సంస్కరణ ఒక్కరోజుతో సాధ్యం కాదు. దశలవారీగా జరగాలి. చిత్తశుద్ధితో మొదలుపెడితే... దశలవారీగానైనా ప్రక్షాళనకు అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే జిల్లా కలెక్టర్ నేరుగా నియోజకవర్గాలవారీగా సమీక్షలు చేయాలని సంక్పలించారు. తన మార్కు పాలనతో జిల్లాను చక్కదిద్దాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా తొలివిడత సమీక్షలు పూర్తికాగా... దాని అనుభవాలతో సరికొత్త తరహాలో మరో మారు సమీక్షలకు సమాయత్తం అవుతున్నారు.
విజయనగరం గంటస్తంభం: జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ రెండోదశ నియోజకవర్గ సమీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజులపాటు సమీక్షలు జరపాలని షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే జిల్లా, మండలాధికారులకు జారీ చేశారు. గత సమీక్షల్లో లోపాలను సవరించి ఈ సారి కార్యక్రమం రూపొందించారు. ప్రభుత్వ పధకాలు అమలు పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో కలెక్టర్ నియోజకవర్గ సమీక్షలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత నెల 24, 25, 26 తేదీల్లో తొమ్మిది నియోజకవర్గాల సమీక్ష చేపట్టారు.
తొలివిడత కావడం, అప్పటికప్పుడు కార్యక్రమం రూపొందించడంతో సమీక్షలు గందరగోళంగా మారాయి. నాలుగేసి నియోజకవర్గాలు ఒకేరోజు పెట్టడంతో సమయం చాలక అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఈసారి హడావుడిగా కాకుండా పక్కా ప్రణాళికతో అప్పటికి ఉన్న ప్రాధాన్యతాంశాలను బట్టి సమీక్షలు చేపట్టాలని కలెక్టర్ భావించారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ సారి నాలుగురోజుల పాటు సమీక్షలు చేయాలని నిర్ణయించారు. 6వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు విజయనగరం నియోజకవర్గ సమీక్ష కలెక్టరేట్‌లో పెట్టారు.
7న పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర భవన్‌లో ఉదయం 9గంటలకు సాలూరు, మధ్యాహ్నం 12గంటలకు కురుపాం, 3గంటలకు బొబ్బిలి, రాత్రి 8గంటలకు పార్వతీపురం సమీక్ష పెట్టారు. 8వ తేదీ ఉదయం 10గంటలకు ఎస్.కోట నియోజకవర్గ సమీక్ష అక్కడి ఎంపీడీఓ కార్యాలయంలో, మధ్యాహ్నం 3 గంటలకు గజపతినగరం నియోజకవర్గ సమీక్ష కలెక్టరేట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. 9వ తేదీ ఉదయం 10గంటలకు చీపురుపల్లి నియోజకవర్గ సమీక్ష అక్కడి ఎంపీడీఓ కార్యాలయం, మధ్యాహ్నం 3గంటలకు నెల్లిమర్ల నియోజకవర్గ సమీక్ష నెల్లిమర్ల పీడీ డ్వామా కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ సమీక్షలు గతసారి జిల్లా అధికారులతోపాటు మండలాధికారులు, గ్రామస్థాయి అధికారులతో నిర్వహించారు. దాదాపు అన్నిశాఖల అధికారులను రమ్మన్నారు. అప్పట్లో నియోజకవర్గ ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారమిచ్చి రమ్మన్నారు. కానీ ఈసారి పురపాలక చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎమ్పీటీసీలు, సర్పంచులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.
అజెండా అంశాలివే
ఈ సారి సమీక్షలో ఓడీఎఫ్, ఉపాధిహామీ పథకం అమలు, శాఖల అనుబంధంతో ఉపాధి నిధులతో చేపట్టే పనులు, గృహనిర్మాణం, గ్రీవెన్స్, ఏపీవోబీఎంఎంఎస్, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గ్రామ సందర్శన కార్యక్రమాలను ఎజెండా అంశాలుగా చేర్చారు. ఈ మేరకు ఆయాశాఖల ప్రగతిపై సమీక్షిస్తారు. గత సమావేశంలో జరిగిన సమీక్షలో నిర్ణయాలపై తీసుకున్న చర్యలు, ఉద్యోగుల వారీగా ప్రగతి నివేదికలు, బాగా పని చేసిన వారు, చేయనివారి వివరాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో కాస్త కఠినంగా సమావేశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సమీక్షల్లో అధికారపార్టీ నేతలకు ప్రాధాన్యం ఇచ్చి వారి సూచనలు, సలహాలకే ఎక్కువ అవకాశం కల్పిస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment