1200 మీ సేవా కేంద్రాలు బంద్! | 1200 shutdown Mee seva centers! | Sakshi
Sakshi News home page

1200 మీ సేవా కేంద్రాలు బంద్!

Published Wed, Jun 8 2016 3:49 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM

1200 మీ సేవా కేంద్రాలు బంద్! - Sakshi

1200 మీ సేవా కేంద్రాలు బంద్!

- సర్వీస్ ప్రొవైడర్ మార్పుతో ఆటంకం
- లైఫ్ సర్టిఫికేట్ కోసం వచ్చే
- పెన్షనర్లకు తప్పని తిప్పలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 మీ సేవా కేంద్రాలు వారం రోజులుగా మూతపడ్డాయి. ఆయా కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను ప్రభుత్వం మార్చడం ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఓవైపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తేనే వచ్చే నెల పింఛన్ వస్తుందని అధికారులు చెబుతుండడం, మరోవైపు మీసేవా కేంద్రాలు మూతపడడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మీ సేవా కేంద్రాలను ఎప్పుడు తెరుస్తారో అర్థంకాక కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాల కోసం దరఖాస్తుల సమర్పించిన సాధారణ ప్రజానీకం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సర్టిఫికేట్లు అందకపోతే పాలీసెట్, ఈసెట్, ఎంసెట్.. తదితర కౌన్సెలింగ్‌లలో అడ్మిషన్లు కోల్పోతామేమోనని ర్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 ఎందుకిలా జరిగిందంటే..!
 రాష్ట్రవ్యాప్తంగా 110 మీ సేవా కేంద్రాలు ప్రభుత్వ అధీనంలోనూ, 4 వేలకుపైగా కేంద్రాలు ప్రైవేటు, మూడు సర్వీస్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మూడింటిలో ఒకటైన రామ్ ఇన్‌ఫర్మాటిక్స్ సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్ గత నెల 31తో ముగిసినందున, సదరు కాంట్రాక్ట్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్‌టీఎస్)కు అప్పగించారు. దీంతో రామ్ ఇన్‌ఫర్మాటిక్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న 1200 ప్రైవేటు ఫ్రాంఛైజీ(కేంద్రాల)లకు మీసేవా సర్వీసులను ఈ నెల 1నుంచి నిలిపివేశారు. ఆయా కేంద్రాలకు సర్వీస్ రెన్యువల్ నిమిత్తం నిర్వాహకులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌టీఎస్ సూచించింది.

ఈ క్రమంలో కొన్ని కేంద్రాలకు దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తి, నిర్వాహకుని వివరాల్లో తేడాలుండడంతో ఆయా దరఖాస్తులను టీఎస్‌టీఎస్ పక్కనబెట్టింది. ముందస్తు నోటీసులివ్వకుండా అకస్మాత్తుగా సర్వీసులను నిలిపివేయడం వల్ల వివిధ సర్టిఫికెట్ల నిమిత్తం వచ్చే దరఖాస్తుదారులకు అసౌకర్యం కలిగిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న 110 మీ సేవాకేంద్రాల నిర్వహణ కాంట్రాక్ట్‌ను కొత్తగా నెట్‌ఎక్సెల్ సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కాంట్రాక్టర్ నుంచి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను బదిలీ చేసుకునే ప్రక్రియలో భాగంగా కొన్ని కేంద్రాల్లో సర్వీసులకు అంతరాయం కలిగినట్లు మీ సేవా కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement