మీసేవ కేంద్రాల్లో నిలువు దోపిడీ
అధికంగా వసూళ్లు చేస్తున్నా.. పట్టించుకోని అధికారులు
పులివెందుల రూరల్ : పట్టణంలోని మీసేవ కేంద్రాలలో ప్రజలను యథేచ్ఛగా నిలువు దోపిడీ చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని మీసేవ ప్రాంచైజ్‌లు, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలలో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల సేవలను మీసేవ కేంద్రాలకు అప్పగించడం పనులు సులువుగా జరుగుతాయని ప్రజలు భావించారు. అయతే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు వసూళ్లు చేస్తుండటంతో గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ఖర్చు అవుతోందని ప్రజలు చెబుతున్నారు.
రైతులకు సంబంధించి అడంగల్, 1బిలకు రూ. 25లు తీసుకోవాల్సి ఉండగా.. రూ. 50లు వసూలు చేస్తున్నారు. దీంతోపాటు బీసీ రుణాలకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించడంతో అందుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో జత చేయాల్సి ఉంది. దీంతో మీసేవ కేంద్రాలలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆన్‌లైన్‌లో పంపిస్తామని చెప్పి రూ. 200లు వసూళ్లు చేస్తున్నారు. ఇందుకు రూ. 100లు కూడా ఖర్చు కాదు.
ఈ పత్రాలను తహశీల్దార్ కార్యాలయంలో అప్రూవల్ చేయాల్సి ఉంది. ఇందుకు మీసేవ నిర్వాహకులు ప్రతి సర్టిఫికెట్‌కు ఓ రేటు నిర్ణయించి అప్రూవల్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటితో పాటు కుటుంబ సభ్యుల సర్టిఫికెట్, రేషన్ కార్డు ప్రింట్ అవుట్ ఇతరత్రా సర్టిఫికెట్లకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన ధరలకే తీసుకొనే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.