India-West Indies
-
టి20ల్లోనూ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు వెస్టిండీస్ ఖాళీ అయ్యింది. ట్రోఫీ కాదు కదా కనీస విజయమైనా లేకుండానే రిక్త హస్తాలతో కరీబియన్‌కు పయనం కానుంది. ఆఖరి టి20లోనూ టీమిండియానే గెలిచి సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. ఇంతకుముందు వన్డే సిరీస్‌నూ 3–0తో సొంతం చేసుకున్న భారత్ టి20 సిరీస్‌ను కైవసం చేసుకొని ఓవరాల్‌గా ఆరు విజయాలు నమోదు చేసుకోగా... విండీస్ గెలుపు రుచి కూడా చూడకుండానే వెనుదిరిగింది. కోల్‌కతా: ఈ మ్యాచ్‌లో 15 ఓవర్ల దాకా భారత్ వంద పరుగులైనా చేయలేదు. కోహ్లికి రెస్ట్ ఇస్తే కెప్టెన్ ‘హిట్‌మ్యాన్’ రోహిత్ అప్పటికే ఔటయ్యాడు. ఈ పరిస్థితిలో జట్టు అనూహ్యంగా ఆఖరి 5 ఓవర్లలో 86 పరుగులతో ఎవరూ ఊహించని భారీస్కోరు చేసింది. తర్వాత అనుభవజ్ఞులే లేని టీమిండియా పేస్ దళం వెస్టిండీస్‌ను కూల్చేసింది. చివరకు 17 పరుగుల తేడాతో ఆఖరి టి20లో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఆదివారం జరిగిన చివరి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 65; 1 ఫోర్, 7 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. పేస్ బౌలర్ అవేశ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆరంభంలో భారత బ్యాటర్స్ తడబడ్డారు. చెత్తషాట్లతో వికెట్లను సమర్పించుకున్నారు. మొదటి 10 ఓవర్లలో టీమిండియా స్కోరు 68/3 మాత్రమే! 14వ ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ అవుటయ్యే సమయానికి భారత్ స్కోరు 93/4. ఈ దశలో సూర్యకుమార్‌తో వెంకటేశ్ అయ్యర్ జత కలిశాడు. చప్పగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు సూర్యకుమార్ భారీ సిక్సర్లతో ఊపు తెచ్చాడు. వెంకటేశ్ కూడా దూకుడుగా ఆడటంతో కేవలం 19 బంతుల వ్యవధిలోనే (18.2వ ఓవర్లో) భారత్ 150 పరుగులు దాటింది. షెఫర్డ్ వేసిన ఆఖరి ఓవర్లో సూర్యకుమార్ మూడు సిక్సర్లు బాదాడు. చివరి బంతికి అవుటయ్యాడు. వెంకటేశ్, సూర్యకుమార్ ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే 91 పరుగులు జతచేశారు. విండీస్ విలవిల లక్ష్యాన్ని ఛేదించేందుకు పరుగుల వేట ప్రారంభిస్తే భారత సీమర్లు వికెట్లు కూల్చేపనిలో పడ్డారు. దీపక్ చహర్ వరుస ఓవర్లలో ఓపెనర్లు మేయర్స్ (6), షై హోప్ (8)లను ఔట్‌చేశాడు. అంతలోనే చహర్ గాయంతో రెండో ఓవర్ పూర్తవకుండానే మైదానం వీడాడు. తర్వాత పూరన్, పావెల్ (25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు క్రీజులో నిలిచారు. ఏడో ఓవర్ నుంచి హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్ల వికెట్ల వేట మొదలెట్టగానే 100 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. లక్ష్యానికి దూరమైంది. పూరన్ బౌండరీలు, షెఫర్డ్ (21 బంతుల్లో 29; 1 ఫోర్, 3 సిక్సర్లు) సిక్స్‌లు విండీస్ శిబిరాన్ని కాస్త ఊరడించాయి. తప్ప విజయం దాకా తీసుకెళ్లలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మేయర్స్ (బి) హోల్డర్ 4; ఇషాన్ (బి) చేజ్ 34; శ్రేయస్ (సి) హోల్డర్ (బి) వాల్‡్ష 25; రోహిత్ (బి) డ్రేక్స్ 7; సూర్యకుమార్ (సి) పావెల్ (బి) షెఫర్డ్ 65; వెంకటేశ్ (నాటౌట్) 35; ఎక్స్ట్రా లు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–10, 2–63, 3–66, 4–93, 5–184. బౌలింగ్: హోల్డర్ 4–0–29–1, షెఫర్డ్ 4–0–50–1, చేజ్ 4–0–23–1, వాల్‡్ష 4–0– 30–1, డ్రేక్స్ 3–0–37–1, అలెన్ 1–0–5–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) ఇషాన్ (బి) చహర్ 6; షై హోప్ (సి) ఇషాన్ (బి) చహర్ 8; పూరన్ (సి) ఇషాన్ (బి) శార్దుల్ ఠాకూర్ 61; పావెల్ (సి) శార్దుల్ (బి) హర్షల్ పటేల్ 25; పొలార్డ్ (సి) రవి బిష్ణోయ్ (బి) వెంకటేశ్ అయ్యర్ 5; హోల్డర్ (సి) శ్రేయస్ అయ్యర్ (బి) వెంకటేశ్ అయ్యర్ 2; రోస్టన్ చేజ్ (బి) హర్షల్ పటేల్ 12; షెపర్డ్ (సి) రోహిత్ శర్మ (బి) హర్షల్ పటేల్ 29; అలెన్ (నాటౌట్) 5; డ్రేక్స్ (సి) రోహిత్ శర్మ (బి) శార్దుల్ ఠాకూర్ 4; హేడెన్ వాల్‡్ష (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–6, 2–26, 3–73, 4–82, 5–87, 6–100, 7–148, 8–158, 9–166. బౌలింగ్: చహర్ 1.5–0–15–2, అవేశ్ ఖాన్ 4–0–42–0, వెంకటేశ్ 2.1–0–23–2, శార్దుల్ ఠాకూర్ 4–0–33–2, రవి బిష్ణోయ్ 4–0– 29–0, హర్షల్ పటేల్ 4–0–22–3. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కిది ఏడోసారి. స్వదేశంలో నాలుగు సిరీస్‌లు, విదేశాల్లో మూడు సిరీస్‌లను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. -
రిషబ్‌పంత్‌కు మళ్లీ నిరాశే..
♦ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కింగ్ స్టన్: విండీస్ పర్యటన ఎంపికతో అంతర్జాతీయ వన్డేల్లో ఆరంగ్రేటం చేయాలనుకున్న పంత్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. భారత్ ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో పంత్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక చివరి వన్డేలోనైన అవకాశం కల్పిస్తారని భావించినా నిరాశే ఎదురైంది. నేడు (గురువారం) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతొంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక గత మ్యాచ్‌కు దూరమైన అశ్విన్, యువరాజ్‌లను కూడా ఫైనల్ మ్యాచ్‌కు తీసుకోలేదు. తుది జట్లు భారత్: రహానే, ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), దినేష్ కార్తీక్, ధోని, జాదవ్, పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ వెస్టిండీస్: లూయిస్, హోప్, కేఏ హోప్, చేస్, మహమ్మద్, హోల్డర్ (కెప్టెన్), పోవెల్, నర్స్, బిషూ, జోసఫ్, విలియమ్స్ -
సెంచరీలు చేసినా హ్యాపీగా ఉండలేను!
వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో విశేషంగా రాణించినందుకు తనకు చాలా హ్యాపీగా ఉందని భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. రెండు టెస్టులు డ్రా కాగా, మరో రెండు టెస్టుల్లో భారత్ నెగ్గి 2-0తో విండీస్ పై సిరీస్ నెగ్గిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా తాను ఇలాంటి సిరీస్ లు ఎన్నో ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. బౌలింగ్ లో విండీస్ కు చెమటలు పట్టించడంతో పాటు బ్యాటింగ్ లోనూ రాణించి రెండు సెంచరీలు చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం తనకు ఉపకరించిందని, భారత అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా రాణించామని తెలిపాడు. బ్యాటింగ్ లో సెంచరీలతో రాణించడంతో కంటే 5 వికెట్ల ఇన్నింగ్స్ లు తనకు ఎంతో సంతృప్తిని ఇస్తాయని అశ్విన్ వెల్లడించాడు. సిరీస్ లో రెండు సార్లు 5 వికెట్ల ఇన్నింగ్స్ తో పాటు అశ్విన్ 235 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆరుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న భారత క్రికెటర్ గానూ అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. -
దశావతారం
ఇంతింతై వటుడింతై అన్నట్టు అంతర్జాతీయ క్రికెట్లో విశాఖ అంచలంచెలుగా ఎదిగింది. 1988లో భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్ మొదలు గత ఏడాది భారత్-వెస్టిండీస్ మ్యాచ్ వరకు పదహారేళ్లలో మొత్తం పది వన్డే మ్యాచ్‌లు జరిగాయిక్కడ. అరకొర వసతులతో ఉన్న మున్సిపల్ స్టేడియంను ముస్తాబు చేసి అంతర్జాతీయ మ్యాచ్‌కు నడుం కట్టిన దగ్గర్నుంచి ప్రపంచ ప్రమాణాలతో అధునాతన స్టేడియంను సమకూర్చుకునే వరకు విశాఖ క్రికెట్ రంగానిది ఓ విశిష్ట చరిత్ర. డి.వి.సుబ్బారావు వంటి ఉద్దండుల కృషి ఫలితమిది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ హోదాకు తగిన హంగులు సమకూర్చుకొని అనుమతి కోసం ఎదురుచూస్తోంది. మంగళవారం భారత్-వెస్టిండీస్ మ్యాచ్ జరగనున్న సందర్భంగా ఈ అందాల నగరంలో జరిగిన పది వన్డే మ్యాచ్‌లపై విహంగ వీక్షణం... తొలి మ్యాచ్‌లో శ్రీకాంత్ ఆల్‌రౌండ్ ప్రతిభ వైజాగ్‌లో తొలి మ్యాచ్ 1988 డిసెంబర్ 10న జరిగింది. భారత జట్టుకు దిలీప్ వెంగ్‌సర్కార్ నాయకత్వం వహించాడు. న్యూజిలాండ్ జట్టుకు జాన్ రైట్ నాయకత్వం వహించాడు. జోన్స్ 64 పరుగులు, రూథర్‌ఫోర్డ్ 67 పరుగులు చేశారు. దాంతో న్యూజిలాండ్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలి వికెట్ కపిల్‌దేవ్‌కు లభించింది. అప్పట్లో బ్యాటింగ్ సెన్సేషన్‌గా గుర్తింపు పొందిన క్రిష్ శ్రీకాంత్ ఆఫ్‌స్పిన్‌తో విజృంభించి 7 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఐదువికెట్లు పడగొట్టాడు. విశాఖలో ఇదే బౌలింగ్‌లో అత్యుత్తమ రికార్డు. తర్వాత భారత బ్యాటింగ్‌లో శ్రీకాంత్ 70 పరుగులు, అజరుద్దీన్ 48 పరుగులు చేశారు. లక్ష్యాన్ని భారత జట్టు 46.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి సాధించింది. అలరించిన సచిన్, సిద్దూ రెండో వన్డే 1994 నవంబర్ 7న జరిగింది. భారత వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 44 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు సాధించింది. సచిన్ 54 పరుగులు చేశాడు. విశాఖ ప్రేక్షకులను సచిన్ అలరించాడు. జడేజాతో కలసి సచిన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన సిద్ధూ విజృంభించి 103 బాల్స్ ఎదుర్కొని 9 బౌండరీలు,రెండు సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. కెప్టెన్ అజరుద్దీన్ 45 పరుగులు చేశాడు. వెస్టిండీస్ పోరాడినా, స్లో ఓవర్ రేట్ వల్ల ఓ ఓవర్ జరిమానాగా కోల్పోవడం ఆ జట్టు కొంప ముంచింది. ఆ జట్టు 43 ఓవర్లే బ్యాటింగ్ చేసి ఏడు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి మ్యాచ్‌ను కేవలం 4 పరుగుల తేడాలో కోల్పోయింది. అప్పట్లో బ్యాటింగ్ సెన్సేషన్ లారా 39 పరుగులు చేశాడు. సిమ్మన్స్ 51 పరుగులు, కార్ల్ హూపర్ 74 పరుగులు చేశారు. సిమ్మన్స్ వికెట్ సచిన్‌కు లభించింది. చెలరేగిన ‘వా’ సోదరులు వైజాగ్‌లో మూడో మ్యాచ్ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ లీగ్ మ్యాచ్‌గా జరిగింది. ఫిబ్రవరి 23, 1996న జరిగిన ఈ మ్యాచ్‌లో కొదమ సింహం ఆస్ట్రేలియా, పసికూన కెన్యా తలపడ్డాయి. ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఏడువికెట్ల నష్టానికి 304 పరుగులు భారీస్కోర్ సాధించింది. మార్క్ వా చెలరేగి 128 బాల్స్‌లో 14 బౌండరీలు, ఓ సిక్సర్‌తో 130 పరుగులు చేశాడు. అతని సోదరుడు స్టీవ్ వా 82 పరుగులు చేశాడు. కెన్యా 7 వికెట్ల నష్టానికి 204 పరుగులే చేసి చిత్తుగా ఓడింది. ఒంటెనో 85 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్, ప్రముఖ పేసర్ మెక్‌గ్రాత్ తదితరుల విజృంభణను వైజాగ్ ప్రేక్షఖులు తొలిసారిగా చూడగలిగారు. పాక్‌పై శ్రీలంక గెలుపు విశాఖలో నాలుగో మ్యాచ్ పెప్సీకప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగింది. 1999 మార్చి 27న జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. జయవర్దనే 101 పరుగులు చేశాడు. పాక్ జట్టులో అజర్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టాడు. పాక్ జట్టు బ్యాటింగ్‌లో విఫలమైంది. ఆఖర్లో కెప్టెన్ వసీం అక్రమ్ చెలరేగి 60 బంతుల్లో ఐదు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. ఆ జట్టు 46.3 ఓవర్లలో 241 పరుగులకే ఆలవుట్ అయింది. లంక జట్టు 12పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. కంగారెత్తించారు... విశాఖపట్నంలో ఐదో మ్యాచ్ భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య 2001 ఏప్రిల్ 3న జరిగింది. ఆస్ట్రేలియా జట్టు భారతబౌలర్లకు చుక్కలు చూపించింది. ఓపెనర్ హేడెన్, ఫస్ట్ డౌన్లో వచ్చిన పాంటింగ్ చెలరేగిపోయారు. హేడెన్ 111 పరుగులు, పాంటింగ్ 101 పరుగులు చేసి మొదటి వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత భారత బ్యాటింగ్‌లో సచిన్ ఉన్నది కొద్ది సేపైనా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిం చాడు. అతడు 68 నిమిషాలు క్రీజ్‌లో నిలబడి 11 బౌండరీలతో 62 పరుగులు చేశాడు. విశాఖ లో సచిన్‌కు ఇది అత్యధిక స్కోర్. మిగిలిన భా రత బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. ధోనీ స్టార్ అయ్యిందిక్కడే.. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థులైన భారత,పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది. 2005 అక్టోబర్ 5న జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా భారత అభిమానులకు కనుల పండువగా జరిగింది. అప్పటి బ్యాటింగ్ సంచల నం, ఇప్పటి కెప్టెన్ తన హెలికాప్టర్ షాట్లతో అల రించింది ఇక్కడే. ధోనీ ఈ మ్యాచ్‌తో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు సెవాగ్, ధోనీ అండతో ఆడుతూ పాడుతూ 9 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధిం చింది. ఓపెనర్ సెవాగ్ 12 ఫోర్లు,రెండు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ధనాధన్ ధోనీ 123 బంతుల్లో 15 బౌండరీలు, 4 సిక్సర్లతో 148 పరుగులు సాధించాడు. పాక్ జట్టు బ్యాటింగ్‌లో రజాక్ (88), యూసఫ్ యొహానా (71) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత్ తిరుగులేని రీతిలో 58 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. ‘యూవీ’రవిహారం విశాఖలో ఏడో మ్యాచ్ భారత, శ్రీలంక జట్ల మధ్య 2007 ఫిబ్రవరి 17న జరిగింది. చమర సిల్వా సెంచరీ సాయంతో శ్రీలంక జట్టు 47 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు సాధించింది. తర్వాత భారత బ్యాటింగ్‌లో యువరాజ్ సింగ్ వీరవిహారం చేశాడు. 83 బంతుల్లో 11 బౌండరీలు, 3 సిక్సర్లతో అజేయంగా 95 పరుగులు సాధించాడు. గంగూలీ అజేయంగా 58 పరుగులు, ఉతప్ప 52 పరుగులు సాధించడంతో భారత జట్టు 41 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 263 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియాపై కసి తీర్చుకున్న భారత్ ఆస్ట్రేలియా జట్టు విశాఖలో మరో మ్యాచ్ ఆడినా ఈసారి పరాజయం నుంచి తప్పించుకోలేక పోయింది. 2010 అక్టోబర్ 20న జరిగిన ఈమ్యాచ్‌లో భారత జట్టు కసిగా ఆడి ఐదు వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో కెప్టెన్ క్లార్క్ 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హసీ (69), వైట్ (89) అతనికి తోడ్పాటు అందించారు. దాంతో కంగారూ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసిం ది. కోహ్లీ 118 పరుగులు చేసి భార త గెలుపుకు బాట వేశాడు. యువరాజ్ సింగ్ 58 పరుగులు చేయగా, కీలక దశలో సురేశ్‌రైనా కేవలం 47 బంతుల్లో 71 పరుగులు చేసి భారత్‌ను గెలుపు తీరం చేర్చాడు. వెస్టిండీస్‌పై జయభేరి విశాఖలో తొమ్మిదో మ్యాచ్ భారత, వెస్టిండీస్ జట్ల మధ్య 2011 డిసెంబర్ 2న జరిగింది. భారత్ అలవోకగా ఐదు వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 269 పరుగులు చేయగలిగింది. విరాట్ కోహ్లీ మరోసారి చెలరేగి 117 పరుగులు చేసి భారత్‌కు గట్టి పునాది వేశాడు. రో‘హిట్’ శర్మ రాణించి అజేయంగా 90 పరుగులు చేయడంతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి అవలీలగా గెలుపొందింది. వైఎస్సార్ స్టేడియంలో తొలి ఓటమి విశాఖలో గత ఏడాది మరోసారి ఆడిన వెస్టిండీస్ జట్టు అనుకోని రీతిలో భారత జట్టుకు షాక్ తినిపించింది. ఈ మ్యాచ్ నవంబర్ 24న జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 288 పరుగుల స్కోరు సాధించింది. కోహ్లీ కేవలం ఒక్క పరుగులో సెంచరీ మిస్ అయ్యాడు. ధోనీ అజేయంగా అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ అంతా బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరం చేర్చారు. రెండు వేల మందితో బందోబస్తు అల్లిపురం: భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు నగర శాంతి, భద్రతల డీసీపీ ఎం.శ్రీనివాసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లకు సుమారు 2 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. నాలుగు వందల మంది అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారన్నారు. ఇప్పటికే హనుమంతవాక నుంచి పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వరకు విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 17న కూడా నగరంలో మరో వన్డే మ్యాచ్ జరిగే అవకాశముందని వస్తున్న వార్తల నేపథ్యంలో అవసరాన్ని బట్టి బందోబస్తును పెంచుతామన్నారు. నగర ఇన్చార్జి సీపీ అతుల్‌సింగ్ ఆదేశాల మేరకు క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. -
మీ- సేవలో వన్డే టికెట్ల విక్రయాలు
నేటి నుంచి 14 కేంద్రాల్లో.. అవకతవకలు జరిగితే అధికారులదే బాధ్యత భారీ బందోబస్తు జేసీ ప్రవీణ్‌కుమార్ వెల్లడి విశాఖ రూరల్ : విశాఖలో ఈ నెల 14న భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్‌కు 14 మీ-సేవా కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి టికెట్లు విక్రయించనున్నట్టు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు, డిప్యూటీ తహశీల్దార్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమావేశమై టికెట్ల విక్రయాలకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఆయన మాట్లాడుతూ చినగంట్యాడ, ఆటోనగర్ చిట్టివానిపాలెం, వడ్లపూడి, పెదగంట్యాడ, సూర్యాబాగ్, మల్కాపురం, కంచరపాలెం, ఆశీలుమెట్ట, బుచ్చిరాజుపాలెం, సీతమ్మధార, మాధవధార, దొండపర్తి, ఆర్కే బీచ్, లాసన్స్ బే ప్రాంతాల్లో జీవీఎంసీ భవనాల్లో నిర్వహిస్తున్న మీ-సేవా కేంద్రాల్లో ఈ టికెట్లు విక్రయిస్తున్నట్టు చెప్పారు. రూ.5 వేల విలువ గల టికెట్లు 200, రూ.2 వేలు టికెట్లు వెయ్యి, రూ.1500 టికెట్లు 3 వేలు, రూ.1000 టికెట్లు 5,900, రూ.400 విలువ గల టికెట్లు 1900...ఇలా మొత్తం 12 వేల టికెట్లను విక్రయించనున్నట్టు తెలిపారు. విక్రయాల్లో ఎటువంటి అవకతవకలకు, విమర్శలకు తావులేకుండా ప్రతి కేంద్రానికి ఓ డిప్యూటీ తహశీల్దార్‌ను ఇన్చార్జిగా నియమించామన్నారు. ప్రతి అయిదు కేంద్రాలకు ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను పర్యవేక్షకునిగా నియమించినట్టు తెలిపారు. ఏ మాత్రం విమర్శలకు తావులేకుండా విక్రయాలు జరపాలని, లేకుంటే అందుకు అధికారులే బాధ్యత వహిం చాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్ని కేంద్రాల్లో టికెట్ల విక్రయాలను వీడియో తీయిస్తామని, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఎక్కువ కేంద్రాల్లో టికెట్లు విక్రయించడం వల్ల విమర్శలు వచ్చాయని, అందుకే ఈసారి 14 కేంద్రాలకు కుదించామన్నారు. ఈ సమావేశంలో ఎస్డీసీలు పి.వి.ఎల్.నారాయణ, ఎస్.వెంకటేశ్వరరావు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ డెరైక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్, ట్రెజరర్ అరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.