జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల బిల్లులను త్వరలో మీ సేవ..
అద్దంకి : జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల బిల్లులను త్వరలో మీ సేవ ద్వారా వసూలు చేయనున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ మునీంద్రనాథ్ తెలిపారు. స్థానిక గీతా మందిరంలో ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల నుంచి సూచనలు సలహాలు తీసుకోవడంతో పాటు సమస్యలను తెలుసుకున్నారు.
పలువురు వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీసు ఇటీవల సరిగా పనిచేయడం లేదని, టవర్ల సిగ్నల్స్ కొన్ని చోట్ల ఉండడం లేదని జీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై మునీంద్రనాథ్ మాట్లాడుతూ.. సిగ్నల్ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చోట కొత్త టవర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 50 టవర్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు.
త్రీజీ సేవలను త్వరలో అందిస్తామని వెల్లడించారు. కొత్త టవర్ల ఏర్పాటు వల్ల పరిధి పెరగడంతో పాటు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను 198కి తెలియజేయాలని కోరారు. కొత్త టవర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని స్థానిక ప్రజలు అద్దెకు ఇస్తే వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం హెచ్‌ఆర్ జీ సుబ్బారావు, డీజీఎం ఫైనాన్స్ జయకుమార్, ఎస్‌డీఈ సత్యవర్థన్, జేటీఓ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.