
సాక్షి, హైదరాబాద్: ‘సాఫ్ట్‌వేర్ సమస్యలన్నీ సరిదిద్దాం.. కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నాం.. గత పరీక్షల సమయంలో దొర్లిన ప్రతి తప్పునూ సవరించాం.. విద్యార్థులు ఈసారి ఎలాంటి భయా నికి గురికాకుండా పరీక్షలు రాయవచ్చు. పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నాం’అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. వచ్చే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 9,62,699 మంది ఫీజు చెల్లించారని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు మరికొంత మంది ఫీజు చెల్లించే అవకాశం ఉందని, అవసరమైతే ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తామని చెప్పారు.
ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఉమర్ జలీల్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పరీక్షలకు ముందు, పరీక్షల తరువాత కంప్యూటర్ ప్రాసెసింగ్‌లో దొర్లిన తప్పుల విషయంలో త్రీమెన్ కమిటీ ఇచ్చిన సిఫారసులు అన్నింటినీ అమలు చేస్తున్నామని జలీల్ స్పష్టం చేశారు. త్రీమెన్ కమిటీ లేవనెత్తిన అంశాలను, తమ దృష్టికి వచ్చిన లోపాలను పరిగణనలోకి తీసుకొని, అవేమీ దొర్లకుండా ఈసారి సొంత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని తెలిపారు. బోర్డులో ప్రత్యేకంగా ఐటీ, డొమైన్ టీమ్‌లను (ఈడీపీ) నియమించామని చెప్పారు. ఈసారి పరీక్షల నిర్వహణ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు (సీజీజీ) అప్పగించామని పేర్కొన్నారు. బోర్డుకు, సీజీజీకి మధ్య సమన్వయకర్తగా ఈడీపీ టీం పని చేస్తుందన్నారు. గ్లోబరీనాకు ఉన్న ఒప్పందం వేరే అంశమని, దానికి ఎప్పటివరకు సమయం ఉంది.. ఎన్నాళ్లు చేయాల్సి ఉందన్నది వేరుగా పరిశీలిస్తామన్నారు.
15 వరకు సవరణలకు అవకాశం..
ఫీజు చెల్లించిన విద్యార్థుల వివరాల్లో పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఈ నెల 15 వరకు గడువు ఇచ్చామని జలీల్ తెలిపారు. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడాక చెబుతామని వెల్లడించారు. ఈసారి కాలేజీల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గడువును జనవరి 15 వరకు పొడగిస్తామని చెప్పారు.