♦ రెండు పడకగదుల ఇళ్ల దరఖాస్తులో అయోమయం
♦ మీసేవ కేంద్రాలకు స్వీకరణ బాధ్యతలు అప్పగింత
♦ ఆన్‌లైన్‌లో నమోదుతో పాటు నమూనా దరఖాస్తును కలెక్టరేట్‌లో ఇవ్వాలని కొర్రీ
♦ వృథా పని.. చార్జీల భారమంటూ నిర్వాహకుల గగ్గోలు
♦ రెండు పడకగదుల ఇళ్ల దరఖాస్తులో అయోమయం
♦ మీసేవ కేంద్రాలకు స్వీకరణ బాధ్యతలు అప్పగింత
♦ నమూనా దరఖాస్తును కలెక్టరేట్‌లో ఇవ్వాలని కొర్రీ
♦ వృథా పని.. చార్జీల భారమంటూ నిర్వాహకుల గగ్గోలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘డబుల్’ బెడ్‌రూం ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మీసేవ నిర్వాహకులను ఇబ్బందుల్లో పడేసింది. గత నెలాఖరు వరకు ఈ దరఖాస్తులను కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి స్వీకరించిన యంత్రాంగం.. గత సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ బాధ్యతల్ని మీసేవ కేంద్రాలకు అప్పగించింది. రూ.25 చెల్లించి సమీపంలోని మీసేవ కేంద్రంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అర్జీదారులకు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే ఆన్‌లైన్ పద్ధతిలో వివరాల నమోదు అనంతరం అర్జీదారులు ఇచ్చిన నమూనా దరఖాస్తులను ప్రతి మంగళవారం కలెక్టరేట్‌లో సమర్పించాలని జిల్లా యంత్రాంగం కొర్రీ పెట్టింది. ఇది మారుమూల ప్రాంతాల్లో ఉన్న మీసేవ నిర్వాహకులకు ఇబ్బందుతు తెచ్చిపెడుతోంది.
‘డబుల్’ వర్క్..
జిల్లాలో 620 పౌర సేవా కేంద్రాలున్నాయి. ఇందులో ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలు 161, మీసేవ కేంద్రాలు 140, ఈసేవ కేంద్రాలు 316 ఉన్నాయి. ఇవికాకుండా మరో మూడు కేంద్రాలు పౌరసేవలందిస్తున్నాయి. తాజాగా మీసేవ కేంద్రాలకు డబుల్ బెడ్‌రూం దరఖాస్తుల స్వీకరణ బాధ్యతల్ని జిల్లా యంత్రాంగం అప్పగించింది.
అర్జీదారులు ముందుగా రూ.25 చెల్లించి దరఖాస్తు నమూనాను పూరించి మీసేవ కేంద్ర నిర్వాహకుడికి ఇవ్వాలి. అనంతరం వివరాల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత సదరు నమూనా దరఖాస్తును జిల్లా కలెక్టరేట్‌లో సమర్పించాలి. అయితే ఆన్‌లైన్ ద్వారా వివరాల్ని నమోదు చేసినప్పటికీ.. నమూనా దరఖాస్తును కలెక్టరేట్‌లో సమర్పించాలని యంత్రాంగం ఆదేశించడం డబుల్ పని చేసినట్లవుతుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చార్జీల భారం తడిసి మోపెడు..
మీసేవ కేంద్రాల్లో రూ.25 చెల్లించి దరఖాస్తును సమర్పించాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. కానీ ఈ మొత్తం నుంచి కేవలం రూ.6 మాత్రమే నిర్వాహకుడి ఖాతాకు చేరుతుంది. మిగతా మొత్తం జిల్లా ఖజానాలో జమవుతుంది. అయితే వారానికి సగటున వంద దరఖాస్తు చేసినప్పటికీ.. వాటిని కలెక్టరేట్‌లో సమర్పించడానికి మీసేవ నిర్వాహకుడికి రూ.వెయ్యికి పైగా ఖర్చవుతుందని పరిగి, వికారాబాద్‌లకు చెందిన పలువురు నిర్వాహకులు ‘సాక్షి’తో వాపోయారు. నగర శివారు ప్రాంతాల్లోని నిర్వాహకులకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. గ్రామీణ ప్రాంతంలోని నిర్వాహకులకు మాత్రం ఇది తలకుమించిన భారమవుతోంది.