బోర్డు మెటీరియల్‌ భేష్! కొన్ని సబ్జెక్టుల్లో 100 శాతం ప్రశ్నలు అక్కడి నుంచే.. | Inter Board Study Material Good For Inter Exams | Sakshi
Sakshi News home page

బోర్డు మెటీరియల్‌ భేష్! కొన్ని సబ్జెక్టుల్లో 100 శాతం ప్రశ్నలు అక్కడి నుంచే..

Published Sat, May 14 2022 12:45 AM | Last Updated on Sat, May 14 2022 3:20 PM

Inter Board Study Material Good For Inter Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటివరకు జరిగిన ఇంటర్‌ పరీక్షల్లో బోర్డు ఇచ్చిన స్టడీ మెటీరియల్‌ విశ్వసనీయతను చాటుకుంది. ఇందులోంచే ఎక్కువ ప్రశ్నలు రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కొన్ని సబ్జెక్టుల్లో 100 శాతం ప్రశ్నలు బోర్డు మెటీరియల్‌ నుంచే రావడం విశేషం. ఈసారి చాయిస్‌ ఎక్కువ ఇవ్వడంతో సమాధానం తెలియని ప్రశ్నలను చాయిస్‌ కింద వదిలేసే అవకాశం ఉంది.

అయితే చాయిస్‌లోని ప్రశ్నలు కూడా మెటీరియల్‌ నుంచే ఉంటున్నాయని విద్యార్థులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వల్ల ఆలస్యంగా ఇంటర్‌ తరగతులు మొదలయ్యాయి. దీంతో మారుమూల గ్రామాల విద్యార్థులు సరిగా పాఠాలు వినలేకపోయారు. అయితే వారిలో చాలా మంది బోర్డు మెటీరియల్‌ను అనుసరించడంతో పరీక్షలను తేలికగా రాయగలిగారు. ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ పరీక్షల్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. 

► ఇంటర్‌ ఫస్టియర్‌ బోటనీ పేపర్‌లో సెక్షన్‌–ఏ నుంచి ఇచ్చిన 15 ప్రశ్నలు, సెక్షన్‌–బీలోని 14 ప్రశ్నలకు, సెక్షన్‌–సీలో 4 ప్రశ్నలూ మెటీరియల్‌లోనివే కావడం విశేషం. 
► ఫస్టియర్‌ పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌లో సెక్షన్‌–ఏలో ఇచ్చిన ఏడు ప్రశ్నలూ బేసిక్‌ మెటీరియల్‌ నుంచే వచ్చాయి. సెక్షన్‌–బీలో 18 ప్రశ్నలకు 14, సెక్షన్‌–సీలో 25 ప్రశ్నలకు 21 ప్రశ్నలు బోర్డు మెటీరియల్‌ నుంచే వచ్చాయి. 
► గణితం పేపర్‌లో సెక్షన్‌–ఏలో 15 ప్రశ్నలకు 11, సెక్షన్‌–బీలో 12 ప్రశ్నలకు 6, సెక్షన్‌–సీలో 10కి ఆరు ప్రశ్నలు మెటీరియల్‌లోనివే. 
► ఇంటర్‌ సెకండియర్‌ బోటనీ పేపర్‌ సెక్షన్‌–ఏలో ఇచ్చిన 15కు 15 ప్రశ్నలు, సెక్షన్‌–బీలోని 14కు 14 ప్రశ్నలు, సెక్షన్‌–సీలో ఇచ్చిన 4 ప్రశ్నలూ మెటీరియల్‌ నుంచే రావడం విశేషం. 
► పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌లోని సెక్షన్‌–ఏలో ఏడుకు ఏడు, సెక్షన్‌–బీలో 18కి 14, సెక్షన్‌–సీలో 25 ప్రశ్నలకు 19 ఇందులోంచే అడిగారు. 
► సెకండియర్‌ గణితంలో సెక్షన్‌–ఏలో 15ప్రశ్నల కు 13, సెక్షన్‌–బీలో 12కు 6, సెక్షన్‌–సీలో పదికి 9 ప్రశ్నలు బేసిక్‌ మెటీరియల్‌ నుంచే వచ్చాయి. 

భయం పోయింది.. 
కరోనా వల్ల క్లాసులు రెగ్యులర్‌గా జరగకపోవడంతో పరీక్షలంటే కొంత భయం ఉండేది. నెల నుంచి బోర్డు స్టడీ మెటీరియల్‌ చదివాను. బోటనీ పేపర్‌లో ప్రశ్నలన్నీ మెటీరియల్‌ నుంచే వచ్చాయి. అనుకున్నదానికన్నా ఎక్కువ మార్కులు వస్తాయనే నమ్మకం కలిగింది.     
– వైద్యం అమర్త్య శాండిల్య, (ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి, హైదరాబాద్‌) 

మెటీరియల్‌పై దృష్టి పెట్టండి.. 
ప్రతి విద్యార్థికీ ఇది కీలక సమయం. ప్రశ్నలన్నీ మెటీరియల్‌ నుంచే వస్తున్నాయి. మున్ముందు రాసే పేపర్లు కూడా ఇదే రీతిలో ఉండే వీలుంది. ఎక్కువ సమయం బోర్డ్‌ స్టడీ మెటీరియల్‌పై దృష్టి పెట్టండి.   
 – ఉడిత్యాల రమణారావు (రీడర్, ఇంటర్‌ బోర్డ్‌)

నూరు శాతం ఉపయోగపడాలనే.. 
కరోనా వల్ల జరిగిన విద్యా సంవత్సర నష్టం విద్యార్థుల పై పడకూడదనే బేసిక్‌ స్టడీ మెటీరియల్‌ అందించాం. ఇది 100% విద్యార్థులకు ఉపయోగపడాలన్న కోణంలోనే రూపొందించాం. విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు మెటీరియల్‌ దోహదపడాలన్నదే మా లక్ష్యం. మున్ముందు కూడా ఇదే రీతిలో స్టడీ మెటీరియల్‌ మేలు చేస్తుంది.     
– సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ (ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి) 

75కు 70 మార్కులు గ్యారంటీ..
నెల నుంచి ఇంటర్‌ బోర్డు స్టడీ మెటీరియల్‌ చదివాను. ఎక్కువ ప్రశ్నలు అందులోంచే రావడంతో మ్యాథమెటిక్స్‌లో 75కు 70 మార్కులు వస్తాయనే నమ్మకం ఉంది. 
– టి. నిఖిత, ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని (వంగూర్, నాగర్‌కర్నూల్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement