రైల్వే పోలీసులు.. దొంగ వేషాలు! | Railway police the thief Characters | Sakshi
Sakshi News home page

రైల్వే పోలీసులు.. దొంగ వేషాలు!

Published Sun, Jan 4 2015 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

రైల్వే పోలీసులు..    దొంగ వేషాలు!

రైల్వే పోలీసులు.. దొంగ వేషాలు!

కథ, స్క్రీన్‌ప్లే, డెరైక్టర్ : రైల్వే డీఎస్పీ రైటర్
హీరో : ఐడీ పార్టీ కానిస్టేబుల్
సైడ్ హీరో : డీఎస్పీ జీపు డ్రైవర్
సహనటులు : హోంగార్డు, డీఎస్పీ రైటర్

 
నైట్ పెట్రోలింగ్‌తో ‘ప్రత్యేక’ పహారా  ట్రైసిటీస్ పరిధిలో అక్రమ వసూళ్లు
 
వారు పోలీసులే.. కాకపోతే రైల్వే పోలీసులు. పెట్రోలింగ్ చేసే అర్హత లేదు.. అయితేనేం పోలీస్ జీపు ఉంది కదా అనుకున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేసి దండుకోవచ్చని పథకం పన్నారు. అనుకున్నదే తడవుగా ట్రైసిటీస్‌లో వసూళ్ల దందాకు శ్రీకారం చుట్టారు. ఓ యువకుడి ఫిర్యాదుతో వారి బండారం బయటపడింది. రైల్వే పోలీసుల ‘స్పెషల్ పహారా’పై పోలీస్ యంత్రాంగం అవాక్కైంది. కానీ.. విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని అధికారులు భావించారో.. ఏమో.. దొంగ పోలీస్ టీంను కటకటాల్లోకి నెట్టేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాజీ పేరిట సదరు రైల్వే పోలీసుల ‘స్పెషల్ పార్టీ టీం’ను కాపాడేందుకు యత్నిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. - వరంగల్ క్రైం
 
వరంగల్ క్రైం : అర్ధరాత్రి పోలీస్ పెట్రోలింగ్ జీబును చూస్తే... ఎవరికైనా సరే భయం వేయక మానదు.. తప్పులు చేసిన వారైతే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత దక్షిణ సమర్పించేందుకు వెనుకాడరు. ఇదే ఆ రైల్వే పోలీసులకు ‘కీ’ పారుుంట్ అరుుంది. నైట్ పెట్రోలింగ్ పేరిట రైల్వే డీఎస్పీ జీబులో చక్కర్లు కొడుతూ దందాకు శ్రీకారం చుట్టారు. ‘స్పెషల్ పార్టీ టీమ్’ గా చెప్పుకుంటూ అమాయక ప్రజల వద్ద అందినకాడికి దండుకున్నారు. ఈ బాగోతంలో మొత్తం నలుగురు ఉన్నారు. ఇందులో ఒకరు రైల్వే డీఎస్పీకి చెందిన ఐడీ పార్టీ కానిస్టేబుల్. ఇతను పదేళ్లుగా ఇక్కడే పనిచేస్తూ... ఇటీవలే బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఇక్కడే తిష్టవేశాడు. మరొకరు డీఎస్పీ వాహన డ్రైవర్... ఇంకొకరు హోంగార్డు కాగా... నాలుగో వ్యక్తి డీఎస్పీ రైటర్‌గా చెలామని అవుతున్న ఉద్యోగి. ఈ రైటర్ ఆలోచన మేరకే డమ్మీ స్పెషల్ పోలీస్ టీమ్ తయారైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇతడిపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నారుు. ఈ టీంలో ఉన్న రైల్వే ఉద్యోగులు అందరూ దశాబ్ద కాలంగా ఇక్కడే తిష్టవేసి ఉన్నారు.
 
ఇలా రంగంలోకి...
 
రైల్వే డీఎస్పీగా కొద్ది కాలంగా చెలామణి అవుతున్న వారందరూ నాన్ లోకల్‌లోనే ఉంటున్నారు. ఇదే అదనుగా డీఎస్పీ జీబు డ్రైవర్‌తో రైటర కుమ్మక్కై పథకం రచించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేపట్టాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు. పెట్రోలింగ్ సమయంలో జీబు డ్రైవర్‌గా  హోం గార్డు... పోలీస్ అధికారులుగా హైట్, వెయిట్‌తో ఆఫీసర్‌లా కనపడే ఐడీ పార్టీ కానిస్టేబుల్,  డీఎస్పీ అసలు జీబు డ్రైవర్‌గా వ్యవహరించారు.రైటర్ జీబులోనే కూర్చుని పరిస్థితిని సమీక్షించారు. వీరందరూ రాత్రి 10 గంటల తర్వాత  డీఎస్పీ జీబులో బయలుదేరి కాజీపేట పరిసర ప్రాంతాలు  మడికొండ, రాంపూర్, కాజీపేట, హన్మకొండలో తిరిగి దొరికిన వారి వద్ద దండుకున్నారు. గిరాకీ దొరకకుంటే వరంగల్ ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా వెళ్లారు. అనుమానంగా కనిపించిన వారిని, రాత్రి వేళల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని, ప్రేమికులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు వ్యాపారులను టార్గెట్ చేసుకుని రాత్రంతా వేట సాగించేవారు. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే ‘స్పెషల్ పార్టీ పోలీస్’ పేరును వాడుకున్నట్లు తెలిసింది. ఈ తతంతం కొద్ది కాలంగా  కొనసాగుతూనే ఉంది. ఇందులో ఇద్దరు ఉద్యోగులు ఇటీవల బదిలీపై కొన్ని నెలలు వెళ్లడంతో వీరి దందాకు ఫుల్‌స్టాప్ పడింది. కొంతకాలం తర్వాత అందరు మళ్లీ ఇక్కడే జమ కాగా.. దందా కొనసాగించారు.
 
బండారం బయటపడిందిలా....

 
రైల్వే పోలీసుల దొంగ దందాపై రైల్వే పార్టీ పోలీసులు ఓ కన్నేసి ఉంచారు.  మరీ ఇంత నీచానికి దిగజారి ప్రవర్తిస్తున్నారని మాత్రం గ్రహించలేకపోయారు. ఈ క్రమంలో ఈ దొంగ స్పెషల్ పార్టీ బృందం గత ఏడాది డిసెంబర్ 21న పెట్రోలింగ్ చేస్తూ హన్మకొండకు చేరుకుంది. హౌసింగ్‌బోర్డులో కొందరు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. పోలీస్ జీబు రాగానే పరుగులంకించినప్పటికీ ఒక యువకుడు వీరికి చిక్కాడు. వెంటనే అతడిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. జేబులో ఉన్న డబ్బులు, పర్సును, ఏటీఎం కార్డులను తీసుకున్నారు. వాటితో తృప్తి పడకుండా సదరు యువకుడి ఇంటికి వెళ్లి నానా హం గామా చేశారు. సదరు వ్యక్తులను అనుమానించిన యువకుడు తెల్లారి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన  ఎస్సై దొంగ పోలీసుల వ్యవహరాన్ని బహిర్గతం చేశారు. పోలీస్ వేషంలో వచ్చిన వారిని గుర్తించి వారిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. చివరకు రైల్వే శాఖకు చెందిన వారు ఇలాంటి వ్యవహారం నడిపిస్తున్నారని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నిందితులను కటకటాల్లోకి నెట్టాల్సి ఉంది.  అయితే సుబేదారి పోలీసులను  రైల్వే పోలీసులు బతిమిలాడి సదరు యువకుడితో రాజీ చేసుకుంటామని చెప్పారు. సరే చూడండి.. అనడంతో పెద్ద మొత్తంలో సదరు యువకుడికి డబ్బులు ముట్టజెప్పి రాజీ కుదుర్చుకుని విష యం బయటకు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. ఆది నుంచి వీరి వ్యవహార శైలిపై  కన్నేసిన ఈ శాఖలోని వారే జరి గిన విషయంపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో వాకబు చేశారు. జరిగిన వాస్తవం తెలుసుకుని విస్మయం చెందారు. సుబేదారి పోలీసులు ఈ విషయూన్ని కప్పిపుచ్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement