కొరిటెపాడు(గుంటూరు) : వ్యవసాయ యంత్ర పరికరాలు పొందాలంటే రైతులు ఇకపై ‘మీ-సేవ’ను ఆశ్రయించాలి. శాఖాపరంగా జరుగుతున్న అక్రమాలను నియంత్రించే క్రతువులో భాగంగా ప్రభుత్వం పది రోజుల కిందట ఈ విధానానికి తెరతీసింది. అయితే కొత్త పద్ధతి రైతులకు ఇబ్బందేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నూతన విధానం ద్వారా ఎంచుకున్న యంత్రం రైతు ఇంటికి చేరాలంటే దాదాపు 20 రోజుల సమయం పడుతుందనే వాదన కూడా లేకపోలేదు. మీ- సేవ ద్వారా యంత్ర పరికరాలు పొందే విధానం ఇలా..
రైతులు తొలుత తమకు కావలసిన యంత్ర పరికరానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మండల వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి తెలుసుకోవాలి. ఆ తరువాత వ్యవసాయ శాఖ విస్తరణాధికారి, వ్యవసాయాధికారి అనుమతి (సంతకాలు)తో దరఖాస్తు చేసుకోవాలి.
దీనికి ఆధార్ కార్డు, పట్టాదార్ పాసుపుస్తకం జిరాక్స్ కాపీలు, రైతు ఫొటో జత చేసి మీసేవ కార్యాలయంలో అందజేయాలి. రుసుం కింద రూ.35లు చెల్లించాలి. రూ.50 వేల వరకు సబ్సిడీ పొందుతున్న యంత్రమైతే మొదటి విడతగా రూ.వెయ్యి చెల్లించాలి. యంత్రం మంజూరైన తరువాత మిగిలిన సొమ్ము చెల్లించాలి.
అంతా ఆన్‌లైన్‌లోనే...
మీ సేవ ద్వారా పంపిన దరఖాస్తు తొలుత వ్యవసాయ సహాయ సంచాలకులు(ఏడీఏ)కు అందుతుంది. అక్కడి నుంచి జేడీఏ స్వీకరించి యంత్రాన్ని మంజూరు చేస్తారు. ఇదే విషయాన్ని రైతు సెల్ ఫోన్‌కు మెసేజ్ పంపుతారు. ఆ తరువాత రైతు బ్యాంక్ ద్వారా సొమ్ము చెల్లించి ఆ వివరాలను వ్యవసాయశాఖ అధికారులకు తెలియపర్చాలి.
రైతు సొమ్ము చెల్లించిన 10 రోజుల్లోపు అధికారులు యంత్ర పరికరాన్ని అంజేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు తిరస్కరిస్తే...
ఒకవేళ రైతు చేసుకున్న దరఖాస్తును అధికారులు తిరస్కరిస్తే తొలుత మీ సేవలో చెల్లించిన వెయ్యి రూపాయలను తిరిగి పొందే అవకాశం ఉండదు. ముందుగా అన్ని వివరాలను ఏడీఏ స్థాయిలోనే అందించగలిగితే దరఖాస్తును తిరస్కరించే అవకాశం దాదాపు ఉండదు.
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానం ఇబ్బందేనని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో వ్యవసాయశాఖ అధికారుల నుంచి అనుమతి పొంది బ్యాంకులో డీడీ తీసి, సాయంత్రానికి రైతులు యంత్రాన్ని ఇంటికి తెచ్చుకునేవారు.
ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా కనీసం 20 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుందని రైతులు చెబుతున్నారు. పైగా సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు చూసుకొని అర్థం చేసుకునే పరిజ్ఞానం తమకు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు.
మీ సేవ ద్వారా వ్యవసాయ యంత్రపరికరాలు
Published Wed, Dec 24 2014 4:30 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM
Advertisement
Advertisement