మీ-సేవ ద్వారానే ఇళ్ల ప్లాన్లు
► సిబ్బంది ఆచి... తూచి వ్యవహరించకుంటే ఇంటికే
► శాటిలైట్ ఏరియా చిత్రం ఉంటేనే ప్లాన్ మంజూరు
► 13 రకాల పత్రాలతో వస్తేనే అనుమతి
బాపట్ల : ఎంకి పెళ్ళి ఇంకొకరి చావుకొచ్చింది.. అన్నట్లుంది పట్టణ ప్రణాళికా విభాగం పరిస్థితి. ఒక పక్క అనుమతి లేని.. పరిమితికి మించి నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోకపోతే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తోందని హెచ్చరికలు. మరో పక్క ప్లాన్ ఇవ్వాలంటే తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు 13 రకాలైన పత్రాలు జతపర్చాలనే నిబంధనలు. ఇవిగాక తాజాగా ప్రతి ప్లాన్ మీ-సేవ కేంద్రాల ద్వారానే తీసుకోవాలనడంతో ఆ శాఖ ఆన్‌లైన్ సేవలు అందించేందుకు తలమునకలైంది. జిల్లాలోని 12 మున్సిపాల్టీల్లో ఈనెల 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు నమోదు చేయాలని నిబంధనలను ఉంచగా సర్వర్ల మొరాయింపు సమస్యతో ప్లాన్లు నమోదు చేయటం అంతంతమాత్రంగానే ఉంది. సిబ్బంది కొరత, అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపరచటంతో ఇల్లు కట్టుకోవాలంటే అన్నీ సమస్యలే అన్నట్లు ఉంది తాజా పరిస్థితి.
ఆచి.. తూచి వ్యవహరించాలి..
ఈనెల ఒకటో తే దీ నుంచి మీ సేవ ద్వారానే ఇంటి ప్లానుకు దరఖాస్తు చేసుకోవాలనే ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీంతోపాటు శాటిలైట్ ద్వారా ఆయా ప్రాంతాలు చూపించే చిత్రాన్ని ఇంటర్‌నెట్‌లో డౌన్‌లోడ్ చేసి దరఖాస్తు ద్వారా పొందుపరిచాలని నిబంధనను ప్రవేశపెట్టారు. ఈ నిబంధన ప్రకారం ఆయా మున్సిపాల్టీ పరిధిలోని శాటిలైట్ చిత్రంలో ప్లాన్ ఇచ్చే ప్రాంతంలో ఖాళీ స్థలాన్ని చూపిస్తేనే ప్లాన్‌కు అనుమతి తీసుకుంటుంది. వీటితోపాటు పరిశీలన పత్రం, బిల్డింగ్ దరఖాస్తు, మున్సిపాల్టీకి చెల్లించాల్సిన చలానా ఫారమ్స్, ఆస్తికి సంబంధించిన రికార్డులను జిరాక్స్‌లపై గజిటెడ్ ఆఫీసర్ సంతకాలు, లింకు డాక్యుమెంట్‌పై గజిటెడ్ ఆఫీసర్ సంతకం, ఈసీ కాపీ, ఇటీవల చెల్లించిన ఇంటి పన్ను రశీదు, ఖాళీ స్థలానికి సంబంధించిన పన్ను చెల్లించింది, ఇంటి యజమాని స్థలం వద్ద నిలబడి ఫొటో, లెసైన్స్‌డ్ సర్వేయర్ గీసిన ప్లాన్ 4 కాపీలు, ఇంటి ముందు రోడ్డుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ చూపించే డాక్యుమెంట్, అఫిడవిట్‌తోపాటు రూ.10 స్టాంపు పేపరుపై నోటరీ సంతకాలు, అనుమతి తీసుకున్న ప్లాన్‌కు సంబంధించి ఎలాంటి అక్రమ కట్టడం చేయబోమని రూ.100 స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించాలి. ఇలా 13 రకాలైన పత్రాలతో ప్లాన్ అనుమతికి పొందుపరిచాల్సి ఉంటుంది.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 12 మున్సిపాల్టీలు ఉండగా వాటిలో పట్టణ ప్రణాళికా విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైల్స్‌నే కదిలించేందుకు సిబ్బంది కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బాపట్ల మున్సిపాల్టీలో 16 ఫైల్స్ చక్కబెట్టగా మిగిలిన మున్సిపాల్టీలో కనీసం అడుగు ముందుపడలేదు.
ఇంటి యజమానులకు తిప్పని తిప్పలు..
ఆన్‌లైన్ పద్ధతి వలన ఇంటి యజమానులు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. సర్వర్లు అందుబాటులో లేకపోవటంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 13 రకాలైన దరఖాస్తు ఫారాలను సమర్పించటంతోపాటు రూ.100 స్టాంపు పేపరుపై ‘నేను నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించను..’ అనే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది.
వివిధ కార్యాలయాలకు..
భవనాల క్రమబద్ధీకరణకు ప్లాన్లు మున్సిపాల్టీ స్థాయిని ఆధారం చేసుకుని అక్కడ నుంచి రీజినల్ డెరైక్టర్ కార్యాలయానికి, తిరిగి హైదరాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్ వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే రాజధాని నేపథ్యంలో ఎన్నో ఆశలతో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసిన వెంచర్లు, అపార్టుమెంట్లకు సంబంధించిన ప్లాన్లు, బహుళ సముదాయ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌కు సంబంధించిన చాలా ప్లాన్లు ఇటీవల జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉండిపోయాయి.