Illegal takings
-
అంగట్లో మీ సేవ !
విజయనగరం కంటోన్మెంట్ : ప్రభుత్వ సేవలను ప్రజలకు త్వరితగతిన అందించేందుకు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు అక్రమ వసూళ్లకు నిలయంగా మారాయి. ఈ కేంద్రాల నుంచి రాబడి అధికంగా వస్తుండడంతో వీటిపై మోజు పెరిగింది. దీంతో ఒకరి పేరున ఉన్న కేంద్రాలను మరొకరు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క కేంద్రం ఫర్నిచర్, కంప్యూటర్లతో కలిపి సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పలుకుతోంది. కొందరైతే వీటిని లీజుకు తీసుకుంటున్నారు. అది కూడా ఆధార్ సెంటర్ మంజూరైన కేంద్రాలకు మాత్రమే ఈ విధమైన గిరాకీ ఉంది. మిగతా ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలు లక్ష నుంచి రెండు లక్షల వరకూ పలుకుతున్నాయి. ఎవరికి కేటాయించిన కేంద్రాలను వారే నిర్వహించాలి. కానీ ఇష్టమొచ్చినట్లుగా విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలో 200కు పైగా మీ సేవా కేంద్రాలున్నాయి. వీటిని డీఎంసీ, సీఎంఎస్ అనే ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఈ రెండింటి పర్యవేక్షణను జిల్లా కేంద్రంలోని ఈ జిల్లా మేనేజర్ చేపడుతున్నారు. అయితే జిల్లాలో ఉన్న మీ సేవా కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో నిర్వాహకులు నచ్చినట్టు పేర్లు మార్చుకుంటున్నారు. ఒకరికి కేటాయించిన కేంద్రాన్ని మరొకరికి అమ్మేస్తున్నారు. ఈ విక్రయాల వ్యవహారం జోరుగా సాగుతోంది. అలాగే కేంద్రాలను పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా చూసీ చూడనట్టు వదిలేయడంతో విక్రయాలు మరింత జోరందుకుంటున్నాయి. దీంతో తాము పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో మంజూరు చేయవలసిన వివిధ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్ కార్డు కోసం వచ్చిన వారి నుంచి రూ. 60 నుంచి రూ. 100 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఎక్కడా ఉచితంగా తీస్తున్న దాఖలాలు లేవు. నిబంధనలు గాలికి! కొన్ని కేంద్రాల్లో నిబంధనలు పాటించడం లేదు. వాస్తవానికి మీ సేవా కేంద్రాల్లో సిబ్బంది యూనిఫారం ధరించాలని గతంలో జాయింట్ కలెక్టర్ రామా రావు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంతవరకూ అమలు కాలేదు. అదేవిధంగా కేంద్రాలకు పింక్ కలర్ వేయాలి. కానీ పింక్ కలర్ కాకున్నా పింక్ కలర్ కర్టెన్లు వేసి వాటిని దర్జాగా నిర్వహిస్తున్న వైనం జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో అధికంగా కనిపిస్తోంది. రూ. 10 నుంచి 50 రూపాయలు ఫీజున్న సేవలు రూ. 20 నుంచి వంద రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. ఆధార్ తీసుకున్న వారి నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నా సరిగా పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల కలెక్టరేట్లో కూడా ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయి. ఒక చోట అనుమతి మరోచోట నిర్వహణ పలు కేంద్రాలు మంజూరైనా కాకుండా మరోచోట నిర్వహిస్తున్నారు. సీతానగరం మండల కేంద్రంలో నిర్వహించాల్సిన కేంద్రాన్ని లచ్చయ్యపేటలో నిర్వహిస్తున్నారు. అలాగే విజయనగరంలోని వేణుగోపాలపురానికి మంజూరైన కేంద్రాన్ని నెల్లిమర్ల ప్రాంతానికి తరలించారు. ఆధార్ సెంటర్లు కూడా నచ్చిన వారికి ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. మెరకముడిదాం మండలంలో అసలు మీ సేవా కేంద్రమే లేదు. కొన్ని మండలాల్లో మండల కేంద్రంలో మొదటి మీ సేవా కేంద్రానికే ఆధార్ సెంటర్ నమోదు చేయాల్సి ఉండగా రెండో సెంటర్‌కు ఇచ్చారు. కఠిన చర్యలు తప్పవు ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ఇప్పటికే పార్వతీపురం పరిధిలోని ఓ కేంద్రం నిర్వహకునిపై చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ బి.రామారావు తెలిపారు. ఇక ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. -
కందూరు దందా
అన్నారంలో అడ్డగోలు వసూళ్లు నేటికీ ఖరారు కాని టెండర్లు సొంత రశీదులతో కుచ్చుటోపీ హుండీ ఎదుట సిబ్బంది దౌర్జన్యం భక్తులకు, సిబ్బంది మధ్య ఘర్షణ అన్నారం షరీఫ్ యాకూబ్‌బాబా దర్గాలో కందూరు(మొక్కులు, ఫాతియా) చెల్లించుకోవడం భక్తులకు కష్టంగా మారింది. భక్తుల నుంచి కందూరు టిక్కెట్లు, కానుకల చెల్లింపుల పేరిట సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. టెండర్లు ఖరారు కాకపోయినా సొంతంగా రశీదు టిక్కెట్లు ముద్రించి యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన భక్తులతో ఘర్షణకు దిగుతున్నారు. హన్మకొండ : అన్నారం షరీఫ్ యాకూబ్బాబాకు కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవుల్లో భక్తులు ఉన్నారు. ఇక్కడ భక్తులు చెల్లించే మొక్కులను కందూర్లు అంటారు. కోరికలు నెరవేరిన వారు కోడి, మేకలతో కందూర్లు చెల్లిస్తారు. వాహన పూజలు నిర్వహిస్తారు. ఏటా ఈ మొక్కులు, పూజల రూపంలో వచ్చే ఆదాయంపై ప్రభుత్వం టెండర్లు నిర్వహిస్తోంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కందూరు, పూజలకు రేట్లు నిర్ణరుుంచి.. టికెట్లు ముద్రించి భక్తుల నుంచి ఆదా యం పొందుతారు. 2014 డిసెంబరు 8వ తేదీతో పాత టెండరు ముగిసింది. 2015కుగాను కొత్త టెండర్లు ఆహ్వానించారు. అరుుతే ఇప్పటివరకు టెండర్లు తెరిచి ఎవరికీ దర్గా నిర్వహణ బాధ్యతలు వక్ఫ్‌బోర్డు అప్పగించ లేదు. సొంత రశీదులు టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో దర్గా నిర్వహణ వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉంది. దీనిని ఆసరా చేసుకుని ఇక్కడి దర్గా సిబ్బంది కొత్త దందాకు తెరలేపారు. వివిధ మొక్కులకు సంబంధించి మేక ఫాతియాకు రూ. 300, కోడి ఫాతియాకు రూ.100 ధర నిర్ణయించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆదివారం వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తులు టికెట్ల రేట్లపై ప్రశ్నించారు. గతంలో మేక ఫాతియాకు రూ.200 ఉండగా.. ఇప్పుడు రూ.300 చేశారని పర్వతగిరి మండలం కల్లెడ, నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామానికి చెందిన భక్తబృందం సభ్యులు అడిగితే ‘గతంలో అన్నారం దర్గా కాంట్రాక్టు రూ.60 లక్షలు ఉంది. ఈ యేడు రూ.1.10 కోటి అయ్యింది. అందుకే టికెట్ల ధరలు పెంచాం’ అంటూ సమాధానం ఇచ్చారు. టెండర్లు ఎప్పుడు ఖరారయ్యాని ప్రశ్నించడంతో భక్తులతో వాగ్వాదానికి దిగారు. ప్రతీ ఒక్కరూ. 1000 సమర్పించాలి.. భక్తులు కానుకల పేరిట కూడా దోపిడీకి గురవుతున్నారు. కందూరు సమర్పించడానికి భక్తులు క్యూలో నిలబడాలి. నిర్వాహకులు ఈ క్యూలైన్ల వద్ద హుండీలు ఏర్పాటు చేశా రు. అక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నిల్చుని కానుకలు చదివించాలని భక్తులపై ఒత్తిడి తెస్తుంటారు. ఇలా యాకూబ్, గౌస్‌పాక్, మహాబూబియా, గుంషావళీ, బోలేషావళి, చెరువుతూముల వద్ద హుండీల పేరిట ఒక్కో కందూరుకు రూ.100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఒక్క వ్యక్తి కందూరు చెల్లించాలంటే రూ.1000 అవుతున్నారుు. కందూరు డబ్బులు చెల్లించకుంటే భక్తుల నుంచి పళ్లెలు, గిన్నెలు లాగేసుకుంటున్నారు. వీరి బాధ భరించలేక భక్తులు ప్రతీ చోట రూ.100 ముట్టజెబుతున్నారు. దర్గాలో సెక్యూరిటీ, టికెట్ కౌంటర్, ఆఫీసు నిర్వహణ పనులు నిర్వహించే సిబ్బంది తమకు కేటాయించిన పనులు పక్కన పెట్టి హుండీ కౌంటర్ల వద్దే ఉంటున్నారు. అక్రమ వసూళ్లు నిలిపేయాలి.. దర్గాలో అక్రమ వసూళ్లు నిలిపేయాలి. హుండీల వద్ద ఎవ్వరు ఉండకూడదు. ఇక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. - కుమారస్వామి, స్టేషన్‌ఘన్‌పూర్ దర్గా అభివృద్ధికే.. హుండీల ద్వారా వచ్చిన ఆదాయం దర్గా అభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో హుండీల వద్ద సిబ్బంది ఉండి భక్తులను ప్రేరేపిస్తున్నారు. బలవంతంగా వసూలు చేయడం లేదు. - ముంతాజ్, వక్ఫ్‌బోర్డు సూపరింటెండెంట్ -
రైల్వే పోలీసులు.. దొంగ వేషాలు!
కథ, స్క్రీన్‌ప్లే, డెరైక్టర్ : రైల్వే డీఎస్పీ రైటర్ హీరో : ఐడీ పార్టీ కానిస్టేబుల్ సైడ్ హీరో : డీఎస్పీ జీపు డ్రైవర్ సహనటులు : హోంగార్డు, డీఎస్పీ రైటర్ నైట్ పెట్రోలింగ్‌తో ‘ప్రత్యేక’ పహారా ట్రైసిటీస్ పరిధిలో అక్రమ వసూళ్లు వారు పోలీసులే.. కాకపోతే రైల్వే పోలీసులు. పెట్రోలింగ్ చేసే అర్హత లేదు.. అయితేనేం పోలీస్ జీపు ఉంది కదా అనుకున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేసి దండుకోవచ్చని పథకం పన్నారు. అనుకున్నదే తడవుగా ట్రైసిటీస్‌లో వసూళ్ల దందాకు శ్రీకారం చుట్టారు. ఓ యువకుడి ఫిర్యాదుతో వారి బండారం బయటపడింది. రైల్వే పోలీసుల ‘స్పెషల్ పహారా’పై పోలీస్ యంత్రాంగం అవాక్కైంది. కానీ.. విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని అధికారులు భావించారో.. ఏమో.. దొంగ పోలీస్ టీంను కటకటాల్లోకి నెట్టేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాజీ పేరిట సదరు రైల్వే పోలీసుల ‘స్పెషల్ పార్టీ టీం’ను కాపాడేందుకు యత్నిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. - వరంగల్ క్రైం వరంగల్ క్రైం : అర్ధరాత్రి పోలీస్ పెట్రోలింగ్ జీబును చూస్తే... ఎవరికైనా సరే భయం వేయక మానదు.. తప్పులు చేసిన వారైతే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత దక్షిణ సమర్పించేందుకు వెనుకాడరు. ఇదే ఆ రైల్వే పోలీసులకు ‘కీ’ పారుుంట్ అరుుంది. నైట్ పెట్రోలింగ్ పేరిట రైల్వే డీఎస్పీ జీబులో చక్కర్లు కొడుతూ దందాకు శ్రీకారం చుట్టారు. ‘స్పెషల్ పార్టీ టీమ్’ గా చెప్పుకుంటూ అమాయక ప్రజల వద్ద అందినకాడికి దండుకున్నారు. ఈ బాగోతంలో మొత్తం నలుగురు ఉన్నారు. ఇందులో ఒకరు రైల్వే డీఎస్పీకి చెందిన ఐడీ పార్టీ కానిస్టేబుల్. ఇతను పదేళ్లుగా ఇక్కడే పనిచేస్తూ... ఇటీవలే బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఇక్కడే తిష్టవేశాడు. మరొకరు డీఎస్పీ వాహన డ్రైవర్... ఇంకొకరు హోంగార్డు కాగా... నాలుగో వ్యక్తి డీఎస్పీ రైటర్‌గా చెలామని అవుతున్న ఉద్యోగి. ఈ రైటర్ ఆలోచన మేరకే డమ్మీ స్పెషల్ పోలీస్ టీమ్ తయారైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇతడిపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నారుు. ఈ టీంలో ఉన్న రైల్వే ఉద్యోగులు అందరూ దశాబ్ద కాలంగా ఇక్కడే తిష్టవేసి ఉన్నారు. ఇలా రంగంలోకి... రైల్వే డీఎస్పీగా కొద్ది కాలంగా చెలామణి అవుతున్న వారందరూ నాన్ లోకల్లోనే ఉంటున్నారు. ఇదే అదనుగా డీఎస్పీ జీబు డ్రైవర్‌తో రైటర కుమ్మక్కై పథకం రచించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేపట్టాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు. పెట్రోలింగ్ సమయంలో జీబు డ్రైవర్‌గా హోం గార్డు... పోలీస్ అధికారులుగా హైట్, వెయిట్‌తో ఆఫీసర్లా కనపడే ఐడీ పార్టీ కానిస్టేబుల్, డీఎస్పీ అసలు జీబు డ్రైవర్‌గా వ్యవహరించారు.రైటర్ జీబులోనే కూర్చుని పరిస్థితిని సమీక్షించారు. వీరందరూ రాత్రి 10 గంటల తర్వాత డీఎస్పీ జీబులో బయలుదేరి కాజీపేట పరిసర ప్రాంతాలు మడికొండ, రాంపూర్, కాజీపేట, హన్మకొండలో తిరిగి దొరికిన వారి వద్ద దండుకున్నారు. గిరాకీ దొరకకుంటే వరంగల్ ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా వెళ్లారు. అనుమానంగా కనిపించిన వారిని, రాత్రి వేళల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని, ప్రేమికులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు వ్యాపారులను టార్గెట్ చేసుకుని రాత్రంతా వేట సాగించేవారు. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే ‘స్పెషల్ పార్టీ పోలీస్’ పేరును వాడుకున్నట్లు తెలిసింది. ఈ తతంతం కొద్ది కాలంగా కొనసాగుతూనే ఉంది. ఇందులో ఇద్దరు ఉద్యోగులు ఇటీవల బదిలీపై కొన్ని నెలలు వెళ్లడంతో వీరి దందాకు ఫుల్స్టాప్ పడింది. కొంతకాలం తర్వాత అందరు మళ్లీ ఇక్కడే జమ కాగా.. దందా కొనసాగించారు. బండారం బయటపడిందిలా.... రైల్వే పోలీసుల దొంగ దందాపై రైల్వే పార్టీ పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. మరీ ఇంత నీచానికి దిగజారి ప్రవర్తిస్తున్నారని మాత్రం గ్రహించలేకపోయారు. ఈ క్రమంలో ఈ దొంగ స్పెషల్ పార్టీ బృందం గత ఏడాది డిసెంబర్ 21న పెట్రోలింగ్ చేస్తూ హన్మకొండకు చేరుకుంది. హౌసింగ్‌బోర్డులో కొందరు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. పోలీస్ జీబు రాగానే పరుగులంకించినప్పటికీ ఒక యువకుడు వీరికి చిక్కాడు. వెంటనే అతడిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. జేబులో ఉన్న డబ్బులు, పర్సును, ఏటీఎం కార్డులను తీసుకున్నారు. వాటితో తృప్తి పడకుండా సదరు యువకుడి ఇంటికి వెళ్లి నానా హం గామా చేశారు. సదరు వ్యక్తులను అనుమానించిన యువకుడు తెల్లారి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎస్సై దొంగ పోలీసుల వ్యవహరాన్ని బహిర్గతం చేశారు. పోలీస్ వేషంలో వచ్చిన వారిని గుర్తించి వారిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. చివరకు రైల్వే శాఖకు చెందిన వారు ఇలాంటి వ్యవహారం నడిపిస్తున్నారని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నిందితులను కటకటాల్లోకి నెట్టాల్సి ఉంది. అయితే సుబేదారి పోలీసులను రైల్వే పోలీసులు బతిమిలాడి సదరు యువకుడితో రాజీ చేసుకుంటామని చెప్పారు. సరే చూడండి.. అనడంతో పెద్ద మొత్తంలో సదరు యువకుడికి డబ్బులు ముట్టజెప్పి రాజీ కుదుర్చుకుని విష యం బయటకు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. ఆది నుంచి వీరి వ్యవహార శైలిపై కన్నేసిన ఈ శాఖలోని వారే జరి గిన విషయంపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో వాకబు చేశారు. జరిగిన వాస్తవం తెలుసుకుని విస్మయం చెందారు. సుబేదారి పోలీసులు ఈ విషయూన్ని కప్పిపుచ్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. -
అక్రమార్కులకు లైన్ క్లియర్!
శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు అక్రమ వసూళ్లకు ‘టోకెన్ల’ పద్ధతి అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి శంషాబాద్ మీదుగా రాకపోకలు సాగించే భారీ వాహనాలకు టోకెన్లు జారీ చేసి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శంషాబాద్ మండల కేంద్రంలోని హోటళ్లు, చిరు వ్యాపారుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో నెలకు సుమారు రూ.6 లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న తెలుస్తోంది. బెంగళూరు జాతీయ రహదారి, ఔటర్ రింగు రోడ్డుపై విజయవాడ, వరంగల్, మెదక్, ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు శంషాబాద్ మీదుగా సరుకు లారీలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. లారీలో అక్రమంగా సరకులు తరలించే వారు, ఓవర్ లోడ్ తీసుకెళ్లే వాహనదారులు, అనుమతి పత్రాలు సరిగా లేని లారీల యజమానులు ట్రాఫిక్ పోలీసులకు మామూళ్లు చెల్లించాల్సిందే. గగన్‌పహాడ్ నుంచి పాల్మాకుల వరకు, ఔటర్ రింగు రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు రోజూ వాహనాల తనిఖీ చేపడుతుంటారు. ఈ సమయంలో నిబంధనలను అతిక్రమించి వెళ్తున్న లారీలకు జరిమానా విధించాలి. టోకెన్లతో జరిమానా మాఫీ.. జరిమానా విధిస్తే తమకేం లాభం అనుకున్న ట్రాఫిక్ పోలీసులు లారీలకు ప్రత్యేకంగా టోకెన్లను జారీ చేస్తున్నారు. ఒక్కో లారీకి రూ.3000 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా నెలకు వంద లారీల నుంచి కనీసం రూ.3 లక్షల వరకు అక్రమంగా ఆర్జీస్తూ జేబులు నింపుకొంటున్నట్లు సమాచారం. ఓ తెల్లకాగితంపై స్టాంపు వేసి, ఈ వసూళ్ల బాగోతం చూసుకునే ట్రాఫిక్ కానిస్టేబుల్ సెల్ నంబరు, పేరును రాసి లారీ యజమానులకు ఇస్తారు. ఈ టోకెన్‌ను లారీ డ్రైవర్ ఎప్పుడూ తన వెంట పెట్టుకోవాలి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీలు చేస్తే ఈ టోకెన్ చూపిస్తే చాలు.. అక్కడి నుంచి లారీ వెళ్లడానికి అనుమతి దొరుకుతుంది. వసూళ్ల కోసం ప్రత్యేక సిబ్బంది.. అక్రమ వసూళ్లు చేయడానికి ట్రాఫిక్ విభాగంలో ముగ్గురు ప్రత్యేక సిబ్బంది ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్ స్థాయి సిబ్బందిని రోజూ వారీ విధులకు వినియోగించకుండా ఉన్నతాధికారులు ఈ అక్రమ వసూళ్లకు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి తరచూ డ్యూటీ ప్రాంతాలను మారుస్తుంటారు. కానీ అక్రమ వసూళ్లు చూసుకునే సిబ్బందికి ఎప్పుడూ ఒకే చోట డ్యూటీ వేస్తున్నారని ఆరోపణలున్నాయి. పోనీ... అక్కడైనా అతను విధులు నిర్వహిస్తాడనుకుంటే పొరపాటే. పేరుకు అతను డ్యూటీలో ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తూ వసూళ్లకు పంపుతుంటారని తెలుస్తోంది. ఈ అక్రమ వసూళ్ల బాగోతం చూసుకునే మరో సిబ్బంది స్టేషన్లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ట్రాఫిక్ విభాగంలో రైటర్లకు పెద్దగా పని ఉండదు. అయినా ఇక్కడ ఇద్దరు రైటర్లను నియమించి, అందులో ఒకరిని వసూళ్లకు పంపుతున్నట్లు వినికిడి. అబ్బే అదేం లేదే.. లారీల యజమానుల వద్ద అక్రమ వసూళ్ల కోసం టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.నవీన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. అబ్బే అలాంటిదేమీ లేదే.. మా వద్ద అలాంటివేవీ జరగడంలే దన్నారు.