మీ- సేవలో వన్డే టికెట్ల విక్రయాలు
- నేటి నుంచి 14 కేంద్రాల్లో..
- అవకతవకలు జరిగితే అధికారులదే బాధ్యత
- భారీ బందోబస్తు
- జేసీ ప్రవీణ్‌కుమార్ వెల్లడి
విశాఖ రూరల్ : విశాఖలో ఈ నెల 14న భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్‌కు 14 మీ-సేవా కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి టికెట్లు విక్రయించనున్నట్టు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు, డిప్యూటీ తహశీల్దార్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమావేశమై టికెట్ల విక్రయాలకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.
ఆయన మాట్లాడుతూ చినగంట్యాడ, ఆటోనగర్ చిట్టివానిపాలెం, వడ్లపూడి, పెదగంట్యాడ, సూర్యాబాగ్, మల్కాపురం, కంచరపాలెం, ఆశీలుమెట్ట, బుచ్చిరాజుపాలెం, సీతమ్మధార, మాధవధార, దొండపర్తి, ఆర్‌కే బీచ్, లాసన్స్ బే ప్రాంతాల్లో జీవీఎంసీ భవనాల్లో నిర్వహిస్తున్న మీ-సేవా కేంద్రాల్లో ఈ టికెట్లు విక్రయిస్తున్నట్టు చెప్పారు. రూ.5 వేల విలువ గల టికెట్లు 200, రూ.2 వేలు టికెట్లు వెయ్యి, రూ.1500 టికెట్లు 3 వేలు, రూ.1000 టికెట్లు 5,900, రూ.400 విలువ గల టికెట్లు 1900...ఇలా మొత్తం 12 వేల టికెట్లను విక్రయించనున్నట్టు తెలిపారు. విక్రయాల్లో ఎటువంటి అవకతవకలకు, విమర్శలకు తావులేకుండా ప్రతి కేంద్రానికి ఓ డిప్యూటీ తహశీల్దార్‌ను ఇన్‌చార్జిగా నియమించామన్నారు.
ప్రతి అయిదు కేంద్రాలకు ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను పర్యవేక్షకునిగా నియమించినట్టు తెలిపారు. ఏ మాత్రం విమర్శలకు తావులేకుండా విక్రయాలు జరపాలని, లేకుంటే అందుకు అధికారులే బాధ్యత వహిం చాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్ని కేంద్రాల్లో టికెట్ల విక్రయాలను వీడియో తీయిస్తామని, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఎక్కువ కేంద్రాల్లో టికెట్లు విక్రయించడం వల్ల విమర్శలు వచ్చాయని, అందుకే ఈసారి 14 కేంద్రాలకు కుదించామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీలు పి.వి.ఎల్.నారాయణ, ఎస్.వెంకటేశ్వరరావు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ డెరైక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్, ట్రెజరర్ అరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.