లక్కవరం ఆంధ్రాబ్యాంకు వద్ద ఆందోళన చేస్తున్న డ్వాక్రా సంఘాల మహిళలు
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: బ్యాంకు నుంచి తీసుకున్న డ్వాక్రా రుణాలను ఏనెల కానెల చెల్లిస్తున్నా నగదు బ్యాంకులో జమకాకపోవడంపై జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు లక్కవరం ఆంధ్రాబ్యాంకు వద్ద, ప్రధాన రహదారిపై బుధవారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం బ్యాంకులో వేసిన పసుపు–కుంకుమ పథకంలో నగదును తీసుకునేందుకు ఈనెల 19న లక్కవరం ఆంధ్రాబ్యాంకు దుర్గాభవాని గ్రూప్ సభ్యులు వెళ్లగా గత 12 నెలలుగా తీసుకున్న రుణానికి నగదు జమచేయడం లేదంటూ బ్యాంకు అధికారులు చెప్పడంతో ఈ గ్రూపు సభ్యులు నిమ్మలగూడెంలో మిగతా గ్రూపులకు కూడా సమాచారం అందించారు. దీంతో 24 గ్రూపులకు చెందిన మహిళా సంఘాల సభ్యులు బుధవారం లక్కవరం బ్యాంకు వచ్చి తమ ఖాతాలను చెక్‌చేసుకోవడంతో గత 14 నెలలుగా చెల్లిస్తున్న నగదు జమకాకపోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రతీ నెలా డ్వాక్రా సీఎ నందమూరి లక్ష్మి ద్వారా బ్యాంకు మిత్ర కె.రాజేశ్వరికి రుణాన్ని చెల్లిస్తున్నామని, తాము చెల్లించిన సొమ్ము నెలల తరబడి బ్యాంకులో జమకాకపోవడం ఏమిటని దీనిపై అధికారులు విచారణ చేపట్టి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డ్వాక్రా మహిళలు కందుల నరసమ్మ, బల్లే వెంకటలక్ష్మి, దాసరి దుర్గ, ఉగ్గం రామలక్ష్మి, మాసం దుర్గమ్మ, లేగల వెంకట సుబ్బలక్షిమ, దాసరం నక్షత్రం డిమాండ్ చేశారు. 24 గ్రూపుల మీద చెల్లించిన సుమారు రూ.20 నుంచి రూ.24 లక్షల వరకు బ్యాంకులో జమకాలేదని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. దీనిపై డ్వాక్రా సంఘాలు లక్కవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే వెలుగు ఏపీఎం ఝాన్సీ మహిళా సంఘాల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై ఏలూరు నుంచి ఆంధ్రాబ్యాంకు ఏజీఎం సీహెచ్ నాగేశ్వరరావు విచారణ చేపట్టారు. ఆందోళన చేపట్టిన మహిళా సంఘాలకు లక్కవరం వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు తెలిపారు. పార్టీ నాయకులు పత్తి వీరాస్వామి, సయ్యద్ మస్తాన్, చిట్టిబొమ్మ శివరామకృష్ణ, మన్నెల్లి సూర్య, దల్లి నాగేశ్వరరావు తదితరులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment