ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగమే పెద్దనోట్ల రద్దు
విజయవాడ (గాంధీనగర్) : పెద్దనోట్ల రద్దు ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయంతో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయన్నారు. సామాన్యులు పాలకులను తిడుతున్నాయని, అంబానీ, అడ్వాణీ వంటి కోటీశ్వరులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని చెప్పారు. రూ.2వేల నోటు కారణంగా నల్లధనం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల్లో చెప్పిన విధంగా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలో చంద్రబాబును కన్వీనర్‌గా నియమించడం బాధాకరమన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వామపక్ష మహిళా సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవానీ మాట్లాడుతూ డ్వాక్రా రుణమాఫీ, మద్యనియంత్రణ, మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరుతామన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఏ.విమల, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, కోశాధికారి పంచదార్ల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.