BSNL users
-
బీఎస్ఎన్ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు చార్జీలు పెంచేయడంతో చాలామంది ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే గణనీయంగా యూజర్లు ఇతర కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్లో చేరారు. వినియోగదారుల డిమాండ్‌కు తగ్గుట్టుగానే ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ 4జీ సేవలను విస్తృతం చేస్తోంది. అయితే బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కొత్త సమస్య వచ్చింది. అదేంటంటే..4జీ రోల్అవుట్ కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల కారణంగా, బీఎస్ఎన్ఎల్ (BSNL) కస్టమర్లు 4జీ సేవలను ఉపయోగించడానికి 5జీ-అనుకూల ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి రావచ్చు. 4G సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ 2,100 MHz, 700 MHz అనే రెండు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను ఉపయోగిస్తోంది. వీటిలో 700 MHz బ్యాండ్ సాధారణంగా 5జీ సేవలకు సంబంధించిదైనా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలకు కూడా వినియోగిస్తోంది.ఇతర టెలికాం ఆపరేట్లకు ఇచ్చినట్లే ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కి కూడా 700 MHz బ్యాండ్‌ని కేటాయించింది. అయితే జియో వంటి వాణిజ్య ఆపరేటర్లు తమ స్వంత 5జీ నెట్వర్క్ కోసం దీనిని ఇంకా ఉపయోగించడం లేదు. ఈ బ్యాండ్ 5జీ సేవల కోసం ఇంకా పూర్తిగా స్థాపితం కాలేదు.దీంతో 2,100 MHz ఫ్రీక్వెన్సీ మాత్రమే సరిపోదన్న ఉద్దేశంతో బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్‌ని కూడా 4జీ సేవలు అందించడానికి ఉపయోగిస్తోంది.ఇదీ చదవండి: జియోలో అత్యంత చవకైన ప్లాన్ ఇదే..ఈ సమస్య గురించి తెలిసిన ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్ (B28)తో పని చేసేలా 4జీ ఫోన్లను తయారు చేయాలని తయారీ కంపెనీలను కోరింది. రాబోయే హ్యాండ్సెట్లు 700 MHz బ్యాండ్‌లో 4జీ, 5జీ రెండింటికి సపోర్ట్ చేసేలా చూసేందుకు బీఎస్ఎన్ఎల్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో సమన్వయంతో పనిచేస్తోంది. బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్‌తో పనిచేసే ఫోన్లు ప్రస్తుతం 1,000 మాత్రమే ఉన్నాయి. -
బీఎస్ఎన్ఎల్ ‘టాటా కామ్’ ఆఫర్
ముంబై: టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) శుక్రవారం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ చందాదారులకు అంతర్జాతీయంగా ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. తన వినియోగదారులకు అపూర్వమైన డాటా అనుభవాన్ని అందించే క్రమంలో టాటా కమ్యూనికేషన్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. హై క్వాలిటీ, వేగవంతమైన డాటా అందించేలా టాటా కమ్యూనికేషన్స్ తో వై ఫై, వైఫై క్లౌడ్ కమ్యూనికేషన్స్ కో్సం ఒక భాగస్వామ్యాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. దాదాపు 100కు పైగా దేశాల్లో 4.4 కోట్ల (44మిలియన్ల) వై ఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ విమానాలు, రైల్వేలతో సహా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్టు టాటా కమ్యూనికేషన్స్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. టాటా కామ్ బిఎస్ఎన్ఎల్ చందాదారులు భారతదేశం వెలుపల ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రపంచంలో వైఫై నెట్వర్కుకు అనుమతి ఉంటుందని తెలిపింది. అంతేకాదు వివిధ పాస్ వర్డ్ లను గుర్తుంచుకోవడంలో గజిబిజి లేకుండానే....వై ఫై హాట్ స్పాట్ కు ఒక్కసారి నమోదు అయితే చాలని చెప్పింది. దీంతో వారు వేరు వేరు నగరం, దేశం లేదా ఖండం ఎక్కడున్నా సమీపంలోని వైఫైకి ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతారని టాటా కామ్ వెల్లడించింది. ప్రపంచంలో్ ఎక్కడున్న బిఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారుల బిల్లు షాక్ గురించి చింతలేకుండా ఇంటర్నెట్ అనుభూతిని అందించడమే తమలక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. -
మీ సేవ ద్వారా బీఎస్ఎన్ఎల్ బిల్లులు!
అద్దంకి : జిల్లాలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల బిల్లులను త్వరలో మీ సేవ ద్వారా వసూలు చేయనున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ మునీంద్రనాథ్ తెలిపారు. స్థానిక గీతా మందిరంలో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల నుంచి సూచనలు సలహాలు తీసుకోవడంతో పాటు సమస్యలను తెలుసుకున్నారు. పలువురు వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సర్వీసు ఇటీవల సరిగా పనిచేయడం లేదని, టవర్ల సిగ్నల్స్ కొన్ని చోట్ల ఉండడం లేదని జీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై మునీంద్రనాథ్ మాట్లాడుతూ.. సిగ్నల్ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చోట కొత్త టవర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 50 టవర్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. త్రీజీ సేవలను త్వరలో అందిస్తామని వెల్లడించారు. కొత్త టవర్ల ఏర్పాటు వల్ల పరిధి పెరగడంతో పాటు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను 198కి తెలియజేయాలని కోరారు. కొత్త టవర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని స్థానిక ప్రజలు అద్దెకు ఇస్తే వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం హెచ్ఆర్ జీ సుబ్బారావు, డీజీఎం ఫైనాన్స్ జయకుమార్, ఎస్డీఈ సత్యవర్థన్, జేటీఓ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
కరెంట్ పోతే సిగ్నల్ కట్
ఉట్నూర్ : ఎక్కడైనా.. ఎప్పుడైనా మనం సెల్ఫోన్లో మాట్లాడుతుంటే మళ్లీ మనం కట్ చేసే వరకూ కాల్ నడుస్తూనే ఉంటుంది. కానీ.. ఏజెన్సీ పరిధిలో పరిస్థితి భిన్నం. సెల్ఫోన్లో మాట్లాడుతుండగా కరెంటు పోయిందంటే చాలు కాల్ కట్ కావడమే. ఇలా ఇరవై రోజులుగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ బాధలు భరించలేక వినియోగదారులు తమ సర్వీసులను మార్చుకుంటున్నారు. ఇప్పటికే 7,200 మంది బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు వేరే సర్వీసుల వైపు మళ్లారని ప్రాంచేజ్ నిర్వాహకులు తెలిపారు. కరెంట్ పోతే సెల్ కాల్ కట్టే.. ఏజెన్సీ కేంద్రంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ సర్కిల్లో 19 టవర్లున్నాయి. నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలు ఈ సర్కిల్‌లోకి వస్తాయి. వీటి కింద బీర్సాయిపేట, ఉట్నూర్ లక్ష్మీలాడ్జ్, ఆర్డీవో కార్యాలయం, బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం, ఎక్స్‌రోడ్డు, ఉషెగాం, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, జామిని, తాడిహత్నుర్, నార్నూర్, దాబా-కె, నార్నూర్, గాదిగూడ, పులిమడుగు, ఇంద్రవెల్లి, వడ్గాం, ధన్నోర (బీ), పంగిడి ప్రాంతాల్లో సెల్‌సిగ్నల్ టవర్లున్నాయి. అవీకాక హస్నాపూర్, లోకారి, ముత్నుర్, కోలామా, చిమన్‌గూడి ప్రాంతాల్లో కొత్త టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. 20 రోజులుగా సెల్ సిగ్నల్స్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉట్నూర్ మండలంలో కరెంట్ పోయిందంటే సెల్కాల్ మాట్లాడుతుండగానే సిగ్నల్స్ కట్ అవుతున్నాయి. మళ్లీ కరెంట్ వచ్చే వరకూ వారి సెల్ఫోన్లు మూగబోతున్నాయి. పనిచేయని బ్యాటరీ బ్యాకప్‌లు.. ఉట్నూర్ సర్కిల్ పరిధిలోని పలు టవర్లకు బ్యాకప్ బ్యాటరీలు ఉన్నా.. పూర్తిస్థాయిలో పనిచేయడంలేదు. లక్ష్మీలాడ్జ్ టవర్ వద్ద ఉన్న జనరేటర్ చెడిపోయినా మరమ్మతులు చేయించేవారు లేరు. దీంతో బ్యాటరీలు అరగంటకు మించి పనిచేయడం లేదు. జనరేటర్ చెడిపోయి కరెంటు పోగానే కాల్ కట్ అవుతోంది. అదీకాక కరెంట్ గంటల తరబడి పోతుండటంతో టవర్లకు సరిపడా డీజిల్ అందకుండా పోతోంది. సర్కిల్లోని లింగాపూర్, పులిమడుగు, గాదిగూడ, దాబా-కే, వడ్గాం, ఇంద్రవెల్లి, లక్ష్మీలాడ్జ్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గల టవర్లకు రెండు రోజులకు 300 లీటర్ల డీజిల్ పోయాల్సి వస్తోందని, ఆ భారం మోయలేకుండా ఉన్నామని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు. ఫలితంగా వినియోగదారులు తమ నెట్‌వర్క్‌లను మార్చుకుంటున్నారు. రోజుకు రూ.50 వేల బిజినెస్ కావడం లేదు.. ఇరవై రోజులుగా బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదు. కరెంటు పోయిందంటే ఫోన్లు మూగబోతున్నాయి. ఒకప్పుడు రోజుకు ప్రాంచేజ్‌లో రూ.2 లక్షల బిజినెస్ అయ్యేది. ఇప్పుడు రోజుకు రూ.50 వేలు కూడా కావడం లేదు. తీవ్ర నష్టం వాటిల్లుతోంది. - సయ్యద్ మాజీద్ అలీ, బీఎస్ఎన్ఎల్ ప్రాంచేజ్ నిర్వాహకుడు ఉట్నూర్