విజయనగరం కంటోన్మెంట్ : ప్రభుత్వ సేవలను ప్రజలకు త్వరితగతిన అందించేందుకు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు అక్రమ వసూళ్లకు నిలయంగా మారాయి. ఈ కేంద్రాల నుంచి రాబడి అధికంగా వస్తుండడంతో వీటిపై మోజు పెరిగింది. దీంతో ఒకరి పేరున ఉన్న కేంద్రాలను మరొకరు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క కేంద్రం ఫర్నిచర్, కంప్యూటర్లతో కలిపి సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పలుకుతోంది. కొందరైతే వీటిని లీజుకు తీసుకుంటున్నారు. అది కూడా ఆధార్ సెంటర్ మంజూరైన కేంద్రాలకు మాత్రమే ఈ విధమైన గిరాకీ ఉంది. మిగతా ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలు లక్ష నుంచి రెండు లక్షల వరకూ పలుకుతున్నాయి. ఎవరికి కేటాయించిన కేంద్రాలను వారే నిర్వహించాలి. కానీ ఇష్టమొచ్చినట్లుగా విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలో 200కు పైగా మీ సేవా కేంద్రాలున్నాయి.
వీటిని డీఎంసీ, సీఎంఎస్ అనే ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఈ రెండింటి పర్యవేక్షణను జిల్లా కేంద్రంలోని ఈ జిల్లా మేనేజర్ చేపడుతున్నారు. అయితే జిల్లాలో ఉన్న మీ సేవా కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో నిర్వాహకులు నచ్చినట్టు పేర్లు మార్చుకుంటున్నారు. ఒకరికి కేటాయించిన కేంద్రాన్ని మరొకరికి అమ్మేస్తున్నారు. ఈ విక్రయాల వ్యవహారం జోరుగా సాగుతోంది. అలాగే కేంద్రాలను పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా చూసీ చూడనట్టు వదిలేయడంతో విక్రయాలు మరింత జోరందుకుంటున్నాయి. దీంతో తాము పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో మంజూరు చేయవలసిన వివిధ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్ కార్డు కోసం వచ్చిన వారి నుంచి రూ. 60 నుంచి రూ. 100 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఎక్కడా ఉచితంగా తీస్తున్న దాఖలాలు లేవు.
నిబంధనలు గాలికి!
కొన్ని కేంద్రాల్లో నిబంధనలు పాటించడం లేదు. వాస్తవానికి మీ సేవా కేంద్రాల్లో సిబ్బంది యూనిఫారం ధరించాలని గతంలో జాయింట్ కలెక్టర్ రామా రావు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంతవరకూ అమలు కాలేదు. అదేవిధంగా కేంద్రాలకు పింక్ కలర్ వేయాలి. కానీ పింక్ కలర్ కాకున్నా పింక్ కలర్ కర్టెన్లు వేసి వాటిని దర్జాగా నిర్వహిస్తున్న వైనం జిల్లాలోని పార్వతీపురం డివిజన్‌లో అధికంగా కనిపిస్తోంది.
రూ. 10 నుంచి 50 రూపాయలు ఫీజున్న సేవలు రూ. 20 నుంచి వంద రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. ఆధార్ తీసుకున్న వారి నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నా సరిగా పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల కలెక్టరేట్‌లో కూడా ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయి.
ఒక చోట అనుమతి మరోచోట నిర్వహణ
పలు కేంద్రాలు మంజూరైనా కాకుండా మరోచోట నిర్వహిస్తున్నారు. సీతానగరం మండల కేంద్రంలో నిర్వహించాల్సిన కేంద్రాన్ని లచ్చయ్యపేటలో నిర్వహిస్తున్నారు. అలాగే విజయనగరంలోని వేణుగోపాలపురానికి మంజూరైన కేంద్రాన్ని నెల్లిమర్ల ప్రాంతానికి తరలించారు. ఆధార్ సెంటర్లు కూడా నచ్చిన వారికి ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. మెరకముడిదాం మండలంలో అసలు మీ సేవా కేంద్రమే లేదు. కొన్ని మండలాల్లో మండల కేంద్రంలో మొదటి మీ సేవా కేంద్రానికే ఆధార్ సెంటర్ నమోదు చేయాల్సి ఉండగా రెండో సెంటర్‌కు ఇచ్చారు.
కఠిన చర్యలు తప్పవు
ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ఇప్పటికే పార్వతీపురం పరిధిలోని ఓ కేంద్రం నిర్వహకునిపై చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ బి.రామారావు తెలిపారు. ఇక ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
అంగట్లో మీ సేవ !
Published Thu, Mar 5 2015 1:18 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM
Advertisement
Advertisement