ఈసారి ‘మీ సేవ’ లేనట్టే! | Delays in in connection with agricultural projects | Sakshi
Sakshi News home page

ఈసారి ‘మీ సేవ’ లేనట్టే!

Published Tue, Aug 26 2014 12:24 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM

ఈసారి ‘మీ సేవ’ లేనట్టే! - Sakshi

ఈసారి ‘మీ సేవ’ లేనట్టే!

వ్యవసాయ పథకాలకు అనుసంధానంలో జాప్యం
ప్రాథమిక దశలోనే ఆగిపోయిన ప్రక్రియ
అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడో?
గజ్వేల్: ప్రతి ఏటా రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాల పంపిణీ, పంటల బీమా చెల్లింపు వ్యవసాయశాఖకు తలకు మించిన భారంగా మారింది. మరోవైపు అర్హులైన చాలామంది రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ అందడంలేదు. రాజకీయాల జోక్యం ఫలితంగా ఇబ్బందులెదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయశాఖ అందించే ప్రధాన పథకాలన్నింటినీ ‘మీ-సేవ’తో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లాలో గతేడాది మొదటి విడతగా పంటల బీమాకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించారు. కానీ వరుసగా ఎన్నికలు రావడంతో ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఈసారి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాల్సి ఉండగా..  వ్యవసాయశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు.
 
ఇదీ విధానం...
వ్యవసాయశాఖ పథకాలకు సంబంధించి ‘మీ-సేవ’ కేంద్రంలో దరఖాస్తు చేసుకోగానే ఆ కేంద్రంలో రైతులకు రశీదు అందజేస్తారు.  వెంటనే ఆ వివరాలన్నీ సంబంధిత మండల వ్యవసాయాధికారికి వెబ్‌సైట్ ద్వారా చేరుతాయి. మీ-సేవ కేంద్రంలో పొందిన రశీదుతో వ్యవసాయాధికారిని సంప్రదిస్తే విత్తనాలు, ఎరువులైతే అతని భూ విస్తీర్ణాన్ని బట్టి టోకెన్ అందిస్తారు. ఆ టోకెన్ తీసుకెళ్లి దుకాణాదారునికి వద్దకు వెళ్తే రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందించే అవకాశముంటుంది.

ఆధునిక పరికరాలు, పంటల బీమా పొందాలంటే గతంలో బ్యాంకుల్లో డీడీ తీసి వ్యవసాయాధికారికి అందజేయాల్సి ఉండేది. కానీ కొత్త విధానంలో రైతులు నేరుగా ప్రీమియంను ‘మీ-సేవ’ కేంద్రంలో చెల్లిస్తే చాలు ఆ పథకం వర్తిస్తుంది. ఈ సందర్భంగా రైతులు తమ బ్యాంకు ఖాతా నంబర్‌ను అందులో నమోదు చేయాల్సి ఉంటుం ది. యంత్ర పరికరాల కోసం ‘మీ-సేవ’ కేంద్రంలో దరఖాస్తు అందజేసిన సందర్భంగా పొందిన రశీదును మండల వ్యవసాయాధికారికిస్తే అక్కడ వ్యవసాయాధికారి మరో టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్‌తో సంబంధిత కంపెనీ ప్రతినిధిని సంప్రదిస్తే పరికరాలను పంపిణీ చేస్తారు.
 
వచ్చే ఏడాదిలో అమలుచేయడానికి ప్రయత్నిస్తాం
జిల్లాలో వ్యవసాయపథకాలకు ‘మీ-సేవ’ను అనుసంధానం చేసే ప్రక్రియ కొన్ని ఇబ్బందుల వల్ల నిలిచిపోయిన మాట వాస్తవమే. వ్యవసాయశాఖ కమిషనర్‌కు విషయాన్ని వివరించి.. వచ్చే ఏడాది సాఫ్ట్‌వేర్ సమస్యలు రాకుండా ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.
 -హుక్యానాయక్, జాయింట్ డెరైక్టర్, వ్యవసాయ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement