
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం చివరలో ప్రారంభించిన గృహలక్ష్మి పథకం కోసం సేకరించిన 15 లక్షల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తోంది.
మంజూరు చేసే వేళ ముంచుకొచ్చిన ఎన్నికలు
గత ప్రభుత్వం తొలుత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ యూనిట్ కాస్ట్‌తో, దేశంలో ఎక్కడా లేనట్టుగా ఉచితంగా రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. కానీ వాటి యూనిట్ కాస్ట్ సరిపోవటం లేదంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం, సాంకేతికంగా కొన్ని లోపాలు చూపి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులు నిలిపేయటం, కొన్ని అంతర్గత లోపాలు.. వెరసి ఆ పథకం అంత వేగంగా ముందుకు సాగలేదు. దీంతో ఏడాది క్రితం.. దాని స్థానంలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది.
సొంత జాగా ఉండి ఇల్లు లేని పేదలకు రూ.3 లక్షలను అందించి వారే ఇళ్లను నిర్మించుకునేలా దీన్ని రూపొందించారు. ఇంచుమించు ఇందిరమ్మ పథకం తరహాలోనే డిజైన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని దరఖాస్తులు ఆహ్వానించింది. 15 లక్షల దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వాటిల్లో 12 లక్షలు అర్హమైనవిగా గుర్తించారు. వాటిల్లో నుంచి 4 లక్షల దరఖాస్తులు ఎంపిక చేసే వేళ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. చివరి తేదీ రాత్రి వరకు దాదాపు2 లక్షల దరఖాస్తులకు సంబంధించి జాబితాను సిద్ధం చేశారు.
వారికి నిధులు ఇచ్చేందుకు వీలుగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి కూడా వచ్చింది. కానీ, అప్పటికే ప్రచారం తారస్థాయికి చేరుకోవటంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ దరఖాస్తులను రిజెక్టు చేస్తుందేమోనన్న భయంతో కొందరు దరఖాస్తుదారులు కూడా అధికారులపై ఒత్తిడి చేయకుండా ఎన్నికలయ్యే వరకు వేచిచూసే ధోరణి అవలంబించాలని నిర్ణయించారు. వారు అనుకున్నట్టే ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం తమ దరఖాస్తులను పరిశీలిస్తుందని వారు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఆ దరఖాస్తులను పరిశీలించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామ సభల్లో కొత్త దరఖాస్తులు..
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాత ప్రభుత్వం సేకరించిన దరఖాస్తులను పక్కన పెట్టి కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది.
ఇటీవల హైకోర్టులో గిరిజనప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ అంశంపై ఓ కేసు విచారణకు వచ్చింది. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా జరగాల్సి ఉంటుంది. గిరిజనులకు దక్కాల్సిన లబ్ధి గిరిజనేతరులు తన్నుకుపోతున్నారన్న ఉద్దేశంతో వారికి రక్షణగా ఈ నిబంధన ఏర్పాటు చేశారు.
గృహలక్ష్మి పథకంలో దరఖాస్తుల స్వీకరణలో ఈ నిబంధనల పాటించలేదన్నదని ఫిర్యాదు. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ జరిగిందన్న వాదనను ఇప్పుడు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సరిగ్గా ఎన్నికల వేళ దరఖాస్తుల పరిశీలన జరిగిన నేపథ్యంలో మొత్తంగా ఆ దరఖాస్తులను పక్కనపెట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.