లింక్‌లో తిరకాసు | officers break the key link to mee seva centers | Sakshi
Sakshi News home page

లింక్‌లో తిరకాసు

Published Sat, May 13 2017 2:36 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

లింక్‌లో తిరకాసు

లింక్‌లో తిరకాసు

► మీ సేవ కేంద్రాలకు కీలక లింక్‌కు అధికారుల బ్రేక్‌
► 130 మందికి ఇచ్చి 36 మందిని పక్కన పెట్టిన వైనం
► సర్వీసుల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణ
► కలెక్టరేట్‌ చుట్టూ నిర్వాహకుల ప్రదక్షిణలు
► కేంద్రాల నిర్వహణ భారమైందని ఆవేదన


ఒంగోలు టౌన్‌ : మీ సేవ కేంద్రాలకు లింక్‌ల పేరుతో అధికారులు తిరకాసు పెట్టారు. ప్రభుత్వ సర్వీసుల(కీలకమైన రెవెన్యూ అంశాలు)కు సంబంధించిన కీలకమైన లింక్‌లు కొందరు నిర్వాహకులకు మాత్రమే ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అధికారులు స్పందించక పోవడంతో మీకోసంలో కూడా ఉన్నతాధికారులను కలిసి గోడు వెళ్లబుచ్చుకున్నారు. అయినప్పటికీ వారి లింక్‌ సమస్య కొలిక్కి రాలేదు. దీంతో మీ సేవ కేంద్రాల నిర్వహణ కష్టతరంగా మారిందని, చివరకు అద్దెలు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక..
నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగంలో గత ఏడాది నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులను చూసి విస్తుపోయిన యంత్రాంగం వారిని ఫిల్టర్‌ చేయాలన్న ఉద్దేశంతో రాత పరీక్ష, ఇంటర్వూ్యల ద్వారా   అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ఎంపికైన అభ్యర్థులకు సర్వీసులను కేటాయించడంలో ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

130 మందికే సర్వీసుల లింక్‌..
జిల్లాలో 166 మందికి మీ సేవ కేంద్రాలు మంజూరైతే వారిలో 130 మందికి కీలకమైన రెవెన్యూ సర్వీసెస్‌కు సంబంధించిన లింక్‌ ఇచ్చారు. మిగిలిన 36మందిని పక్కన పెట్టేశారు. ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లింక్‌ ఇవ్వాలంటూ ఆ 36మంది కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ లింక్‌ ఇవ్వకపోవడంతో వారిలో దాదాపు 13మంది మీ సేవ కేంద్రాలను వదులుకునే పరిస్థితికి వచ్చారు.

ఖర్చు బారెడు.. ఆదాయం మూరెడు
మీ సేవ కేంద్రాలను సంబంధిత నిర్వాహకులు భరించలేని పరిస్థితులు నెలకొన్నాయి.  ప్రభుత్వ సర్వీసులు ఇవ్వకుండా ఇతరత్రా సేవలు మాత్రమే కేటాయించకపోవడంతో వాటిని బలవంతంగా వదిలించుకునే పరిస్థితిని జిల్లా యంత్రాంగం కల్పిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానమైన కూడళ్లల్లో మీ సేవ కేంద్రం నిర్వహించాలంటే అక్కడి రెంటు, అడ్వాన్స్‌తోనే సంబంధిత నిర్వాహకులు హడలిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనీస అద్దె రూ.6 వేలు, అడ్వాన్స్‌ లక్ష రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది.

మీ సేవ కేంద్రం నిర్వహించాలంటే రెండు కంప్యూటర్‌ సిస్టమ్స్, ఒక ప్రింటర్‌ తప్పనిసరిగా ఉండాలి. ప్రతినెలా నెట్‌ బిల్‌ ఎంత లేదనుకున్నా రూ.1500 తక్కువగా ఉండదు. కరెంట్‌ బిల్లు రూ.800 నుంచి రూ.1200 వరకు వస్తోంది. ఇంత ఖర్చు చేసినా చివరకు నెలకు ఆ మీ సేవ కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.750కు మించకపోవడం గమనార్హం. రెవెన్యూ సర్వీసెస్‌కు సంబంధించిన లింక్‌ లేని మీ సేవ కేంద్రాలు కేవలం సెల్‌ఫోన్‌ రీ ఛార్జిలు, కరెంట్‌ బిల్లులు, పాన్‌ కార్డులు, మార్కుల లిస్టులకే  పరిమితమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ సేవ కేంద్రాలను ఏవిధంగా నిర్వహించాలంటూ అనేకమంది నిర్వాహకులు వాపోతున్నారు.

డిపాజిట్‌ తిరిగివ్వాలని వినతి..
జిల్లాలో 36 మీ సేవ కేంద్రాలకు చెందిన నిర్వాహకులు తమ నెలవారీ ట్రాన్జాక్షన్‌ రిపోర్ట్, తహసీల్దార్‌ రిపోర్ట్‌ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లింక్‌ ఇవ్వకపోవడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. కేంద్రాలను పొందిన తరువాత డిపాజిట్‌ రూపంలో ఒక్కొక్కరి నుంచి రూ.25వేలు వసూలు చేశారని, ఆ డిపాజిట్‌ అయిన తిరిగి వెనక్కు ఇస్తే మీ సేవలకు ఒక దండం పెట్టుకొని వెళతామంటూ కొంతమంది మీ సేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటం వారి పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ 36మంది నిర్వాహకులకు ప్రభుత్వ సర్వీసులు అందిస్తారా లేక వారిని అలాగే వదిలేస్తుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement