విజయనగర్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి సురేష్ వనస్థలిపురంలో స్థలం కొనాలని భావించాడు. ముందుగా సదరు స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సర్వే నంబర్ తీసుకుని స్థానిక మీ–సేవ కేంద్రంలో ఈసీ కోసం దరఖాస్తు చేశాడు. అందుకు విధించిన నిర్ణీత గడువు తర్వాత కేంద్రానికి వెళ్లగా.. డిపార్ట్‌మెంట్ ఆమోద ముద్ర పడలేదని, మరుసటి రోజు రావాలని అటునుంచి సమాధానం వచ్చింది. మరుసటి రోజు వెళ్లగా అదే సమాధానం పునరావృతమైంది. సురేష్ లాంటి వారికి ఇకపై ఈసీ సీసీ ఇబ్బందులు తొలగించాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూములకు సంబంధించిన ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్)లు, సీసీ (సర్టిఫైడ్ కాపీ)లు తిరిగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా జారీ చేసే విధంగా చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసుకున్న రోజే వీటిని జారీకి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించింది. మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా సరే.. అదే రోజు ఆమోదించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. దీనిద్వారా సర్వర్ డౌన్ వంటి సమస్యలతో ఈసీ, సీసీల జారీ జాప్యానికి పూర్తిగా తెరపడనుంది.
సాక్షి, సిటీబ్యూరో: భూముల కొనుగోలు దారులు ఎదుర్కొనే అతపెద్ద సమస్య అయిన ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్)లు, సీసీ (సర్టిఫైడ్ కాపీ)లు పొందడం. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల నుంచి పొందే ఈ సర్టిఫికెట్లను ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను జారీ చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. సరిగ్గా ఐదేళ్లక్రితం స్థిరాస్తుల సీసీలు, ఈసీలు జారీ బాధ్యతను ప్రభుత్వం మీ–సేవ కేంద్రాలకు మాత్రమే అప్పగించింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు సీసీ, ఈసీల జారీ బాధ్యత నుంచి తప్పుకున్నాయి. ఇన్నేళ్లు ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి ఆమోదిస్తూ వచ్చాయి. మీ–సేవ కేంద్రాల సర్వర్ సాంకేతిక సమస్యలకు తోడు ఈసీ, సీసీల ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆమోద ముద్ర వేయడంలో రిజిస్ట్రేషన్ శాఖ నిర్లక్ష్యం సదరు సర్టిఫికెట్ల జారీ మరింత ఇబ్బందిగా మారింది. దీంతో నగరంలో స్థిరాస్తి కొనుగోలు, అమ్మకందారులకు సీసీ, ఈసీ ఇబ్బందులు తప్పడం లేదు. స్థలానికి సంబంధించిన పుట్టుపుర్వోత్తరాలు తెలుసుకోనడం కష్టంగా మారింది.
రిజిస్ట్రేషన్ శాఖ ఆన్‌లైన్ సేవలు..
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ముందుకు వచ్చింది. అన్ని సేవలను కంప్యూటరీకరణ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో 1983 నుంచి ఈసీలు, సీసీలు కంప్యూటరీకరించి మీసేవ ద్వారా జారీ చేస్తూ వస్తోంది. కంప్యూటరీకరణ కానివి మాత్రమే సదరు రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి అందిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సైతం ఈసీ, సీసీలు ఇవ్వడంతో ప్రజలకు ఎక్కడ సౌలభ్యంగా ఉంటే అక్కడ వీటిని తీసుకునేవారు. ఈసీ, సీసీ సేవలను ఒక్క మీ–సేవ కేంద్రాలకు మాత్రమే అప్పగించడంతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈసీలు, దస్తావేజుల నకళ్ల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. మీ సేవా కేంద్రాల్లో దస్తావేజుల జారీకి పెద్ద సమస్య లేకున్నా.. ఈసీ జారీకి మాత్రం పలుచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి. మీ సేవా కేంద్రం నుంచి ఆన్‌లైన్‌లో అభ్యర్థన వెళ్తే దానికి అనుగుణంగా సతబంధిత సబ్ రిజిస్ట్రార్ ఈసీని పంపిస్తారు. అయితే తరచూ సర్వర్ సమస్యలు తలెత్తుతుండడంతో ఈసీ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మీ–సేవ కేంద్రాల సిబ్బందికి ఈసీల జారీ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల అభ్యర్థన దశలోనే తప్పులు దొర్లి దరఖాస్తుదారుడికి అవసరం లేని సమాచారం కూడా ఈసీలో దర్శనమిస్తోంది.
సన్నకారు రైతులకూ బాదుడు..
గ్రేటర్‌లో ఏటా సుమారు మూడు లక్షల వరకు ఈసీలు జారీ అవుతాయి. హైదరాబాద్‌లో 75 వేల వరకు, శివార్లలో 2.25 లక్షల వరకు జారీ అవుతాయన్నది అంచనా. మీ–సేవ కేంద్రాల్లో ఈసీ, సీసీల జారీ కోసం డిమాండ్‌ను బట్టి ఆయా సెంటర్ల నిర్వాహకులు యూజర్ చార్జీలను దండుకుంటూ వచ్చారు. మరోవైపు సన్నకారు రైతుల సహకార సంఘాలకు ఈసీలను ఉచితంగానే మంజూరు చేయాల్సి ఉంటుంది. మీ సేవ కేంద్రాల్లో మాత్రం ఒక్కో ఈసీకి రూ.125 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సన్నాకారు రైతులకు ఉచితంగా ఈసీలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు ఉండగా.. మీ సేవ కేంద్రాల్లో మాత్రం ఆలాంటిదేమిలేదంటూ వసూళ్లు చేపట్టారు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ తిరిగి పాత పద్ధతిలోనే సేవలను అందించాలని ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
ఒక్క రోజులోనే జారీ
స్థిరాస్తులకు సంబందించిన ఈసీలు, సీసీల కోసం ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ–సేవ కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా వీటిని జారీ చేస్తాం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఒక్క రోజులోనే వాటిని పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశాం. ఈ వెసలు బాటును సద్వినియోగం చేసుకోవాలి.
– కె.రఘుబాబు, డీఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ (హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment