యాపారం చేస్తున్నారు. ఏ బిజినెస్ స్కూల్లో పట్టాలు పొందలేదు.. ఆ మాటకొస్తే పెద్దగా చదువుకోలేదు.. గతంలో వ్యాపార అనుభవం కూడా లేదు. సంఘటితంగా మారి ‘పొదుపు’ బాట పట్టారు. సామాన్య మహిళలైన వీరంతా జగనన్న మహిళా మార్టుల ద్వారా వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తున్నారు. పులివెందుల, అద్దంకి, రాయచోటి, తిరుపతి, పుంగనూరు సహా మొత్తం ఏడు చోట్ల జగనన్న మహిళా మార్ట్లను సమాఖ్య సభ్యులే నెలకొల్పి విజయవంతంగా నడిపిస్తున్నారు. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అందించిన శిక్షణతో ఇంత పెద్ద విజయాన్ని సాధించారు. ఏడు మార్టుల్లో 1.19 లక్షల మందికి పైగా స్వయం సహాయక సంఘాల సభ్యులు వాటాదార్లుగా రూ.1.79 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ప్రతి నెలా రూ.1.35 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు. సభ్యులే కమిటీలుగా ఏర్పడి సరుకు కొనుగోలు, నాణ్యత, నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇంటి సరుకుల కోసం చేసే ఖర్చును తగ్గించుకునేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు పట్టణ ప్రాంత మహిళల్లో కొత్త శక్తిని నింపుతోంది. – సాక్షి, అమరావతి రెండేళ్ల క్రితం పులివెందులలో ‘మెప్మా’ అందించిన సాయంతో ప్రారంభమైన ‘జగనన్న మహిళా మార్ట్’ ప్రస్థానం ఏడు పట్టణాలకు విస్తరించింది. మహిళా సమాఖ్యలోని సభ్యులంతా దిగువ మధ్య తరగతి, నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఇంటి అవసరాల సరుకులు కొనేందుకు ప్రతి నెలా కనీసం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు చేస్తుంటారు. మహిళా మార్టుల్లో వాటాదార్లకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. షాపులో సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్ల కంటే సభ్యులకు 0.50% అదనంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఒక్కో కుటుంబం నెలకు కనీసం రూ.700 నుంచి రూ.1,000 వరకు ఆదా చేయగలుగుతోంది. పేదలకు అది పెద్ద మొత్తమే. రూ.150 వాటాకు జీవితకాల సభ్యత్వంతోపాటు లాభాల్లో ఏటా 33 శాతం డివిడెండ్ రూపంలో చెల్లిస్తున్నారు. మూడేళ్లలో పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడంతో పాటు కొనుగోళ్లలో అదనపు డిస్కౌంట్ దక్కుతోంది. 6 వేల నుంచి 37 వేల మంది సభ్యులు పట్టణ ప్రాంతాల్లోని మహిళా సమాఖ్యల సభ్యులతో మెప్మా స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. స్థానికంగా ఉన్న సభ్యులతో సమావేశాలు నిర్వహించి వ్యాపారంపై పూర్తి అవగాహన కల్పించాక వాటాదార్లుగా చేర్చుకుంటున్నారు. పట్టణాన్ని బట్టి ఒక్కో మార్టులో 6 వేల మంది నుంచి గరిష్టంగా 37 వేల మంది వరకు వాటాదార్లుగా ఉన్నారు. పులివెందుల స్టోర్‌లో 8 వేల మంది రూ.12 లక్షలు పెట్టుబడిగా పెట్టి ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వ్యాపారం చేస్తున్నారు. తిరుపతిలో 37,309 మంది సభ్యులు కలిసి రూ.56 లక్షలు వాటాగా పెట్టి ప్రతి నెలా రూ.29.88 లక్షల మేర వ్యాపారం చేస్తున్నారు. ‘స్వయం’కృషితో ఎదిగిన స్త్రీ శక్తి మహిళా సమాఖ్యలు ప్రభుత్వం అందించే సాయాన్ని ఇన్నేళ్లు ఇంటి అవసరాలకే వినియోగించుకుంటుండగా వారికి ఆర్థిక స్వావలంబన ద్వారా సుస్థిర జీవనోపాధికి మార్గం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ‘మెప్మా’ ఎండీ విజయలక్ష్మి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సభ్యులంతా కలిసి సూపర్ మార్కెట్లు నెలకొల్పవచ్చని మహిళలకు వివరించారు. వారితో పలు దఫాలు సమావేశాలు నిర్వహించి ఎలా ముందుకెళ్లాలో మార్గనిర్దేశం చేశారు. సమాఖ్య సభ్యులపై భారం లేకుండా ఒక్కొక్కరి పెట్టుబడి కేవలం రూ.150గా నిర్ణయించారు. ‘జగనన్న మహిళా మార్ట్’ పేరుతో 2021 జనవరి 3న తొలి మార్ట్‌ను పులివెందులలో ఏర్పాటు చేశారు. ఏడాది కాలంలోనే ఈ స్టోర్ రూ.2.50 కోట్ల మేర వ్యాపారం చేయడంతో పాటు వాటాదార్లకు లాభాల్లో 33 శాతం డివిడెంట్‌గా చెల్లించింది. గతేడాది జనవరిలో రాయచోటిలో నెలకొల్పిన జగనన్న మహిళా మార్ట్ మొదటి నెలలోనే రూ.14 లక్షల మేర వ్యాపారం చేసింది. ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రారంభమైన స్టోర్ సైతం రూ.10.72 లక్షల వ్యాపారం నిర్వహించింది. ఈ మూడు స్టోర్లు విజయవంతం కావడంతో తిరుపతి, పుంగనూరు, చిత్తూరులోనూ జగనన్న మహిళా మార్ట్లను మెప్మా ఎండీ అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళంలోనూ మార్ట్‌ను ప్రారంభించారు. ఏడుచోట్ల నెలకు రూ.1.35 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నారు. నాణ్యతే ప్రమాణంగా వ్యాపార శిక్షణ వ్యాపారం ఏదైనా సరే నాణ్యతే పెట్టుబడిగా ఉంటే మంచి సరుకులు ఎక్కడున్నా కొనుగోలుదారులు వస్తుంటారు. ఈ సూత్రంతోనే స్టోర్ల భాగస్వాములైన మహిళా సమాఖ్య సభ్యులకు మెప్మా శిక్షణ ఇచ్చింది. స్టోర్ నిర్వహణ, సరుకుల కొనుగోలు, నాణ్యత పరిశీలనకు, ఖాతాల నిర్వహణకు వాటాదార్లుగా ఉన్న మహిళలతోనే కమిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో వ్యాపార నిర్వహణ తేలికైంది. ఎక్కడ నాణ్యమైన సరుకులు దొరుకుతాయో అక్కడి నుంచే నేరుగా కొనుగోలు చేసి అమ్మకానికి ఉంచుతున్నారు. మహిళా సమాఖ్య సభ్యులు సొంతంగా తయారు చేసిన వస్తువులను సైతం ఇక్కడ విక్రయించే ఏర్పాట్లు చేశారు. మార్ట్‌ల్లో గృహ అవసరాలకు వినియోగించే అన్ని వస్తువులను అమ్ముతున్నారు. పెద్దగా లాభాలు ఆశించకుండా నాణ్యమైన సరుకులను అందిస్తుండటంతో ప్రజలకు వీటిపై నమ్మకం పెరిగింది. ప్రతి మార్ట్‌లోనూ ఒకే ధర ఉంటుంది. అన్నింటికీ ఒకే సాఫ్ట్వేర్ వినియోగిస్తుండడంతో నిర్వహణ తేలికైంది. జగనన్న మహిళా మార్టులు కార్పొరేట్ సూపర్ మార్కెట్లను తలదన్నేలా ఉండడమే కాకుండా లాభాల బాటలో నడుస్తున్నాయి. ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా... ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల మేరకు పట్టణ పేద మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా జగనన్న మహిళా మార్ట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఏడు స్టోర్లు విజయవంతంగా నడుస్తున్నాయి. స్వయం సహాయక గ్రూప్ మహిళలకు వీటి ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛందంగా రూ.150 పెట్టుబడిగా పెడుతున్నారు. పులివెందుల స్టోర్ వాటాదారులు డివిడెంట్ కూడా తీసుకున్నారు. అన్ని స్టోర్లలోనూ ఒకే విధంగా మార్కెట్ కంటే తక్కువ ధరలుంటాయి. అన్ని స్టోర్లను అనుసంధానిస్తూ ఏకీకృత సాఫ్ట్వేర్ రూపొందించాం. స్థానిక మున్సిపాలిటీకి చెందిన వ్యాపార సముదాయల్లో షాపులను నెలకొల్పడం ద్వారా అద్దె భారం తగ్గుతోంది. సరుకులు కొనుగోళ్లను మార్ట్ కమిటీ సభ్యులే స్వయంగా చూసుకుంటున్నారు. మార్ట్లు అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతం కావడం ఆనందంగా ఉంది. ప్రతి మునిసిపాలిటీలో ఒక స్టోర్ ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నాం. – విజయలక్ష్మి, మెప్మా ఎండీ -
ప్రచారానికి రాకపోతే పసుపు కుంకుమ రానివ్వం
సాక్షి, యలమంచిలి: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఆయన సతీమణి సూర్యకుమారి చేస్తున్న ఎన్నికల ప్రచారం డ్వాక్రా మహిళలకు కొత్త చిక్కులు తెచ్చింది. ఎమ్మెల్యే నిమ్మల ఆదేశాలతో స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారానికి రాకపోతే మీకు వచ్చే పసుపు కుంకుమ సొమ్ములు, డ్వాక్రా రుణాలు, రాయితీలు, కుట్టుమిషన్లు రానివ్వబోమని డ్వాక్రా లీడర్లను, అంగన్వాడీ టీచర్లను, మధ్యాహ్న భోజన పథకం వలంటీర్లను భయపెడుతున్నారు. ప్రచారానికి మీరు రావడమే కాదు డ్వాక్రా సంఘాల్లోని మహిళలను కూడా తీసుకురావాలని లీడర్లను ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం లీడర్ల బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడుతున్న డ్వాక్రా లీడర్లు మహిళల వద్దకు వెళ్లి నయానో భయానో వారిని ఎన్నికల ప్రచారానికి తరలిస్తున్నారు. ఎండలు మండిపోతుండుటతో మహిళలు ప్రచారంలో తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రచారానికి వెళ్లకపోతే పసుపు కుంకుమ సొమ్ములు పడవని తమ డాక్రా లీడర్ భయపెడుతోందని మహిళలు వాపోతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున డ్వాక్రా సీఎలు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన పథకం వలంటీర్లు ప్రచారంలో పాల్గొనకూడదు. అధికార పార్టీ నాయకులకు ఇవేమీ పట్టడం లేదు. ఎన్నికల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. -
డ్వాక్రా రుణాల చెల్లింపులో అవకతవకలు
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: బ్యాంకు నుంచి తీసుకున్న డ్వాక్రా రుణాలను ఏనెల కానెల చెల్లిస్తున్నా నగదు బ్యాంకులో జమకాకపోవడంపై జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు లక్కవరం ఆంధ్రాబ్యాంకు వద్ద, ప్రధాన రహదారిపై బుధవారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం బ్యాంకులో వేసిన పసుపు–కుంకుమ పథకంలో నగదును తీసుకునేందుకు ఈనెల 19న లక్కవరం ఆంధ్రాబ్యాంకు దుర్గాభవాని గ్రూప్ సభ్యులు వెళ్లగా గత 12 నెలలుగా తీసుకున్న రుణానికి నగదు జమచేయడం లేదంటూ బ్యాంకు అధికారులు చెప్పడంతో ఈ గ్రూపు సభ్యులు నిమ్మలగూడెంలో మిగతా గ్రూపులకు కూడా సమాచారం అందించారు. దీంతో 24 గ్రూపులకు చెందిన మహిళా సంఘాల సభ్యులు బుధవారం లక్కవరం బ్యాంకు వచ్చి తమ ఖాతాలను చెక్‌చేసుకోవడంతో గత 14 నెలలుగా చెల్లిస్తున్న నగదు జమకాకపోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రతీ నెలా డ్వాక్రా సీఎ నందమూరి లక్ష్మి ద్వారా బ్యాంకు మిత్ర కె.రాజేశ్వరికి రుణాన్ని చెల్లిస్తున్నామని, తాము చెల్లించిన సొమ్ము నెలల తరబడి బ్యాంకులో జమకాకపోవడం ఏమిటని దీనిపై అధికారులు విచారణ చేపట్టి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డ్వాక్రా మహిళలు కందుల నరసమ్మ, బల్లే వెంకటలక్ష్మి, దాసరి దుర్గ, ఉగ్గం రామలక్ష్మి, మాసం దుర్గమ్మ, లేగల వెంకట సుబ్బలక్షిమ, దాసరం నక్షత్రం డిమాండ్ చేశారు. 24 గ్రూపుల మీద చెల్లించిన సుమారు రూ.20 నుంచి రూ.24 లక్షల వరకు బ్యాంకులో జమకాలేదని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. దీనిపై డ్వాక్రా సంఘాలు లక్కవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే వెలుగు ఏపీఎం ఝాన్సీ మహిళా సంఘాల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై ఏలూరు నుంచి ఆంధ్రాబ్యాంకు ఏజీఎం సీహెచ్ నాగేశ్వరరావు విచారణ చేపట్టారు. ఆందోళన చేపట్టిన మహిళా సంఘాలకు లక్కవరం వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. పార్టీ నాయకులు పత్తి వీరాస్వామి, సయ్యద్ మస్తాన్, చిట్టిబొమ్మ శివరామకృష్ణ, మన్నెల్లి సూర్య, దల్లి నాగేశ్వరరావు తదితరులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. -
మహిళా సంఘాలకు ట్యాబ్‌ల పంపిణీ
రామాయంపేట(మెదక్) : మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పాటు, ఆర్థిక çపరిపుష్టి సాధించడానికి వీలుగా గ్రూపు లీడర్లకు ట్యాబ్‌లు అందజేస్తున్నామని స్త్రీశక్తి జోనల్ మేనేజర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐకేపీ భవనంలో వివిధ గ్రూపుల లీడర్లకు ట్యాబ్‌లు అందించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈట్యాబ్‌లు కేవలం రుణప్రక్రియతోపాటు సంఘాల కార్యక్రమాలకు మాత్రమే వినియోగపడుతాయన్నారు. సభ్యులకు రూ. 25 వేలనుంచి రూ. లక్ష వరకు రుణాలిస్తున్నామన్నారు. ఇందుకు రూ. మూడు లక్షలకు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో సంఘాలకు మరిన్ని పథకాలు అనుసంధానించనున్నారని ఆయన పేర్కొన్నారు. తన పరిధిలో ఉన్న మెదక్, వరంగల్ అర్బన్, జనగాం, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం మూడు వేల సంఘాలుండగా, మొత్తం నాలుగున్నర లక్షల మంది సభ్యులున్నారని సంజివరెడ్డి పేర్కొన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు వడ్డీలేని రుణం (వీఎల్ఆర్) మంజూరు కాలేదని, కాగా రికవరీ మాత్రం 98.8 శాతం ఉందన్నారు. 2018–19లో జోన్ పరిధిలో రూ.421 కోట్లమేర రుణాలిచ్చామని, ప్రతి సభ్యురాలికి రూ. 25 వేల ఉచిత భీమా వర్తిస్తుందని జోన్ మేనేజర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రూపుల లీడర్లకు ట్యాబ్‌ల పనితీరుపై సంఘం రిజీనల్ మేనేజర్ అనంతకిశోర్ శిక్షణ ఇచ్చారు. సమావేశంలో స్థానిక ఏపీఎం సత్యం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజూల, జిల్లా మేనేజర్ వరలక్ష్మి, సీసీలు కిషన్, మల్లేశం, శ్రీనివాసరెడ్డి, స్వరూప, లక్ష్మి, అమృత తదితరులు పాల్గొన్నారు. -
బెల్టుషాపులపై ఉద్యమం
అనంతపురం అర్బన్ : మద్యం వ్యాపారాన్ని నియంత్రించి, బెల్టుషాపులను ప్రభుత్వం ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మహిళ సంఘాల నాయకురాళ్లు హెచ్చరించారు. బెల్టుషాపులు ఎత్తివేయాలనే అంశంపై శనివారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్లో ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.పద్మావతి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, వైఎస్ఆర్ మహిళ విభాగం నగర అధ్యక్షురాలు శ్రీనదేవి, హెచ్ఆర్సీ ప్రతినిధి మునీరా, మహిళ సమాఖ్య గౌరవాధ్యక్షురాలు చిరంజీవమ్మ, జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడారు. బెల్టు షాపులు ఎత్తివేసి, మద్యాన్ని నియంత్రిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా హామీని నిలబెట్టుకోలేదని దుమ్మెత్తిపోశారు. మద్యం వల్ల నేరాలు ఎక్కువవుతున్నాయని, ప్రత్యేకించి మహిళలపై దాడులు, అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మద్యపానాన్ని అరికట్టాలని, బెల్టుషాపులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలు పార్వతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగమే పెద్దనోట్ల రద్దు
విజయవాడ (గాంధీనగర్) : పెద్దనోట్ల రద్దు ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయంతో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయన్నారు. సామాన్యులు పాలకులను తిడుతున్నాయని, అంబానీ, అడ్వాణీ వంటి కోటీశ్వరులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని చెప్పారు. రూ.2వేల నోటు కారణంగా నల్లధనం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల్లో చెప్పిన విధంగా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలో చంద్రబాబును కన్వీనర్‌గా నియమించడం బాధాకరమన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వామపక్ష మహిళా సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవానీ మాట్లాడుతూ డ్వాక్రా రుణమాఫీ, మద్యనియంత్రణ, మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరుతామన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఏ.విమల, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, కోశాధికారి పంచదార్ల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.