ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకపక్క ప్రభుత్వ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుండగా...మరోపక్క పైరవీలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు...జిల్లాలో మూడేళ్ల పాటు ఒకే చోట పనిచేస్తూ, ఇదే జిల్లాకు చెందిన, ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులకు స్థానచలనం కలిగించే కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వివిధ శాఖల పరిధిలో మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచే స్తున్న అధికారుల జాబితాను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆ పనిలో ఉండగా...ఈవిషయంలో రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేస్తున్నారు. బదిలీ అయ్యే ఉద్యోగులు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తుండడంతో వారు కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ తప్పనిసరి అయిన పక్షంలో తమ వారిని దగ్గరి ప్రాంతాలకు బదిలీ చేయాలని, మళ్లీ ఎన్నికల తర్వాత మంచి పోస్టింగ్ ఇచ్చేలా చూసుకోవాలని పలువురు రాజకీయ నాయకులు పైరవీలు చేస్తున్నారు.
ఈ ైపైరవీల ప్రభావం జాబితా తయారీపై బాగానే పడుతుందని, అయినా ఎట్టి పరిస్థితుల్లో జాబితాను త్వరలోనే సిద్ధం చేస్తామని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఏదిఏమైనా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రాగానే బదిలీల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనే పట్టుదలతో కలెక్టర్ ఉన్నట్లు సమాచారం.
37 మంది తహశీల్దార్ల బదిలీ?
జిల్లాలో 37 మంది తహశీల్దార్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో 24మంది రెగ్యులర్ తహశీల్దార్‌లు కాగా, ప్రొబెషనరీ డిప్యూటీ తహశీల్దార్లు(డీటీ) 10మంది, ప్రమోషన్ పొందనున్న మరో ముగ్గురు ఉన్నట్లు సమాచారం.
ఎంపీడీవోల బదిలీలు జరిగేనా?
జిల్లాలో 46 మండలాలకు గాను 42మంది ఎంపీడీవోలు పనిచేస్తున్నారు. తాజాగా వచ్చిన ఆదేశాలతో జిల్లా పరిషత్ అధికారులు బదిలీల జాబితాను సిద్ధం చేస్తున్నారు. దుమ్ముగూడెం ఎంపీడీవో ఇతర జిల్లా నుంచి రావడం, గార్ల ఎంపీడీవో మరో ఆరునెలల్లో పదవీ విరమణ పొందనుండటంతో 40మంది ఎంపీడీవోలను బదిలీ చేసే అవకాశం ఉంది.
అయితే గతంలో నిర్వహించిన సాధారణ ఎన్నికల సమయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల సంఘానికి తమ బదిలీలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేయడంతో ఆ బదిలీలను నిర్వహించలేదు. అలాగే ఇప్పుడు కూడా ఎంపీడీవోలు తమ బదిలీలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
బదిలీ తప్పదా...అయితే...దగ్గర్లో చూడండి!
Published Thu, Jan 30 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement