మీ సేవ.. వారిష్టం!. | Mee Seva People's Difficulties increasing | Sakshi
Sakshi News home page

మీ సేవ.. వారిష్టం!.

Published Tue, Dec 2 2014 1:22 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

మీ సేవ.. వారిష్టం!. - Sakshi

మీ సేవ.. వారిష్టం!.

శ్రీకాకుళం పాతబస్టాండ్: సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన మీ సేవలతో ప్రజల కష్టాలు తీరుతాయనుకుంటే మరిన్ని ఇబ్బందులు పెరిగాయి. చాలా ప్రభుత్వ విభాగాలను మీ సేవ పరిధిలోకి తెచ్చినప్పటికీ అవన్నీ అందుబాటులోకి రాలేదు. జిల్లాలో సుమారు 300 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పని చేయడం లేదు. మిగిలిన వాటిలో ప్రధానంగా రెవెన్యూ సేవలే అందుతున్నా..  అవి కూడా సాంకేతిక సమస్యలు, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంతో అంతా వారిష్టం అన్నట్లు తయారైంది. మీ సేవ కేంద్రాల  నుంచే ధ్రువపత్రాలు జారీ చేస్తారని పేర్కొన్నప్పటికీ.. అక్కడ దరఖాస్తు సమర్పించి, సంబంధిత కార్యాలయానికి వెళ్లి తృణమో ఫణమో ముట్టజెబితే తప్ప పనులు కావడం లేదన్న విషయం సోమవారం జిల్లావ్యాప్తంగా ‘సాక్షి’ జరిపిన పరిశీలన(విజిట్)లో వెల్లడైంది.
 
 కొన్ని శాఖలకే పరిమితం
 మీ సేవతో దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలను అనుసంధానం చేశారు. అయితే ఇప్పటికీ చాలా సేవలు అందడంలేదు.  సర్వర్ కొన్నింటికి సపోర్టు చేయడం లేదని, మరికొన్నింటిని అనుసంధానం చేయలేదని చెబుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్ పరిపాలన, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్, పోలీస్, సివిల్ సప్లై, రవాణా, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, మైన్స్ విబాగం, వ్యవసాయం, సంక్షేమం, హెల్త్‌కేర్, స్కూల్ ఎడ్యుకేషన్, ఈపీడీసీఎల్, డీఆర్‌డీఏ, ఉపాధి కల్పన శాఖ, సాంకేతిక విద్య, ఇంటర్ విద్య, ఆరోగ్యశ్రీ, తూనికలు కొలతలు శాఖ, ఎండోమెంటు,  ఫ్యాక్టరీస్, మెడికల్ ఎడ్యుకేషన్ వంటి శాఖలను మీ సేవ పరిధిలోకి తెచ్చినా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, డీఆర్‌డీఏ, రిజిస్ట్రేష న్, రవాణా మినహా మిగిలిన శాఖల సేవలు అందడం లేదు.
 
 పెరిగిన ఖర్చులు
 ధ్రువపత్రాలు పొందడానికి గతంలోకంటే మీ సేవ విధానం లో ప్రజలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. గతంలో ఆ యా శాఖల కార్యాలయాలకు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకొని మాన్యువల్ పద్ధతిలో తీసుకునేవారు. అదే ప్రస్తుతం మీసేవ కేంద్రంలో దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేయించి.. వారిచ్చే రసీదు తీసుకొని సంబంధిత కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారిని కలిసి ధ్రువపత్రం మంజూరు చేయించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల మీసేవలో రిజిస్ట్రేషన్ చార్జీలు, అ తరువాత సంబంధిత కార్యాలయంలోని సిబ్బందికి కొంత మొత్తం అనధికారికంగా చెల్లించాల్సి వస్తోంది. పైగా రెండు కార్యాలయాలకు తిరగడం వ్యయ ప్రయాసలకు గురి చేస్తోంది.
 
 తప్పులతో తిప్పలు
 ప్రస్తుతం మీ సేవ కేంద్రాల ద్వారా ప్రధానం రెవెన్యూ సేవలే అందుతుండగా.. జారీ అవుతున్న ధ్రువపత్రాల్లో తప్పులతో దరఖాస్తుదారులు అవస్థలు పడుతున్నారు. తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లే మీ సేవలకు సంబంధించిన కార్యకలాపాలు చూస్తున్నారు. పైగా మీ సేవ డిజిటల్ కీ నిర్వహించాల్సిన బాధ్యత తహశీల్దార్లదే అయినా ఆ విధులను కూడా ఈ సిబ్బందే నిర్వహిస్తున్నారు. వారంతా దాదాపు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందే. రెగ్యులర్ ఉద్యోగులు కానందున తప్పులు జరిగినప్పుడు వారిపై చ ర్యలు తీసుకునే అవకాశం లేదు. పైగా వారికి శిక్షణ గానీ, అనుభవం గానీ లేదు. దీంతో వీరు తయారు చేస్తున్న ధ్రువపత్రాల్లోని వివరాల్లో తప్పులు చోటుచేసుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement