ఏటీఎంలో చోరీకి యత్నం
మానకొండూరు(కరీంనగర్ జిల్లా): మానకొండూరు మండలకేంద్రంలోని మీ-సేవా కేంద్రం వద్ద ఉన్న ఓ ఏటీఎంలోకి చొరబడ్డ దొంగను మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. మండలకేంద్రంలోని మీ-సేవా కేంద్రం వద్ద గతేడాది ఇండిక్యాష్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. కాగా మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో సామాన్య ప్రజల మాదిరిగానే రంజిత్ అనే వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లాడు. ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లి షట్టరును మూసేయడంతో అక్కడే ఉన్నవారికి అనుమానం కలిగి బయట రావాలని, ఎవరు నీవు అంటూ ప్రశ్నించారు.
కాసేపటికి ఏటీఎం నుంచి బయటికి వచ్చిన అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రంజిత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఓ స్కూడ్రైవర్ దొరికిందని, సంబంధిత ఏటీఎం నిర్వాహకులకు సమాచారం అందించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.