చిరునవ్వులు చిందిస్తూ కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ పాలరాజు
సాక్షిప్రతినిధి, విజయనగరం : ‘యధా రాజా..తధా ప్రజా’’అన్నది చిరకాల నానుడి. నాయకుడిని బట్టే సేవకులు, ప్రజలు ఉంటార నేది దీని సారాంశం. పాలనలో ఒక్కొక్కరికీ విధానం ఉంటుంది. కొన్ని విషయాల్లో కొందరు మంచిపేరు తెచ్చుకుంటారు. మరి కొందరు వ్యతిరేకతను మూటగట్టుకుంటారు. కానీ రెండు వేర్వేరు విభాగాల అధిపతులు ఒకేలా ఆలోచించడం, ఒకేలా ప్రవర్తించడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన వ్యక్తులు మన జిల్లాలోనే ఉండటం విశేషం. వారిలో ఒకరు జిల్లా పరిపాలనాధికారి కలెక్టర్ హరిజవహర్‌లాల్ కాగా, మరొకరు జిల్లా శాంతిభద్రతలు పరిరక్షించే ఎస్పీ జి.పాలరాజు. జిల్లాకు వస్తూనే తమ ప్రత్యేకతను చాటుకోవడానికి పరితపిస్తున్న వీరిద్దరి విధానాలూ ఒకేలా ఉండటం విశేషం.
ఆరంభం నుంచే కొత్తదనం హరిజవహర్ ప్రత్యేకం
మట్టి వాసన విలువేంటో తెలియజెప్పే వ్యవసాయ శాఖ నుంచి జిల్లా కలెక్టర్‌గా వచ్చిన హరిజవహర్‌లాల్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే కొత్తదనాన్ని చూపించడం మొదలుపెట్టారు. చిరునవ్వుతో మొదలుపెట్టి సీరియస్ వార్నింగ్‌లు ఇవ్వడానికి ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్లు ముందుగా కలెక్టరేట్ నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. బూజుపట్టిన కలెక్టరేట్ గోడలను దులిపించి కొత్తగా విద్యుత్ కాంతులు రప్పించా రు.
అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ తానేమిటో వారికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దగా ఉపయోగం లేదని ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాన్ని రద్దు చేసిన ఆయనే విజయనగరం పట్టణాన్ని బాగుచేసే బాధ్యతను తలకెత్తుకున్నారు. ఆకస్మిక పర్యటనతో మున్సిపల్ సిబ్బందిని హడలెత్తించిన మరుసటి రోజే అరగంట పాటు మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి సున్నితంగా హెచ్చరిం చారు. వెంటనే ‘పల్లెకు పోదాం’ అంటూ గ్రామాల్లో రాత్రి వేళ పర్యటనకు శ్రీకారం చుట్టారు.
చిరునవ్వుతోనే చిక్కులు తీర్చే పాలరాజు
ఇక ఎస్పీ పాలరాజు జిల్లాకు వచ్చింది మొదలు ఆయన ముఖంలో చిరునవ్వు చెరగనివ్వలేదు. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అలవోకగా ఎదుర్కొంటూ ఎప్పటికప్పుడు జిల్లా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. జిల్లాలో మునుపెన్నడూ లేని చిత్ర విచిత్ర నేరాలు జరుగుతుంటే వాటిలో వాస్తవాలను, అసలు నేరస్తులను గంటల వ్యవధిలోనే బయటపెట్టి ఔరా అనిపించుకుంటున్నారు. ఓ యువతిపై హత్యాయత్నం, మరో యువతిపై అత్యాచారయత్నం, భర్తనే హత్య చేయించిన ఇం కో యువతి ... ఇలాంటి నేరాల్లో బాధితులమని చెప్పుకున్న యువతులే అసలు నేరస్తులని నిరూపించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
నేరం జరిగిందని తెలియగానే అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఎంత దూరమైనా ఆలోచించకుండా సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశోధించడం ఆయన సక్సెస్‌కి కారణం. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటారు. వృద్ధులకు పోలీ సు సేవలందించడం, పోలీస్‌లకు మైత్రి సభ్యులకు మధ్య క్రీడలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. తప్పు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకుంటూ వారిలో ఒక రకమైన భయాన్ని కూడా సృష్టించిన ఆయనే బాగా పనిచేస్తున్నవారిని గుర్తించి ప్రోత్సాహకాలందిస్తున్నారు.
ఒకరికి మించి ఒకరు
ఇలా వీరిద్దరూ పరిపాలనలో తమతమ దారుల్లో ముందుకెళుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని సారూప్యాలున్నాయనే విషయం వారి చర్యలను బట్టి తెలుస్తోంది. ఇద్దరూ పని విషయంలో చండశాసనుల్లానే కనిపిస్తుంటారు. సిబ్బందిపై కోపాన్ని ప్రదర్శిస్తూ అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంటారు. కానీ ఆ సమయం దాటగానే వారిలో ఒకరిలా కలిసిపోతున్నారు. అరమరికలు మరచి కుటుంబ సభ్యుల్లా మసలుకుంటున్నారు. తారతమ్యాలు పక్కనపెట్టి తోటి వారితో గడుపుతున్నారు. అలాగే ఇద్దరిలో నూ మంచి గాయకులున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఏ దివిలో విరి సిన పారిజాతమో...’ అంటూ కలెక్టర్, ‘నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని...’ అంటూ ఎస్పీ తమ గళాన్ని సవరించి పాటలు పాడి విని పించారు. అంతేకాదు ఇద్దరూ వేరు వేరుగానూ, కలసికట్టుగానూ పాటలు పాడి జిల్లా అధికారులను, సిబ్బందిని ఆశ్చర్యపరిచారు. విధి నిర్వహణలోనే కాదు వ్యక్తిగతంగానూ తాము విభిన్నమని చాటి చెప్పారు. జిల్లా అభివృద్ధి జరగాలంటే పరిపాలన, భద్రత రెండు ప్రధానమైనవే. వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ ఒకేలా నడుచుకోవడం జిల్లా ప్రజలకు శుభపరిణామమే.
Comments
Please login to add a commentAdd a comment