- టన్ను ధర రూ.375 గా ఖరారు
- అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ కేసు
- ఇసుక డోర్ డెలివరీకి ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ర్ట ప్రభుత్వం ఇసుక అమ్మకానికి కరీంనగర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టింది. కరీంనగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఖాజీపూర్‌లో గురువారం ఇసుక విక్రయకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇసుక కావాలనుకునేవారు తొలుత ఏపీ ఆన్‌లైన్ లేదా మీ సేవా కేంద్రాల్లో టన్ను ఇసుక ధర రూ.375 చెల్లించాలి. వెంటనే ఆయా కేంద్రాలు జారీ చేసే చలాన్లను తీసుకుని ఖాజీపూర్ వెళితే ఇసుకను లోడ్ చేస్తారు. వాహనాలను సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు తదితర అధికారులు ఇసుకు విధానం, అమ్మకాల వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్‌తో పోలిస్తే తక్కువే !
రాష్ట్రవ్యాప్తంగా 20 ఇసుక రీచ్‌లను గుర్తించగా, కరీంనగర్ జిల్లాలో దిగువ మానేరు వద్ద 2, మధ్య మానేరు నది వద్ద ఒక రీచ్‌ను గుర్తించినట్లు లోకేష్ కుమార్ చెప్పారు. ఇసుక నాణ్యతను బట్టి ధర కనిష్టంగా రూ.400, గరిష్టంగా రూ.600గా నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ.375లుగా నిర్ణయించామన్నారు. రాత్రిపూట ఇసుక రవాణాకు అనుమతి లేదని, ఇకపై అక్రమ రవాణా చేస్తే ఆ వాహనాలను వేలం వేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. 21 టన్నులలోపు వాహనాల్లో ఇసుకను తీసుకెళ్లవచ్చని, అంతకుమించి రవాణ చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ అంశంపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశామని, ఇకపై అక్రమ రవాణను కమిటీలు పర్యవేక్షిస్తాయన్నారు.
ప్రభుత్వం విక్రయించే ఇసుక ధర బ్లాక్‌మార్కెట్‌తో సమానంగా ఉందనే వాదనపై స్పందిస్తూ ‘హైదరాబాద్‌లో జరుగుతున్న ఇసుక అమ్మకాలతో పోలిస్తే చాలా తక్కువే. పైగా అది అక్రమ వ్యాపారం. దానివల్ల కొందరు వ్యక్తులే లాభపడతారు. కానీ తాము ఇసుకను విక్రయించి, ధరలో 50 శాతం రాయల్టీని ప్రభుత్వానికి చెల్లిస్తాం. అట్లాగే సీనరేజీ, సేల్స్ ట్యాక్స్, వ్యాట్ పన్నులతోపాటు జిల్లా, స్థానిక సంస్థలకు తప్పనిసరిగా డబ్బులు చెల్లిస్తాం. దీనివల్ల గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది’’అని వివరిం చారు. రూ. 40 చొప్పున సీనరేజి చార్జీలను చెల్లించి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చని కలెక్టర్ చెప్పారు.