కొత్త వేతనాలు ఇంకా కలేనా..?
సాఫ్ట్‌వేర్ సమస్యతో మంజూరు కాని పరిస్థితి
1,320 మంది ఉపాధ్యాయులకు సమస్య
మంచిర్యాల సిటీ : పదో వేతన సవరణ ద్వారా మే నెలకు సంబంధించిన కొత్త వేతనం తీసుకుంటామని ఆశ పడిన 2001 డీఎస్సీ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. సాఫ్ట్‌వేర్ సమస్య కారణంతో నూతన వేతనాలు మంజూరు కావడం లేదు. సుమారు 1,320 మంది జిల్లాలోని ఉపాధ్యాయులకు ఈ సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో 220 తెలుగు భాషా పండిత ఉపాధ్యాయులతో పాటు 1100 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు కొత్త వేతనాలకు నోచుకోవడం లేదు. కొత్త వేతనాలు మంజూరు కు నోచుకోని ఉపాధ్యాయులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరంతా తాము పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుల చుట్టూ తిరిగినా ఫలితం కానరావడంలేదు. సమస్య పరిష్కారం రాష్ట్రస్థాయిలోనే జరగాలి. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం ప్రధాన కారణం కావడంతో అక్కడే సరిదిద్దాల్సిన అవసరం ఏర్పడింది. జిల్లా ఖజానా శాఖకు ప్రధానోపాధ్యాయులు సమస్యను తీసుకెళ్లడంతో పది రోజుల కిందటే రాష్ట్ర ఖజానా అధికారులకు విషయాన్ని చేరవేసినా ఫలితం లేదు.
అసలేం జరిగింది!
2001 డీఎస్సీ ద్వారా అదే సంవత్సరం అక్టోబర్17న ఎస్జీటీగా 1100 మంది ఉపాధ్యాయులు నియామకమయ్యూరు. భాషా పండిత నియామకంలో కొందరు కోర్టుకు వెళ్లడంతో అదే డీఎస్సీ ద్వారా 220 తెలుగు భాషా పండితులు గ్రేడ్-2 వారు ఆలస్యంగా 2002 ఏప్రిల్ 3న ఆరునెలలు ఆలస్యంగా నియామకమయ్యూరు. ఆరు నెలలు ఆలస్యంగా నియామకం కావడంలో తమ తప్పేమీ లేదు కాబట్టి తమకు కూడా ఎస్జీటీలతో సమానంగా అక్టోబర్‌లోనే ఇంక్రిమెంటు ఇవ్వాలని పండిత ఉపాధ్యాయులు 2002లోనే ఇంక్రిమెంటు తీసుకున్నారు. ఇదిలా ఉండగా పదోన్నతికి సంబంధించిన 12 ఏళ్ల ఇంక్రిమెంటును 2014 ఏప్రిల్ 3న భాషా పండితులకు మంజూరైంది. 12 ఏళ్ల పదోన్నతి ఇంక్రిమెంటుకు, మొదట పొందిన ఇంక్రిమెంటుకు ఆన్‌లైన్‌లో తేడాలు ఏర్పడ్డాయి. అక్టోబర్‌లోనే ఇంక్రిమెంటు తీసుకున్నారని ఆన్‌లైన్‌లో నమోదైంది. కొత్త పీఆర్‌సీ వేతన స్థిరీకరణ ప్రకారం ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో 12 ఏళ్ల ఇంక్రిమెంటు పొందిన ఏప్రిల్ 3ను సూచించ డం లేదు. అక్టోబర్‌లో తీసుకున్న ఇంక్రిమెంటును తెలుపుతోంది. దీంతో జిల్లాలోని 1320 ఉపాధ్యాయులకు కొత్త వేతనం మంజూరు కావడం లేదు.
ఏం చేయాలి : కొత్త వేతనం మంజూరు కావాలంటే రాష్ట్ర ఖజానా శాఖ అధికారులు సాప్ట్‌వేర్ వెబ్‌సైట్‌ను సవరించాలి. దీనికి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం కావాలి. దీంతోపాటు వేతన స్థిరీకరణ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన అధికారులు స్పందించాలి. లేదంటే ఉపాధ్యాయులు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పొం దిన ఇంక్రిమెంటును రాష్ట్ర ఖజానాకు చెల్లించాలి. అప్పటి వరకు కొత్త వేతనం రాదు. పాత వేతనంతోనే తృప్తి పడాల్సి ఉంటుంది. సమస్యను జిల్లా ఖజానా దృష్టికి ఉపాధ్యాయ సంఘాలు తీసుకెళ్లడంతో వారు రాష్ట్ర ఖజానా అధికారులకు వివరించారు. అయినా సమస్య నేటికీ పరిష్కారం కావడం లేదు.
వేతనం : కొత్త పీఆర్‌సీ ప్రకారం మార్చి నుంచి ఏప్రిల్ వరకు ప్రతీ ఉపాధ్యాయులు మూడు నెలల ఏరియర్స్ సాంకేతిక లోపం వలన పొందలేకపోతున్నారు. ప్రతీ నెల ఏరియర్స్ రూ.వె య్యి నుంచి రూ.1,200 వరకు వస్తుంది. ఏరియర్స్‌తో పాటు మే నెల కొత్త వేతనం కూడా రాకుండాపోయింది. 1320 మం ది ఉపాధ్యాయులు మే నెలలో పాతవేతనాన్ని తీసుకున్నారు.
సమస్య పరిష్కరిస్తాం
2001 డీఎస్సీ ద్వారా నియామకమై కొత్త వేతనం మంజూరు కాని ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరిస్తాం. సమస్యను సంఘం రాష్ట్ర కమిటీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఖజానా అధికారులతో చర్చిస్తున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.
- పర్వతి సత్యనారాయణ, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి