Software problems
-
టీచర్ల బదిలీల గడువు పొడిగించే చాన్స్!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ పద్ధతిలో లోపాలు.. అప్‌గ్రేడ్ కాని ఆప్షన్లు.. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు.. ఇలా ఉపాధ్యాయుల బదిలీల్లో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తు చేసుకునే గడువును పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంది. గడువు పొడిగింపు విషయాన్ని సోమవారం అధికారికంగా వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. టీచర్ల బదిలీలు, పదోన్నతికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసింది. ఈ నెల 28 నుంచి టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు సోమవారం ముగుస్తుంది. ఇప్పటికి 27 వేలమంది.. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వరకూ 27,668 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన వెల్లడించారు. ఒకే స్కూల్లో 8 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్లను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. 5 ఏళ్లు ఒకేచోట పనిచేస్తున్నవాళ్లు బదిలీ సీనియారిటీలో ఉంటారు. ఇలా మొత్తం 70 వేలమంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే, గడువు సమీపిస్తున్నప్పటికీ సగంమంది కూడా దరఖాస్తు చేసుకోలేకపోవడం గమనార్హం. గతంలో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌నే ఇప్పుడూ వాడుతున్నారని, దీనిని అప్‌గ్రేడ్ చేయలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీనివల్ల కొన్ని ఆప్షన్లు కన్పించడంలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఆర్ఏ కేటగిరీలు గతంలో నాలుగు ఉండగా, ఇప్పుడు మూడింటికి కుదించారు. కానీ, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయలేదు. స్పౌజ్ 8 ఏళ్లుగా బదిలీ అవకాశాన్ని వాడుకున్నారా? అనే ఆప్షన్లో వాడుకోలేదనే ఆప్షన్‌కు టిక్ పెడితే దరఖాస్తును తీసుకోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. మారుమూల గ్రామాల్లో తొలిరోజు ఆన్లైన్ విధానం పనిచేయలేదనే ఫిర్యాదులొచ్చాయి. దరఖాస్తు గుడువు ఒకరోజు మాత్రమే ఉండటంతో మిగిలిన 40 వేలమంది ఒకేసారి దరఖాస్తు చేస్తే సర్వర్ స్తంభించే అవకాశముందని విద్యాశాఖలోని సాంకేతిక వర్గాలు అంటున్నాయి. ఎస్జీటీల సంగతేంటి? స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 615 మంది స్పౌజ్‌లు వారి ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించినా సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్టీటీ) విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఖాళీలున్నా తమకు ఎందుకు న్యాయం చేయడంలేదని వారు జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు. వాస్తవానికి అన్ని జిల్లాల్లోనూ పోస్టులున్నాయి. సంగారెడ్డి జిల్లాల్లో కేవలం ముగ్గురు స్పౌజ్‌లే బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ 242 పోస్టులున్నా అనుమతించలేదు. ఖమ్మంలో 341 పోస్టులుంటే 41 మంది స్పౌజ్‌లే దరఖాస్తు చేశారు. అన్ని జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఖాళీలున్నా ఎందుకు బదిలీచేయడం లేదని స్పౌజ్ ఫోరం నేతలు ప్రశ్నిస్తున్నారు. గడువు పెంచాల్సిందే... సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా అనేకమంది టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 1 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. టీచర్ల దరఖాస్తులు డీఈవోలకు సమర్పించేందుకు మూడు రోజుల గడువిచ్చారు. కాకపోతే ఈ సమయాన్ని తగ్గించి, టీచర్లు ఆన్లైన్ దరఖాస్తులు పెట్టుకునే గడువు పెంచాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఐటీ పోర్టల్‌తో తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించి ఆదాయపు పన్ను పోర్టల్‌లో సమస్యలతో ట్యాక్స్‌పేయర్ల కుస్తీ కొనసాగుతోంది. దీంతో లోపాల పరిష్కారానికి సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ క్రియాత్మక చర్యలు తీసుకుంటోందని ఐటీ విభాగం వెల్లడించింది. ‘ఐటీడీ ఈ–ఫైలింగ్ పోర్టల్‌ను ఉపయోగించుకోవడంలో ట్యాక్స్‌పేయర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి మా దృష్టికి వచ్చింది. ఇన్ఫోసిస్ కూడా దీన్ని గుర్తించి, పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేసింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూపొందించిన కొత్త ఈ–ఫైలింగ్ పోర్టల్ 2021 జూన్ 7న అందుబాటులోకి వచ్చినప్పట్నుంచీ లోపాలపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. -
సాఫ్ట్వేర్ సమస్యలన్నీ సరిదిద్దాం
సాక్షి, హైదరాబాద్: ‘సాఫ్ట్వేర్ సమస్యలన్నీ సరిదిద్దాం.. కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నాం.. గత పరీక్షల సమయంలో దొర్లిన ప్రతి తప్పునూ సవరించాం.. విద్యార్థులు ఈసారి ఎలాంటి భయా నికి గురికాకుండా పరీక్షలు రాయవచ్చు. పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నాం’అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. వచ్చే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 9,62,699 మంది ఫీజు చెల్లించారని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు మరికొంత మంది ఫీజు చెల్లించే అవకాశం ఉందని, అవసరమైతే ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తామని చెప్పారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఉమర్ జలీల్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పరీక్షలకు ముందు, పరీక్షల తరువాత కంప్యూటర్ ప్రాసెసింగ్‌లో దొర్లిన తప్పుల విషయంలో త్రీమెన్ కమిటీ ఇచ్చిన సిఫారసులు అన్నింటినీ అమలు చేస్తున్నామని జలీల్ స్పష్టం చేశారు. త్రీమెన్ కమిటీ లేవనెత్తిన అంశాలను, తమ దృష్టికి వచ్చిన లోపాలను పరిగణనలోకి తీసుకొని, అవేమీ దొర్లకుండా ఈసారి సొంత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని తెలిపారు. బోర్డులో ప్రత్యేకంగా ఐటీ, డొమైన్ టీమ్‌లను (ఈడీపీ) నియమించామని చెప్పారు. ఈసారి పరీక్షల నిర్వహణ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు (సీజీజీ) అప్పగించామని పేర్కొన్నారు. బోర్డుకు, సీజీజీకి మధ్య సమన్వయకర్తగా ఈడీపీ టీం పని చేస్తుందన్నారు. గ్లోబరీనాకు ఉన్న ఒప్పందం వేరే అంశమని, దానికి ఎప్పటివరకు సమయం ఉంది.. ఎన్నాళ్లు చేయాల్సి ఉందన్నది వేరుగా పరిశీలిస్తామన్నారు. 15 వరకు సవరణలకు అవకాశం.. ఫీజు చెల్లించిన విద్యార్థుల వివరాల్లో పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఈ నెల 15 వరకు గడువు ఇచ్చామని జలీల్ తెలిపారు. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడాక చెబుతామని వెల్లడించారు. ఈసారి కాలేజీల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గడువును జనవరి 15 వరకు పొడగిస్తామని చెప్పారు. -
రెండోరోజూ విమానాల్లో జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా చెక్ ఇన్ సాఫ్ట్వేర్ శనివారం ఐదు గంటల పాటు నిలిచిపోవడం పెను ప్రభావం చూపుతోంది. ఆదివారం రెండో రోజు సైతం 137 విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంటుందని ఎయిర్ ఇండియా పేర్కొంది. విమానాల సగటు జాప్యం 197 నిమిషాలుగా అంచనా వేసినట్టు ఎయిర్‌లైన్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, శనివారం ఉదయం 3.30 నుంచి 8.45 గంటల వరకూ ఎయిర్ ఇండియా పాసింజర్ సర్వీస్ సిస్టం (పీఎస్ఎస్) సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో వేలాది ప్రయాణీకులు నిలిచిపోయారు. సాఫ్ట్వేర్ షట్‌డౌన్‌తో శనివారం 149 విమానాల్లో జాప్యం చోటుచేసుకుందని ఆ ప్రతినిధి వెల్లడించారు. -
కొత్త వేతనాలు ఇంకా కలేనా..?
సాఫ్ట్వేర్ సమస్యతో మంజూరు కాని పరిస్థితి 1,320 మంది ఉపాధ్యాయులకు సమస్య మంచిర్యాల సిటీ : పదో వేతన సవరణ ద్వారా మే నెలకు సంబంధించిన కొత్త వేతనం తీసుకుంటామని ఆశ పడిన 2001 డీఎస్సీ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. సాఫ్ట్వేర్ సమస్య కారణంతో నూతన వేతనాలు మంజూరు కావడం లేదు. సుమారు 1,320 మంది జిల్లాలోని ఉపాధ్యాయులకు ఈ సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో 220 తెలుగు భాషా పండిత ఉపాధ్యాయులతో పాటు 1100 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు కొత్త వేతనాలకు నోచుకోవడం లేదు. కొత్త వేతనాలు మంజూరు కు నోచుకోని ఉపాధ్యాయులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరంతా తాము పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుల చుట్టూ తిరిగినా ఫలితం కానరావడంలేదు. సమస్య పరిష్కారం రాష్ట్రస్థాయిలోనే జరగాలి. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం ప్రధాన కారణం కావడంతో అక్కడే సరిదిద్దాల్సిన అవసరం ఏర్పడింది. జిల్లా ఖజానా శాఖకు ప్రధానోపాధ్యాయులు సమస్యను తీసుకెళ్లడంతో పది రోజుల కిందటే రాష్ట్ర ఖజానా అధికారులకు విషయాన్ని చేరవేసినా ఫలితం లేదు. అసలేం జరిగింది! 2001 డీఎస్సీ ద్వారా అదే సంవత్సరం అక్టోబర్17న ఎస్జీటీగా 1100 మంది ఉపాధ్యాయులు నియామకమయ్యూరు. భాషా పండిత నియామకంలో కొందరు కోర్టుకు వెళ్లడంతో అదే డీఎస్సీ ద్వారా 220 తెలుగు భాషా పండితులు గ్రేడ్-2 వారు ఆలస్యంగా 2002 ఏప్రిల్ 3న ఆరునెలలు ఆలస్యంగా నియామకమయ్యూరు. ఆరు నెలలు ఆలస్యంగా నియామకం కావడంలో తమ తప్పేమీ లేదు కాబట్టి తమకు కూడా ఎస్జీటీలతో సమానంగా అక్టోబర్‌లోనే ఇంక్రిమెంటు ఇవ్వాలని పండిత ఉపాధ్యాయులు 2002లోనే ఇంక్రిమెంటు తీసుకున్నారు. ఇదిలా ఉండగా పదోన్నతికి సంబంధించిన 12 ఏళ్ల ఇంక్రిమెంటును 2014 ఏప్రిల్ 3న భాషా పండితులకు మంజూరైంది. 12 ఏళ్ల పదోన్నతి ఇంక్రిమెంటుకు, మొదట పొందిన ఇంక్రిమెంటుకు ఆన్లైన్లో తేడాలు ఏర్పడ్డాయి. అక్టోబర్‌లోనే ఇంక్రిమెంటు తీసుకున్నారని ఆన్లైన్లో నమోదైంది. కొత్త పీఆర్సీ వేతన స్థిరీకరణ ప్రకారం ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో 12 ఏళ్ల ఇంక్రిమెంటు పొందిన ఏప్రిల్ 3ను సూచించ డం లేదు. అక్టోబర్‌లో తీసుకున్న ఇంక్రిమెంటును తెలుపుతోంది. దీంతో జిల్లాలోని 1320 ఉపాధ్యాయులకు కొత్త వేతనం మంజూరు కావడం లేదు. ఏం చేయాలి : కొత్త వేతనం మంజూరు కావాలంటే రాష్ట్ర ఖజానా శాఖ అధికారులు సాప్ట్వేర్ వెబ్‌సైట్‌ను సవరించాలి. దీనికి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం కావాలి. దీంతోపాటు వేతన స్థిరీకరణ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన అధికారులు స్పందించాలి. లేదంటే ఉపాధ్యాయులు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పొం దిన ఇంక్రిమెంటును రాష్ట్ర ఖజానాకు చెల్లించాలి. అప్పటి వరకు కొత్త వేతనం రాదు. పాత వేతనంతోనే తృప్తి పడాల్సి ఉంటుంది. సమస్యను జిల్లా ఖజానా దృష్టికి ఉపాధ్యాయ సంఘాలు తీసుకెళ్లడంతో వారు రాష్ట్ర ఖజానా అధికారులకు వివరించారు. అయినా సమస్య నేటికీ పరిష్కారం కావడం లేదు. వేతనం : కొత్త పీఆర్సీ ప్రకారం మార్చి నుంచి ఏప్రిల్ వరకు ప్రతీ ఉపాధ్యాయులు మూడు నెలల ఏరియర్స్ సాంకేతిక లోపం వలన పొందలేకపోతున్నారు. ప్రతీ నెల ఏరియర్స్ రూ.వె య్యి నుంచి రూ.1,200 వరకు వస్తుంది. ఏరియర్స్‌తో పాటు మే నెల కొత్త వేతనం కూడా రాకుండాపోయింది. 1320 మం ది ఉపాధ్యాయులు మే నెలలో పాతవేతనాన్ని తీసుకున్నారు. సమస్య పరిష్కరిస్తాం 2001 డీఎస్సీ ద్వారా నియామకమై కొత్త వేతనం మంజూరు కాని ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరిస్తాం. సమస్యను సంఘం రాష్ట్ర కమిటీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఖజానా అధికారులతో చర్చిస్తున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. - పర్వతి సత్యనారాయణ, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఈసారి ‘మీ సేవ’ లేనట్టే!
►వ్యవసాయ పథకాలకు అనుసంధానంలో జాప్యం ►ప్రాథమిక దశలోనే ఆగిపోయిన ప్రక్రియ ►అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడో? గజ్వేల్: ప్రతి ఏటా రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాల పంపిణీ, పంటల బీమా చెల్లింపు వ్యవసాయశాఖకు తలకు మించిన భారంగా మారింది. మరోవైపు అర్హులైన చాలామంది రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ అందడంలేదు. రాజకీయాల జోక్యం ఫలితంగా ఇబ్బందులెదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయశాఖ అందించే ప్రధాన పథకాలన్నింటినీ ‘మీ-సేవ’తో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లాలో గతేడాది మొదటి విడతగా పంటల బీమాకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించారు. కానీ వరుసగా ఎన్నికలు రావడంతో ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఈసారి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాల్సి ఉండగా.. వ్యవసాయశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. ఇదీ విధానం... వ్యవసాయశాఖ పథకాలకు సంబంధించి ‘మీ-సేవ’ కేంద్రంలో దరఖాస్తు చేసుకోగానే ఆ కేంద్రంలో రైతులకు రశీదు అందజేస్తారు. వెంటనే ఆ వివరాలన్నీ సంబంధిత మండల వ్యవసాయాధికారికి వెబ్సైట్ ద్వారా చేరుతాయి. మీ-సేవ కేంద్రంలో పొందిన రశీదుతో వ్యవసాయాధికారిని సంప్రదిస్తే విత్తనాలు, ఎరువులైతే అతని భూ విస్తీర్ణాన్ని బట్టి టోకెన్ అందిస్తారు. ఆ టోకెన్ తీసుకెళ్లి దుకాణాదారునికి వద్దకు వెళ్తే రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందించే అవకాశముంటుంది. ఆధునిక పరికరాలు, పంటల బీమా పొందాలంటే గతంలో బ్యాంకుల్లో డీడీ తీసి వ్యవసాయాధికారికి అందజేయాల్సి ఉండేది. కానీ కొత్త విధానంలో రైతులు నేరుగా ప్రీమియంను ‘మీ-సేవ’ కేంద్రంలో చెల్లిస్తే చాలు ఆ పథకం వర్తిస్తుంది. ఈ సందర్భంగా రైతులు తమ బ్యాంకు ఖాతా నంబర్‌ను అందులో నమోదు చేయాల్సి ఉంటుం ది. యంత్ర పరికరాల కోసం ‘మీ-సేవ’ కేంద్రంలో దరఖాస్తు అందజేసిన సందర్భంగా పొందిన రశీదును మండల వ్యవసాయాధికారికిస్తే అక్కడ వ్యవసాయాధికారి మరో టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్‌తో సంబంధిత కంపెనీ ప్రతినిధిని సంప్రదిస్తే పరికరాలను పంపిణీ చేస్తారు. వచ్చే ఏడాదిలో అమలుచేయడానికి ప్రయత్నిస్తాం జిల్లాలో వ్యవసాయపథకాలకు ‘మీ-సేవ’ను అనుసంధానం చేసే ప్రక్రియ కొన్ని ఇబ్బందుల వల్ల నిలిచిపోయిన మాట వాస్తవమే. వ్యవసాయశాఖ కమిషనర్‌కు విషయాన్ని వివరించి.. వచ్చే ఏడాది సాఫ్ట్వేర్ సమస్యలు రాకుండా ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. -హుక్యానాయక్, జాయింట్ డెరైక్టర్, వ్యవసాయ శాఖ