ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే ప్రజలకు మెరుగైన సేవలను వేగంగా అందించవచ్చునని, అందుకు ప్రతక్ష్య నిదర్శనం ‘మీ సేవా’ అని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. బుధవారం ఖమ్మంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో జేసీ సురేంద్రమోహన్ అధ్యక్షతన ‘ మీ సేవా’పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ‘మీ సేవా’ను మరింత ప్రతిభావంతంగా అమలు చేసేందుకు క్వాంటిటీతో పాటు క్వాలిటీకి పెద్దపీట వేయాలని అన్నారు. ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ప్రభుత్వం ఈ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టిందని అన్నారు.
సంప్రదాయ విధానంలో సేవలు పొందిన ప్రజలు ఈ విధానంపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి వారి విశ్వాసాన్ని పొందేందుకు ఆపరేటర్లు, అధికారులు గుణాత్మక సేవలు అందించాలని సూచించారు. మీ సేవా కేంద్రలను కొంత మంది లీజ్‌కు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్టిఫికెట్ల జారీలో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. భద్రపరిచిన డాక్యుమెంట్లలో గుర్తించిన పొరపాట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నామని, జిల్లాలో మీ సేవా తీరు మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో మంచి నైపుణ్యం, అనుభవం ఉన్న జేసీ సురేంద్రమోహన్ కృషే ఇందుకు కారణమని అన్నారు.
ఐటీడీఏ నూతన పీఓకు కూడా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో అనుభవం ఉందని, వీరద్దరి సహకారంతో జిల్లాలో మీ సేవను ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. జేసీ సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే ‘మీసేవా’ విప్లవాత్మక మార్పులకు కారణమైందని అన్నారు. అధికారులకు పనిభారం తగ్గిందని అన్నారు.
మీ సేవా ప్రారంభంలో రెండు విభాగాలకు సంబంధించి తొమ్మిది సేవలే అందించామని, ప్రస్తుతం 232 కేంద్రాల ద్వారా 22 డిపార్ట్‌మెంట్లకు చెందిన 233 సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మీసేవా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 16.68లక్షల అభ్యర్థనలు వచ్చాయని, కేటగిరి ఏ కింద పరిష్కరించే వీలున్న 6.72లక్షల సమస్యలను వెంటనే పరిష్కరించామని అన్నారు. జిల్లాలోని పలు విభాగాల్లో అత్యంత ముఖ్యమైన, పురాతనమైన డాక్యుమెంట్‌లను స్కాన్ చేసి భద్రపరిచేందుకు జిల్లాకు రూ.50లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.
అతిత్వరలో మీసేవ ద్వారా రైతులకు ఈ -పట్టాదారు పాసు పుస్తకాలను అందించనున్నట్లు జేసీ తెలిపారు. ఐటీడీఏ పీఓ దివ్య మాట్లాడుతూ మీసేవ ఆపరేటర్లకు ప్రభుత్వం పలు అధికారాలను బదిలీ చేసిందని, వాటిని దుర్వినియోగం చేయరాదని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ నమూనా ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మీసేవ అమలులో మంచి పనితీరు కనపరచిన ఇ-డివిజనల్ మేనేజర్, వీఆర్‌వో, వీఆర్‌ఏ, సర్వీస్ సెంటర్ ఏజన్సీ మేనేజర్‌లకు ప్రశంసాపత్రాలు అందించారు. నూతనంగా వికలాంగుల కేటగిరిలో మీసేవా కేంద్రాల ఏర్పాటు చేసేందుకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ బాబురావు, ఆర్డీఓలు సంజీవరెడ్డి, వెంకటేశ్వర్లు , సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు
Published Thu, Feb 27 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM
Advertisement
Advertisement