Registration office
-
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు!.. ఇదో వృద్ధ దంపతుల గా(వ్య)థ
సంస్థాన్ నారాయణపురం(నల్గొండ): తాము కొంత భూమి అమ్ముకుంటే.. ఆ భూమిని కొనుగోలు చేసిన వారికి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వృద్ధ దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన జక్కడి బాల్రెడ్డికి 40ఎకరాల భూమి ఉంది. తన కుమారుడు జక్కడి శ్రీనివాస్‌రెడ్డికి 36 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయగా ఇంకా బాల్‌రెడ్డి పేరు మీద 4ఎకరాల 10గుంటల భూమి ఉంది. కుమారుడు తమ బాగోగులు పట్టించుకోకపోడవంతో బాల్‌రెడ్డి తన పేరు మీద ఉన్న భూమిని ఇతరులకు విక్రయించాడు. భూమి కొనుగొలుదారు రిజిస్ట్రేషన్ కోసం బుధవారం స్లాట్ బుక్ చేసుకున్నాడు. గురువారం 12గంటలకు రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ అయ్యింది. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయకపోవడంతో బాల్‌రెడ్డి అధికారులను ప్రశ్నించాడు. రిజిస్ట్రేషన్ చేయవద్దని బాల్‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశాడని, దీంతో రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నానని తహసీల్దార్ తెలిపారు. తమ భూమి అమ్ముకుంటే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరంటూ తహసీల్దార్‌తో బాల్‌రెడ్డి వాదించాడు. వృద్ధ దంపతులు సుమారు మూడు గంటలకు పైగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. చివరకు రిజిస్ట్రేషన్ చేయడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ విషయమై తహసీల్దార్ కృష్ణను వివరణ కోరగా.. బాల్రెడ్డికి కుంటుంబ సభ్యులతో మాట్లాడుకోమని కొంత సమయం ఇచ్చామని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రకియ పూర్తిచేసినట్లు తెలిపారు. -
సిద్ధిపేటలో కాల్పుల కలకలం!
సాక్షి, హైదరాబాద్: సిద్ధిపేట జిల్లాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అర్బన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద సోమవారం కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపి సుమారు 42.50 లక్షలు దుండగులు ఎత్తికెళ్లినట్లు సమాచారం. కాల్పుల్లో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
కడప రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలాన్ల స్కాం
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కడప రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలాన్ల స్కాం వెలుగు చూసింది. ముగ్గురు సబ్రిజిస్ట్రార్లు, ఇద్దరు క్లర్క్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. రూ.కోటి 8లక్షలు స్వాహా జరిగినట్లు నిర్థారణ అయింది. -
ఇంటికి ఇంత.. ప్లాటుకు అంత.. అక్కడంతా 'రైటర్ల'రాజ్యం!
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రానికి చెందిన పి.మధుకర్‌రెడ్డి (పేరు మార్చాం) స్థానికంగా ఓ వెంచర్లో 300 గజాల ప్లాటు కొనుగోలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ప్లాటు విలువ రూ.1.20 లక్షలు. దాని రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల రూపంలో రూ.8,800 చెల్లించాడు. అయితే రిజిస్ట్రేషన్ చేయించినందుకు మధ్యవర్తి (డాక్యుమెంట్ రైటర్)కి చెల్లించిన ఫీజు రూ.4,000. ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ కింద కట్టిన ఫీజుకు సగం అదనంగా మధ్యవర్తికి చెల్లించడం గమనార్హం. డాక్యుమెంట్ ప్రిపరేషన్, కార్యాలయంలోని వ్యవహారాన్ని చకచకా పూర్తి చేయించినందుకు ఈ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినా ఎదురయ్యే పరిస్థితి ఇది. ఇండ్లు, ప్లాట్లు, భూముల రిజిస్ట్రేషన్లలో డాక్యు మెంట్ రైటర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతు న్నారు. సొమ్ము ముట్టజెపితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా, ఎలాంటి అవాంతరాల్లేకుండా జరిగిపోతుంది. ఏవైనా పేపర్లు లేకపోవడం, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా.. అరగంటలోనే ‘పని’ పూర్తవుతుంది. కాకపోతే దీనికి మరికొంత ఎక్కువ చేతిలో పెట్టాల్సి వస్తుంది. అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఓ కొర్రీతో రిజిస్ట్రేషన్లు ఆలస్యం కావడమో, ఒక్కోసారి మొత్తంగా ఆగిపోవడమో జరుగుతున్న పరిస్థితి ఉంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని సిబ్బందికీ ఇందులో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణ లున్నాయి. దీనిపై కొనుగోలు/ అమ్మకందారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధన చేపట్టింది. పలు ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద పరిస్థితిని నేరుగా పరిశీలించి.. ఏం జరుగుతోందన్నది గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. రైటర్లదే హవా! ఎక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లినా.. అక్కడికి కొంత దూరంలో అటూఇటూ ఒకట్రెండు టేబుళ్లు, కంప్యూటర్లు పెట్టుకుని, ఐదారు కుర్చీలున్న చిన్న చిన్న షాపులు కనబడతాయి. పొద్దంతా ఏదో హడావుడి కనిపిస్తుంటుంది. చూడటానికి సింపుల్ గానే ఉన్నా ఇండ్లు, ఫ్లాట్లు, భూములు.. ఇలా ఏ రిజిస్ట్రేషన్లు జరగాలన్నా ఆ చిన్న దుకాణాలు, వాటిని నిర్వహించే డాక్యుమెంట్ రైటర్లే కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే.. రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతున్నా 90 శాతం పని ఈ డాక్యుమెంట్ రైటర్ల వద్దే అయిపోతుంది. ముందే అంతా ‘సెట్ రైట్’ అవుతుంది. ఆఫీసులోకి వెళ్లాక అంతా ఫటాఫట్‌గా పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి కొనుగోలు/అమ్మకం దారులు, సాక్షులు మినహా ఇతర ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను అనుమతించకూడదు. కానీ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ సిబ్బంది కంటే.. ఈ ‘మధ్యవర్తుల’ హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. అనధికారికంగానే అంతా.. నిజానికి డాక్యుమెంట్ రైటర్లకు ఎలాంటి లైసెన్సు లేదు. ఆ వ్యవస్థపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ కూడా లేదు. డాక్యుమెంట్ సిద్ధం చేయడం నుంచి, రిజిస్ట్రేషన్ పూర్తయి కాపీ బయటికి వచ్చేదాకా.. మొత్తం పని కొర్రీలు లేకుండా, త్వరగా పూర్తిచేస్తామంటూ ఈ డాక్యుమెంట్ రైటర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రెడీ చేసేందుకు కొంత, ఏ కొర్రీలూ రాకుండా పని అయిపోయేందుకు ఆఫీసులో ఇవ్వాల్సింది ఇంకొంత అంటూ వేలకువేలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సుమారు 2000 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్టు అంచనా. రిజిస్ట్రేషన్ల శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ అనధికార డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థకు స్వస్తి పలికి.. ప్రభుత్వ జవాబుదారీతనం ఉండేలా మరో వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినా.. అది కార్యరూపంలోకి రావడం లేదు. కరోనా తర్వాత మరింత దూకుడు కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ తర్వాతి పరిస్థితుల్లో డాక్యుమెంట్ రైటర్లు వసూళ్లు మరింతగా పెంచారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అప్పట్లో డాక్యుమెంట్‌కు ఇంత అని పక్కాగా డిమాండ్ చేసేవారు కాదని.. అవకాశం, అవసరం, చేయించాల్సిన పనిని బట్టి తీసుకునే వారని అంటున్నారు. ఇప్పుడు పక్కాగా డిమాండ్ చేసి, వసూలు చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగే ఆస్తుల విలువలో ఇంత శాతమని నిర్ణయించి వసూలు చేస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఏదో ఓ కొర్రీ పెడతారని.. రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళితేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా పూర్తవుతోందని.. ఇబ్బందులు తప్పని పరిస్థితి ఉందని ఆరోపణలున్నాయి. ఏవో సాంకేతిక సమస్యలున్నాయని, డాక్యుమెంట్లలో తప్పులున్నాయని చెబుతూ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది తిప్పుకుంటున్నారని అమ్మకం/కొనుగోలు దారులు చెప్తున్నారు. డబ్బులన్నీ తామే తీసుకోవడం లేదని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఇవ్వాల్సి ఉంటుందని కొందరు డాక్యుమెంట్ రైటర్లు బహిరంగంగానే అంటుండటం గమనార్హం. అయితే క్రయవిక్రయదారుల రూపంలో వస్తున్న సామాన్య ప్రజల విషయంలోనే రైటర్లు డాక్యుమెంట్ డీలింగ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్ల నిర్వాహకులు, బడాబాబులు నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల సిబ్బందితోనే ‘మాట్లాడుకుని’ పని చక్కబెట్టుకుంటున్నారని అంటున్నారు. కొత్త విధానం వచ్చినట్టే వచ్చి.. కరోనా తర్వాత రాష్ట్ర సర్కారు తెచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ విధానంలో అసలు డాక్యుమెంట్ రైటర్ల అవసరమే లేకుండా పోయింది. కానీ కొన్ని కారణాలతో ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టింది. దీంతో రైటర్ల దందా మళ్లీ మొదలైంది. గతం కంటే ఎక్కువగా రేటు నిర్దేశించి మరీ తీసుకోవడం పెరిగింది. ఇలా వారు డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకుంటున్నా.. స్థానిక సబ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు వసూళ్లు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందికి వాటా సొమ్ము ఇస్తున్నారని.. దీంతో రైటర్లను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా వందల కోట్లు జేబుల్లోకి.. రైటర్లు డాక్యుమెంట్ తయారు చేస్తామనే కారణం చూపెట్టి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. చూడటానికి ఒక్కో రిజిస్ట్రేషన్‌కు మూడు, నాలుగు వేల రూపాయలేగా అన్నట్టు ఉన్నా.. మొత్తంగా చూస్తే కోట్ల రూపాయల్లోకి వెళుతున్నాయి. ఉదాహరణకు.. ఈనెల 20న (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా 5,500కుపైగా డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. తక్కువలో తక్కువగా డాక్యుమెంట్‌కు రూ.1,000 చొప్పున లెక్కేసుకుంటే.. ఒక్కరోజు రైటర్లు వసూలు చేసింది రూ. 55 లక్షలు. నెలకు 15 కోట్లపైమాటే.. అదే ఏడాదికి లెక్కిస్తే రూ.180 కోట్లు. ఇది కేవలం నామమాత్రపు సొమ్ము మాత్రమే. నిజానికి అడ్డగోలుగా వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ సిబ్బంది వాటా కింద వసూలు చేస్తున్నది కలిపితే.. రూ.వెయ్యి కోట్లకుపైనే అవుతుందని అంచనా. ఏటా ఇంత సొమ్ము దళారుల పాలవుతోంది. ఎక్కడ చూసినా అదే దందా! – రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు పెద్ద ఎత్తున కమీషన్లు్ల వసూలు చేస్తున్నారు. వైటీడీఏ పరిధిలో ఉన్న ప్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్ చార్జ్, చలానా, మ్యూటేషన్ కలిపి రూ.18,800 తీసుకుంటున్నారు. మిగతా ప్లాట్లకు కూడా రూ.15వేల దాకా తీసుకుంటున్నారు. డాక్యుమెంట్ తయారుచేయడం నుంచి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేదాకా తాము చూసుకుంటామని చెప్తున్నారు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ల వద్దకు వెళితే.. ఏదో ఓ కొర్రీ పెడుతున్నారని, అక్కడి సిబ్బంది కూడా రూ.1,500 నుంచి రూ.2 వేలదాకా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. – నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు సగటున 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకునే వ్యక్తుల వద్ద డాక్యుమెంట్ రైటర్లు తమ ఫీజు కింద రూ.1,000, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇచ్చేందుకని మరో వెయ్యి, రెండు వేలదాకా వసూలు చేస్తున్నారు. పని త్వరగా పూర్తవుతుందని చెబుతున్నారు. వివాదాలున్న డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసేందుకైతే.. రూ.5వేల నుంచి రూ.10వేల దాకా తీసుకుని ‘పని’ చక్కబెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. – సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చుపై అదనంగా ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు చెల్లించక తప్పని పరిస్థితి. వారు అడిగినంత ముట్టజెప్పకపోతే ఏదో ఓ లిటిగేషన్ పేరిట రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వివాదాలున్న ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ల కోసమైతే.. పది వేల వరకు ముట్టజెప్పాల్సిందే. ఇదంతా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బందికి వాటా ఇవ్వడం కోసమేనని రైటర్లు చెప్తుండటం గమనార్హం. – రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్లు రూ.2,500 దాకా వసూలు చేస్తున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ సిబ్బందికి సగం వాటా ఇవ్వాలని ఓపెన్‌గానే చెప్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇక్కడ డబ్బుల వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఓ ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకోవడం గమనార్హం. – గిరిజనులు అధికంగా ఉండే మహబూబాబాద్ జిల్లాలో కూడా డాక్యుమెంట్ రైటర్ల దందా సాగుతోంది. ఇక్కడి ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడంతో డాక్యుమెంట్ ప్రిపరేషన్ పేరుతో రూ.3–4 వేల వరకు తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఇవ్వాలంటూ మరికొంత వసూలు చేస్తున్నారు. (చదవండి: వెంట్రుకలపై క్రేజ్: చైనాకు జుట్టు అక్రమ రవాణా) -
‘రేట్లు’ పెంచేశారు.. అంతా వారి ఇష్టారాజ్యమే..!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కె.శ్రీను స్థానికంగా ఓ వెంచర్లో 160 గజాల ఓ ప్లాటు కొనుగోలు చేశాడు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ప్లాటు విలువ రూ.1.20 లక్షలు. ఈ ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల రూపంలో రూ.8,100 చెల్లించాడు. అయితే ఈ ప్లాటు రిజిస్ట్రేషన్ చేయించినందుకు మధ్యవర్తికి చెల్లించిన ఫీజు రూ.6,500. డాక్యుమెంట్ ప్రిపరేషన్‌తో పాటు త్వరగా పని పూర్తి చేయించినందుకు ఈ మొత్తం చెల్లించినట్లు శ్రీను చెబుతున్నాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన సి.రమేశ్ మండల పరిధిలో 150 చదరపు గజాల ఖాళీ స్థలం కొనుగోలు చేశాడు. రెండ్రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కార్యాలయం సమీపంలోని మధ్యవర్తిని సంప్రదించాడు. నిబంధనల ప్రకారం సదరు ప్లాటుకు స్టాంపు డ్యూటీతో పాటు ఇతర ఫీజుల కోసం రూ. 10,200 చెల్లించాడు. డాక్యుమెంట్ ప్రిపరేషన్ తదితర ప్రక్రియల కోసం రూ.5 వేలు మీడియేటర్‌కు చెల్లించడంతో రిజి్రస్టేషన్ కార్యాలయంలో అరగంటలో ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించిన ఫీజులో దాదాపు సగభాగం మీడియేటర్‌కు చెల్లించుకోవాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర (నాన్ అగ్రికల్చర్) ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మధ్యవర్తులు దోచుకుంటున్నారు. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కూడా ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించాలనుకున్నా... ఆధార్, ఇతర సమాచార సేకరణకు హైకోర్టు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజి్రస్టేషన్‌కు పాత విధానాన్నే కొనసాగిస్తోంది. దీంతో గత నాలుగు నెలలుగా నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు జోష్ వచ్చింది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంటున్న మధ్యవర్తులు... ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌పైనా పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పాత విధానం రిజిస్ట్రేషన్లలో డాక్యుమెంట్ తయారీ మొదలు.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫైల్ మూవ్మెంట్, డాటా ఎంట్రీ, ఫొటో క్యాప్చర్, సంతకాల ప్రక్రియ వరకు అంతా మధ్యవర్తుల కనుసన్నల్లోనే నడుస్తుండడంతో అమ్మకం, కొనుగోలుదారులు నేరుగా కార్యాలయంలో సంప్రదించే పరిస్థితి లేకుండా పోయింది. (చదవండి: ఓటీపీ చెబితేనే రేషన్) ‘రేట్లు’పెంచేశారు... పాత రిజిస్ట్రేషన్ విధానంలో డాక్యుమెంట్ ప్రిపరేషన్ ప్రక్రియ అమ్మకం, కొనుగోలుదారుకు కాస్త ఇబ్బందే. ఈ క్రమంలో కార్యాలయం సమీపంలో ఉన్న మధ్యవర్తులను (డాక్యుమెంట్ రైటర్లను) ఆశ్రయించక తప్పదు. దాంతో ప్రభుత్వానికి చెల్లించే వివిధ రకాల డ్యూటీల మొత్తానికి దాదాపు సమాన ఫీజును మీడియేటర్లు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు రిజి్రస్టేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి రూ.5 వేలు ఫీజు చెల్లిస్తే... మధ్యవర్తికి కూడా రూ.5 వేలు చెల్లించాల్సి వస్తోంది. స్టాంపు డ్యూటీ రూ.10 వేలు ఉంటే... మీడియేటర్‌కు రూ.6,500 చొప్పున లేదా వారు చెప్పినంత చెల్లించాల్సిందే. ప్రతి సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలో ఉన్న మీడియేటర్లంతా ఉమ్మడిగా ధరలు నిర్ధారించి వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ వసూళ్ల ప్రక్రియ ఏళ్లుగా ఉన్నప్పటికీ... ప్రభుత్వం తాజాగా వ్యవసాయేతర ఆస్తులకు ధరణి పోర్టల్‌లో రిజి్రస్టేషన్ల విధానాన్ని నిలిపివేసి పాత పద్ధతికి గ్రీన్ సిగ్నల్ ఇచి్చనప్పటి నుంచి వసూళ్ల తీరు మారింది. ఇదివరకు రూ.2 వేలు తీసుకునే మీడియేటర్... ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నాడు. అన్నిచోట్లా ఇదేరకమైన దోపిడీ కనిపిస్తోంది. గత నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో నష్టపోయిన మీడియేటర్లు... ఇప్పుడు ఈ రకంగా ‘రేట్లు’ పెంచేసి ఆదాయాన్ని భర్తీ చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. జాడలేని నిఘా... రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పని జరగదనే విషయం తెలిసిందే. అయితే ఈ మీడియేటర్ల ఆగడాలను పట్టించుకునే వారే లేరు. మీడియేటర్ల వసూళ్లకు చెక్‌పెట్టని ఎస్ఆర్ఓ అధికారులు... మరింత ప్రోత్సహిస్తుండడంతో తిరుగులేకుండా పోతోంది. ఎందుకంటే మధ్యవర్తుల వసూళ్లలోంచి... అధికారులకు ప్రతి డాక్యుమెంట్‌పై నిరీ్ణత మొత్తం ముడుతుందనేది బహిరంగ రహస్యమే. ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ధరణి పోర్టల్ రిజి్రస్టేషన్లలో మధ్యవర్తుల ప్రమేయం దాదాపు లేదు. పోర్టల్ తెరిచి దరఖాస్తును పూరించి సబి్మట్ చేసి స్లాట్ తేదీని ఎంపిక చేసుకుంటే రిజి్రస్టేషన్ సులువుగా పూర్తయ్యేది. వ్యవసాయ భూముల రిజి్రస్టేషన్ అంతా ధరణి ద్వారా జరుగుతుండడంతో అమ్మకం, కొనుగోలుదారులకు మధ్యవర్తుల బెడద తప్పింది. మా దృష్టికి రాలేదు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. లీగలైజ్డ్ డాక్యుమెంట్ రైటర్స్‌పై చర్యలు తీసుకునే అంశం మా పరిధిలో ఉంటుంది. కానీ ఇక్కడ లీగలైజ్డ్ రైటర్స్ లేరు. ఇది పూర్తిగా కార్యాలయం బయట జరిగే అంశం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే అంశంపై సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తా. – మధుబాబు, సబ్ రిజిస్ట్రార్, ఇబ్రహీంపట్నం -
జోరందుకున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. మరింత రద్దీ
సాక్షి, ఖమ్మం : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో రిజిస్టేషన్ల ప్రక్రియ జోరందుకుంది. మొన్నటి వరకు స్తబ్దుగా నడిచిన రిజిస్టేషన్ల ప్రక్రియ తాజా ప్రభుత్వ నిర్ణయంతో పుంజుకుంది. ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. పాత వాటికి లింకు డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుందని, అయితే కొత్తవాటికి మాత్రం ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్టేషన్ చేస్తున్నామని సబ్ రిజిస్టార్ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చదవండి: హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం ఎల్ఆర్ఎస్ రద్దుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల పరిధిలో రోజువారి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కొంత ఆలస్యమైన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని క్రయవిక్రయాలకు సంబందించి రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చేవారు చెప్పుకొస్తున్నారు. న్యూ ఇయర్‌కు ఒక మంచి గిఫ్ట్‌గా భావిస్తున్నామని చెబుతున్నారు. కాగా రిజిస్టేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌తోపాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో అన్ని రకాల ఆస్తుల రిజిస్టేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించేవారు. అయితే కొత్త పద్దతిలో మాత్రం వ్యవసాయ ఆస్తుల రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించాలని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
అవినీతికి రిజిస్ట్రేషన్
తిరుపతి అర్బన్: రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి చేపలు ఏసీబీ వలలో పడ్డాయి. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో లేని రూ.2.07లక్షల సొమ్మును గుర్తించారు. తిరుపతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం అందడంతో తిరుపతి ఏసీబీ డీఎస్పీ దేవా నంద్ శాంత్ తమ బృందంతో కలసిసోమవారం తనిఖీలు నిర్వహించారు. పలు అంశాలపై సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లతో పాటు పలువురు ఉద్యోగులను విచారించారు. ఈ సందర్భంగా దేవానంద్ శాంత్ మాట్లాడుతూ లెక్క చూపని రూ.2.07లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 20 మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌కు లంచం డిమాండ్ చేస్తున్నారని పక్కా సమాచారం ఉందన్నారు. దాంతోనే దాడులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐలు విజయశేఖర్, ప్రసాద్‌రెడ్డి, రవి ఎస్ఐ సూర్యనారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు. విచారణ ఇలా కొనసాగింపు ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగించారు. సబ్ రిజిస్ట్రార్ నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఒక్కొక్కరిని కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆరా తీశారు. రోజుకు ఎన్ని రిజిస్టేషన్లు జరుగుతున్నాయి. సక్రమంగా ఉంటే ఎంత డిమాండ్ చేస్తున్నారు.. అక్రమంగా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి ఏ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్స్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారా.. అనే అంశాలపై నిశితంగా విచారణ కొనసాగించారు. ఉన్నత ఉద్యోగుల డైరెక్షన్లోనే లంచాలు? డాక్యుమెంట్స్ అన్నీ సక్రమంగా ఉంటే పెద్దగా డిమాండ్ చేయకుండా కొంతమేరకు లంచాలు తీసుకుంటున్నట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అయితే డాక్యుమెంట్లు సక్రమంగా లేకుంటే వాటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అధికారులు తేల్చి చెప్పేస్తున్నారు. ఆ తర్వాత మధ్యవర్తులు క్రయ, విక్రయదారులతో సంప్రదించి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని తెలిసింది. -
వివాదాల రిజిస్ట్రేషన్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో స్టాంప్ ఆండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఏటా స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రూ.200 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ఆదాయం సమకూరుతోంది. సగటున రోజుకు రూ.60 లక్షల ఆదాయం రిజిస్ట్రేషన్ ఫీజు రూపేణా ప్రభుత్వానికి వస్తోంది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు భూముల కొనుగోలుదారులు చెల్లించే చలా నా ఫీజులో అధికారులకు 0.5 శాతం నుంచి 1 శాతం వరకు కమీషన్ రూపంలో చెల్లించేవారు. వీటిని దస్తావేజు లేఖర్లే వసూలు చేసి అధికారులకు అందజేసేవారు. గతంలో ఒక్కో అధికారి కార్యాలయం ప్రదేశాన్ని బట్టి వారి నెల జీతంతో సమానమైన ఆదాయాన్ని ఒక్క రోజులోనే తీసుకువెళ్లిన సందర్భాలు అనేకం. వీటికి మూలకారకులైన దస్తావేజు లేఖర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోవడంతో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోయేది. లేఖర్ల గుప్పిట్లోనే అధికారులు.. జిల్లాలో 13 సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల పరిధిలో సరాసరి 5 నుంచి 10 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. వీరివద్ద 100 మంది వరకు పనిచేస్తుం టారు. వీరే అధికారులకు, క్రయవిక్రయదారులకు మధ్య దళారులుగా వ్యవహరించి పనికానిచ్చేస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా పని చేసి ఉండటంతో ఆ శాఖలో లోటుపాట్లు వీరికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవు. ఈ కారణంగానే అధికారులను సైతం వీరి గుప్పిట్లో పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్రయవిక్రయదారుల నుంచి అధికారుల పేరిట వసూలు చేసేది కొంతైతే వీరి సంపాదన దానికి రెట్టింపు ఉంటుందని అధికారులే అంటున్నారు. విజయనగరంలో కొత్త వివాదం.. విజయనగరం జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కొద్ది రోజుల క్రితం అధికారులు తమ పేరిట ఎవరైనా లంచాలు అడిగినా ఇవ్వొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. క్రయవిక్రయదారులు దస్తావేజులు నేరుగా కార్యాలయానికి తీసుకువస్తే రిజిస్ట్రేషన్లు చేస్తామని దానిలో పేర్కొన్నారు. అయితే దీని వెనుక కారణం వేరే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా కొనుగోలు దారులతో ‘అన్ని విధాలుగా సత్సంబంధాలు’ నెరపిన అధికారి ఆకస్మికంగా మంచివాడిగా మారిపోవడానికి అసలు కారణం ఆయన ఉద్యోగోన్నతుల జాబితాలో ఉండటమేనని తెలుస్తోంది. రెండు, మూడు నెలల్లో ఉద్యోగోన్నతి వచ్చే అవకాశం ఉన్నం దున ఈ సమయంలో అవినీతి చేసి పట్టుబడితే నష్టం చాలా ఎక్కువని భావించిన ఆయన తన పంథాను మార్చుకున్నట్లుగా చెబుతున్నారని కొందరు కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఆ అధికారి ఇటీవల తన వద్దకు రిజిస్ట్రేషన్‌కోసం ఎవరు వచ్చినా రోజంతా వెయిట్ చేయించి చివరి నిమిషంలో సర్వర్ పనిచేయడం లేదంటూ తప్పించుకుంటున్నారని, దీనివల్ల వేరే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నామని చెబుతున్నారు. అలా రోజం తా వేచిఉన్నవారికి, అధికారులకు మధ్య వాగ్వివా దాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయమై జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ రాపాక మురళి వద్ద సాక్షి ప్రతినిధి ప్రస్తావించగా... తాను కార్యాలయంలో లం చాలు ఇవ్వొద్దని ఫ్లెక్సీ పెట్టినందునే తనపై బెదిరింపులకు దిగుతున్నారనీ, ఆకాశ రామన్న ఉత్తరాలతో భయపెడుతున్నారని, దీనిపై రెండో పట్టణ పోలీసు స్టేషన్లో తాను ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిపారు. -
చేయి తడపనిదే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని మెట్ట ప్రాంతంలో అదొక పట్టణం. ఆ పట్టణంలోని ప్రజలకు ఏ పనైనా అక్కడి మున్సిపల్ ముఖ్య అధికారి కనుసన్నల్లోనే జరగాలి. ఏ సెక్షన్లో, విభాగంలో పని ఉన్నా ఆ అధికారి అనుమతి లేనిదే ఆ పని ముందుకు సాగదు. ఎవరు ఏ పని కోసం వచ్చినా, వారిని తన వద్దకు పంపాలని సెక్షన్ అధికారులకు, సిబ్బందికి ఆయన హుకుం జారీ చేశారు. కార్యాలయంలో ఎవరైనా, ఏదైనా పనికోసం వస్తే తానే ‘డీల్’ చేసుకుంటానని, మీరెవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చారు. దీంతో అక్కడి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అవాక్కయ్యారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలంతా దేవుడిని దర్శించుకున్న తరువాతే పూజారి వద్దకు వెళ్లాలన్న చందంగా మారింది పరిస్థితి. అధికారికి ముడుపులు అందితేనే ఏ ఫైల్ అయినా కదులుతోంది. ఏ పనైనా జరుగుతోంది. ఆ అధికారి వసూలు చేసే మామూళ్ల బాధలు తట్టుకోలేక, పనులు జరగక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో ఎవరికి ఏ పని వచ్చినా అతనిని కలిసి ముడుపులు చెల్లించాకే పని అవుతుందని బాహాటంగానే చెబుతున్నారు. తననెవరు ఏం చేస్తారనే తీరులో అధికారి వసూళ్ల పర్వం కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రణాళికా విభాగంలో తలదూర్చి ► పట్టణంలో ఒక మల్టీ షాపింగ్‌మాల్ నిర్మిస్తున్నారు. దానిని నిర్మించే వ్యక్తి అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. అయితే అనుమతులు వచ్చే లోగా పనులు ప్రారంభించడంతో ఆ అధికారి పనులు ఆపిం చేశారు. షాపింగ్‌మాల్ నిర్మించే వ్యక్తిని కార్యాలయానికి పిలిపించి మామూళ్లు వసూలు చేసినట్లు అక్కడి సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆ నిర్మాణదారుడు తాను అధికారికి రూ.లక్ష ఇచ్చానని, పనులు ఎందుకు ఆపాలని కార్యాలయం వద్దే కేకలు వేయడంతో పలువురు నిర్ఘాంతపోయారు. ► మరొక వ్యక్తి మరొక షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. నిర్మాణ అనుమతుల కోసం ఆయన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతులు వచ్చే లోగా భూమిని చదును చేసుకునే పనిని చేపట్టారు. అంతే అధికారికి తెలిసింది. వెంటనే నిర్మాణదారుడిని కార్యాలయానికి పిలిపించి మామూళ్లు డిమాండ్‌చేయడంతో ఆయన పూర్తిగా నిర్మాణాన్ని ఆపివేసి అనుమతులు వచ్చాకే చేస్తానని స్పష్టంచేశారు. ► ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. దానికి మున్సిపాలిటీ ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్నా ఎన్ఓసీ ఇవ్వకుండా కాలయాపన చేశారు. చివరికి అధికారికి రూ.30 వేలు ముడుపులు ఇస్తేనే గానీ ఎన్ఓసీ రాలేదు. ► వాస్తవానికి పట్టణంలో ఇళ్లు, భవనాల నిర్మాణాల కోసం చలానా చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బంది దానిని పరిశీలించి ఆన్లైన్లోనే అనుమతులు ఇస్తారు. భవనం నిర్మించుకునే వ్యక్తి కార్యాలయానికే రావాల్సిన అవసరం లేదు. అయితే ఆ అధికారి మాత్రం ఎవరు నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్నా తనకు తెలియకుండా అనుమతులు ఇవ్వొద్దని, దరఖాస్తు చేసుకున్న వ్యక్తులను కార్యాలయానికి పిలిపించి ‘డీల్’ సెటిల్ చేసుకుంటున్నారు. మచ్చుకు మరికొన్ని ఉదాహరణలు ► రెవెన్యూ విభాగంలో ఆస్తిపన్ను విధించాలని దరఖాస్తు చేసుకున్నా.. ముఖ్య అధికారి చేయి తడపాల్సి వస్తోంది. లేకపోతే పని కావట్లేదు. సాల్వెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆ అధికారికి మామూళ్లు చెల్లించకుండా ఒక్క సర్టిఫికెట్ మంజూరు కావట్లేదు. పట్టణంలోని వారపు సంత, రోజువారీ మార్కెట్ పాటదారులనూ ఆ అధికారి వదలలేదు. ఆశీల వసూలుకు వారపు సంత, రోజువారీ మార్కెట్ పాటలు పాడుకున్న పాటదారులను కార్యాలయానికి పిలిపించి నా వాటా ఎంత అని నేరుగా అడిగేయడంతో వారు అవాక్కవుతున్నారు. ఒక్కొక్క పాటదారుడు తనకు రూ.లక్ష ఇవ్వాలని ఆ అధికారి డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. ► ఇంజినీరింగ్ విభాగ అధికారులూ తనకు చెప్పకుండా ఏ పనీ చేయకూడదని ఆ అధికారి హుకుం జారీ చేశారు. కాంట్రాక్టర్ పనులు చేయాలన్నా, వారికి బిల్లులు చెల్లించాలన్నా వారితో మాట్లాడుకున్న తరువాతే సంబంధిత ఫైలు కదులుతోంది. ఇక వివిధ రకాల ► సర్టిఫికెట్లకు వసూళ్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. పందుల పెంపకందార్లను కూడా వదలకుండా మామూళ్లు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిబ్బంది, అధికారుల ఆవేదన ► తన అనుమతి లేనిదే ఏ పనీ చేయవద్దని ముఖ్య అధికారి వేధించడంతో సిబ్బంది, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి దృష్టికి అధికారులు, సిబ్బంది తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఉదయం నుంచి అర్ధరాత్రి , తెల్లవారుజాము వరకూ కూడా సిబ్బందిని కార్యాలయంలో ఉంచి వేధిస్తున్నట్లు వాపోతున్నారు. ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రి సమయంలో కూడా ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తుండటంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేక లోలోనే మదనపడుతున్నట్లు సమాచారం. -
అక్కడంతా ‘మామూలే’గా
ప్రభుత్వానికి అధికాదాయాన్ని ఆర్జించిపెట్టే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు అవినీతి ఆర్జనలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలోని 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముడుపుల బాగోతం పరాకాష్టకు చేరింది. ఆనేపథ్యంలో అవినీతి రహిత పాలన అందిస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అవినీతికి ఆస్కారం ఉన్న శాఖల్లో ప్రక్షాళ చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో భారీ ఎత్తున స్థానచలనాలు చేశారు. సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : అవినీతిరహిత పాలన అందించడమే ధ్యేయంగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదిశగా చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వానికి అధిక ఆదాయం ఆర్జించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అవినీతి నిలయంగా మారింది. ఇందులో అక్రమార్జన పతాక స్థాయికి చేరింది. దాంతో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ శాఖలో డీఐజీ స్థాయి అధికారి నుంచి సబ్రిజిస్ట్రార్ల వరకు ఇటీవల స్థానచలనం కల్పించారు. జిల్లాలో ఇలా.. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని రాజమండ్రి, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో మామూళ్ల వసూలు పతాకస్థాయికి చేరుకుంది. లంచాలు తీసుకుంటూ ఒక జిల్లా రిజిస్ట్రార్, సబ్రిజిస్ట్రార్లు, సిబ్బంది ఏసీబీకి చిక్కిన సందర్భాలు ఉన్నాయి. అయినా జిల్లాలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో మామూళ్ల వసూలు ఆగడం లేదు. అనధికార సిబ్బంది. డాక్యుమెంట్ రైటర్లే వసూళ్ల చక్రవర్తులు జిల్లా వ్యాప్తంగా 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు సిబ్బంది కొరతతో సతమతముతున్నాయి. దాంతో సుమారు 20 మంది వరకు అనధికార సిబ్బంది వాటిలో పనిచేస్తున్నారు. వీరిని నియమించడానికి ప్రభుత్వం నుంచిగాని జిల్లా అధికారుల నుంచి గాని ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్లు తమకు అనుకూలమైన వారిని నియమించుకుని వారితోనే మామూళ్లు వసూలు చేయిస్తున్నారని క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. వీరు లేని చోట డాక్యుమెంటు రైటర్లు ఆపాత్ర పోషిస్తున్నారు. ప్రతీ నెల ముడుపుల రూపంలో అందుకున్న మొత్తాన్ని జిల్లా అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పంచుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భూముల ధరలు ఎక్కువగా ఉన్న రాజమహేంద్రవరం, పిడింగొయ్యి, కడియం, రాజానగరం, అమలాపురం, సర్పవరం, తుని, కాకినాడ, సామర్లకోట, పిఠాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతిరోజు లక్షలాది రూపాయలు మామూళ్ల రూపంలో వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అవినీతికి అడ్డుకట్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రిజిస్ట్రేషన్ల శాఖలో భారీ ఎత్తున బదిలీలు చేయడంతో జిల్లాకు కొత్త అధికారులు వచ్చారు. అంతేకాకుండా ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ సొంత జిల్లా కావడంతో ఈ శాఖలో అవినీతిరహితపాలన ఈజిల్లా నుంచే శ్రీకారం చుట్టాలనే ద్యేయంతో కొత్తగా విధుల్లో చేరిన సబ్రిజిస్ట్రార్లు ఉన్నారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఏటా జిల్లా నుంచి సుమారు రూ.600 కోట్లకు పైగా ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి లభిస్తోంది. ఒక్కో డాక్యుమెంటును రిజిస్ట్రేషన్ చేసేందుకు ముడుపుల రూపంలో ఒక శాతం క్రయ విక్రయదారులు సమర్పించాల్సి వస్తోంది. ఆ విధంగా వారి నుంచి ఏడాదికి రూ.30 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముడుపులు చెల్లించనిదే డాక్యుమెంటును సిబ్బందిగాని, అధికారులు గాని ముట్టడం లేదని క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. ప్రజల్లో మార్పు రావాలి అవినీతిరహిత పాలన జరగాలంటే ప్రజల్లో మార్పు రావాలి. క్రయవిక్రయదారులు డాక్యుమెంట్రైటర్లను ఆశ్రయిస్తున్నారు. వారు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇవ్వాలంటూ వసూళ్లు చేస్తున్నారు. మా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికార సిబ్బందిని తొలగించాం. క్రయవిక్రయదారులు నేరుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు అవినీతికి ఆస్కారం ఉండదు. ప్రజల్లో మార్పు వస్తేనే అవినీతిరహితపాలన సాధ్యమవుతుంది. – షేక్ మౌలానా సాహెబ్, జాయింట్–1 సబ్‌రిజిస్ట్రార్, రాజమహేంద్రవరం -
అంతా అక్రమమే..!
సాక్షి, పెద్దపల్లికమాన్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించినా ఫలితాలు రావటం లేదు. ఆమ్యామ్యాలు లేనిదే పనులు చేయమనే ధోరణి పెద్దపల్లి రవాణాశాఖ కార్యాలయంలో కొద్దిమంది అధికారుల్లో కనబడుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, లైసెన్స్ తదితర సమస్యల పరిష్కారానికి వచ్చే సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా వచ్చే ప్రజలను కార్యాలయం చుట్టూ తప్పించుకుంటున్నారు. ఏజెంట్ల ద్వారా వస్తేనే పనులు చేస్తామని కోడ్‌రూపంలో సంకేతాలిస్తున్నారు. జిల్లాలోని ప్రజలు పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, ఎన్టీపీసీ, సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లో ఉండే ఆర్టీఏ ఏజెంట్లను సంప్రదించి పనులు చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు జరుగుతున్నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రయివేటు ఏజెంట్లదే హవా.. ఆర్టీఏ కార్యాలయంతో సంబంధం లేని ఓ ప్రైవే టు వ్యక్తి రోజూ సాయ్రంతం వాహనాల పనులు చేయించే ఏజెంట్ల వద్ద నగదు తీసుకుని అధికారులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సమయంలో ఏ ఏజెంట్‌కు సంబంధించి ఆ ఏజెంట్ దరఖాస్తులపై కోడ్‌ను సూచించి దరఖాస్తుదారులను కార్యాలయంలోకి పంపిస్తున్నారు. కోడ్ ఉంటే ఎలాంటి సందేహం లేకుండా అధికారులు, కార్యాలయ సిబ్బంది పని పూర్తి చేస్తున్నారు. ఎక్కువ లోపాలు కలిగిన వాహనాలుంటే అందు కు ఎక్కువ నగదు ముట్టజెప్పాల్సిందే. జిల్లాలో టిప్పర్లు, బొగ్గు, ఇసుక లారీలు కాలం చెల్లిన వా హనాల యజమానులు, పెద్ద వ్యాపారుల వద్ద ఎలాంటి కేసు కాకుండా ఉండేందుకు నెలవారీ మామూళ్లు కూడా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.వసూళ్లు సైతం కానిస్టేబుళ్లు, హోంగార్డులే చేస్తున్నట్లు కార్యాలయానికి వెళ్లే పలువురు ఆరోపిస్తున్నారు. పాఠశాలల బస్సుల తనిఖీల్లో.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల బస్సులకు ఏటా సామర్థ్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. పాఠశాలల ప్రారంభంలో అధికారులు తనిఖీలు చేస్తూ సామర్థ్య పరీక్షలు చేయించని బస్సులను గుర్తించి కేసులు నమోదు చేయాలి. ఇలా చేయకుండా పాఠశాలల యజమానులతో కుమ్మక్కయి వారి నుంచి డబ్బులు తీసుకుని సామర్థ్య పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇవ్వాల్సిన నగదు ఇస్తేనే చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టపగలే చుక్కలు.. పెద్దపల్లి రవాణా కార్యాలయానికి వచ్చే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు ఇక్కడి అధికారులు, సిబ్బంది, వాహనానికి సంబంధించిన ఏ పనికైనా ఎంతో కొంత ముట్టచెప్పాల్సిందే. నూతన రిజిస్ట్రేషన్‌కు వచ్చే ద్విచక్రవాహనాలకు ప్రయివేటు వ్యక్తులు పరిశీలించి, ఫాం నింపి.. ఎంతోకొంత తీసుకుంటున్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడి ఉన్నతాధికారులు సమయానికి రాకపోవడంతో ఉదయం కార్యాలయానికి వచ్చే సామాన్యులు సాయంత్రం వరకు తిండి, తిప్పలు లేకుండా వాహన పరీక్షల కోసం వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పారదర్శకంగా పనులు పెద్దపల్లి ఆర్టీఏ కా ర్యాలయంలో పనుల కోసం ప్రజలు ఏజెంట్లు లేకుండా నేరుగా రావొచ్చు. వారి సమస్యలు నేరుగా పరిష్కరిస్తున్నాం. ఏజెంట్ల ప్రభావం లేకుండా వారిని కార్యాలయంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా సేవలందించేలా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా డబ్బుల కోసం వేధి స్తే నేరుగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై శాఖాపరమైన చర్య తీసుకుంటాం. – ఆఫ్రీన్ సిద్దిఖి, ఆర్టీవో పెద్దపల్లి -
ఒక్క రోజులోనే ఈసీ
విజయనగర్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి సురేష్ వనస్థలిపురంలో స్థలం కొనాలని భావించాడు. ముందుగా సదరు స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సర్వే నంబర్ తీసుకుని స్థానిక మీ–సేవ కేంద్రంలో ఈసీ కోసం దరఖాస్తు చేశాడు. అందుకు విధించిన నిర్ణీత గడువు తర్వాత కేంద్రానికి వెళ్లగా.. డిపార్ట్మెంట్ ఆమోద ముద్ర పడలేదని, మరుసటి రోజు రావాలని అటునుంచి సమాధానం వచ్చింది. మరుసటి రోజు వెళ్లగా అదే సమాధానం పునరావృతమైంది. సురేష్ లాంటి వారికి ఇకపై ఈసీ సీసీ ఇబ్బందులు తొలగించాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూములకు సంబంధించిన ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్)లు, సీసీ (సర్టిఫైడ్ కాపీ)లు తిరిగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా జారీ చేసే విధంగా చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసుకున్న రోజే వీటిని జారీకి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించింది. మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా సరే.. అదే రోజు ఆమోదించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. దీనిద్వారా సర్వర్ డౌన్ వంటి సమస్యలతో ఈసీ, సీసీల జారీ జాప్యానికి పూర్తిగా తెరపడనుంది. సాక్షి, సిటీబ్యూరో: భూముల కొనుగోలు దారులు ఎదుర్కొనే అతపెద్ద సమస్య అయిన ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్)లు, సీసీ (సర్టిఫైడ్ కాపీ)లు పొందడం. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల నుంచి పొందే ఈ సర్టిఫికెట్లను ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను జారీ చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. సరిగ్గా ఐదేళ్లక్రితం స్థిరాస్తుల సీసీలు, ఈసీలు జారీ బాధ్యతను ప్రభుత్వం మీ–సేవ కేంద్రాలకు మాత్రమే అప్పగించింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు సీసీ, ఈసీల జారీ బాధ్యత నుంచి తప్పుకున్నాయి. ఇన్నేళ్లు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి ఆమోదిస్తూ వచ్చాయి. మీ–సేవ కేంద్రాల సర్వర్ సాంకేతిక సమస్యలకు తోడు ఈసీ, సీసీల ఆన్లైన్ దరఖాస్తులకు ఆమోద ముద్ర వేయడంలో రిజిస్ట్రేషన్ శాఖ నిర్లక్ష్యం సదరు సర్టిఫికెట్ల జారీ మరింత ఇబ్బందిగా మారింది. దీంతో నగరంలో స్థిరాస్తి కొనుగోలు, అమ్మకందారులకు సీసీ, ఈసీ ఇబ్బందులు తప్పడం లేదు. స్థలానికి సంబంధించిన పుట్టుపుర్వోత్తరాలు తెలుసుకోనడం కష్టంగా మారింది. రిజిస్ట్రేషన్ శాఖ ఆన్లైన్ సేవలు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ముందుకు వచ్చింది. అన్ని సేవలను కంప్యూటరీకరణ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో 1983 నుంచి ఈసీలు, సీసీలు కంప్యూటరీకరించి మీసేవ ద్వారా జారీ చేస్తూ వస్తోంది. కంప్యూటరీకరణ కానివి మాత్రమే సదరు రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి అందిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సైతం ఈసీ, సీసీలు ఇవ్వడంతో ప్రజలకు ఎక్కడ సౌలభ్యంగా ఉంటే అక్కడ వీటిని తీసుకునేవారు. ఈసీ, సీసీ సేవలను ఒక్క మీ–సేవ కేంద్రాలకు మాత్రమే అప్పగించడంతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈసీలు, దస్తావేజుల నకళ్ల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. మీ సేవా కేంద్రాల్లో దస్తావేజుల జారీకి పెద్ద సమస్య లేకున్నా.. ఈసీ జారీకి మాత్రం పలుచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి. మీ సేవా కేంద్రం నుంచి ఆన్లైన్లో అభ్యర్థన వెళ్తే దానికి అనుగుణంగా సతబంధిత సబ్ రిజిస్ట్రార్ ఈసీని పంపిస్తారు. అయితే తరచూ సర్వర్ సమస్యలు తలెత్తుతుండడంతో ఈసీ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మీ–సేవ కేంద్రాల సిబ్బందికి ఈసీల జారీ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల అభ్యర్థన దశలోనే తప్పులు దొర్లి దరఖాస్తుదారుడికి అవసరం లేని సమాచారం కూడా ఈసీలో దర్శనమిస్తోంది. సన్నకారు రైతులకూ బాదుడు.. గ్రేటర్లో ఏటా సుమారు మూడు లక్షల వరకు ఈసీలు జారీ అవుతాయి. హైదరాబాద్‌లో 75 వేల వరకు, శివార్లలో 2.25 లక్షల వరకు జారీ అవుతాయన్నది అంచనా. మీ–సేవ కేంద్రాల్లో ఈసీ, సీసీల జారీ కోసం డిమాండ్‌ను బట్టి ఆయా సెంటర్ల నిర్వాహకులు యూజర్ చార్జీలను దండుకుంటూ వచ్చారు. మరోవైపు సన్నకారు రైతుల సహకార సంఘాలకు ఈసీలను ఉచితంగానే మంజూరు చేయాల్సి ఉంటుంది. మీ సేవ కేంద్రాల్లో మాత్రం ఒక్కో ఈసీకి రూ.125 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సన్నాకారు రైతులకు ఉచితంగా ఈసీలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు ఉండగా.. మీ సేవ కేంద్రాల్లో మాత్రం ఆలాంటిదేమిలేదంటూ వసూళ్లు చేపట్టారు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ తిరిగి పాత పద్ధతిలోనే సేవలను అందించాలని ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే జారీ స్థిరాస్తులకు సంబందించిన ఈసీలు, సీసీల కోసం ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ–సేవ కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా వీటిని జారీ చేస్తాం. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఒక్క రోజులోనే వాటిని పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశాం. ఈ వెసలు బాటును సద్వినియోగం చేసుకోవాలి. – కె.రఘుబాబు, డీఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ (హైదరాబాద్) -
రిజిస్ట్రేషన్ @ తహసీల్
ఇచ్చోడ(బోథ్) : తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మూడు మండలాలను ఎంపిక చేసింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్, మంచిర్యాల జిల్లా నెన్నెల, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానం అమలుకు రంగం సిద్ధమైంది. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌ను రైతులకు చేరువ చేయడంలో భాగంగా మండలంలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తహసీల్దార్లకు అప్పగించింది. స్థానిక తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ వ్యవహారాలను నిర్వహించనున్నారు. జూన్ 2 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలు లేని అన్ని మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగించేందుకు రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం జీవో ఎంఎస్ 94, 95ను ప్రభుత్వం గత ఐదు రోజుల క్రితం విడుదల చేసింది. దీంతో మూడు మండలాల్లో శనివారం నుంచి రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా మంచిర్యాల, లక్సెట్టిపేటలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం భూముల క్రయవిక్రయాలతోపాటు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు, వివాహ నమోదు, గిఫ్ట్‌డీడ్, భాగస్వామ్య ఒప్పందాలు, ఇçళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్లతోపాటు మరో 20 రకాల సేవలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందిస్తున్నారు. ఈ శాఖ ద్వారా ప్రతీ సంవత్సరం ప్రభుత్వానికి దాదాపుగా రూ.120 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆలస్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల క్రయవిక్రయాలు, ఆస్తుల మార్పిడితోపాటు పలు సేవల్లో ఆలస్యం జరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం, పాసుపుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవడం, ఒక్కోసారి భూములు విక్రయించిన వారు తిరిగి రెండోసారి విక్రయించడం, ఒకే సర్వే నంబర్‌కు రెండు మూడు సార్లు ఇద్దరు, ముగ్గురుకి విక్రయించడం, సర్వే నంబర్లో ఉన్న విస్తీర్ణం కంటే రిజిస్ట్రేషన్లలో అధికంగా రికార్డు చేయడం, రిజిస్ట్రేషన్లలో భూముల సరిహద్దుల్లో ఎలాంటి ప్రామాణికాన్ని చూడకపోవడం, రైతులు చెప్పిన విధంగా ఆన్లైన్లో నమోదు చేయడంతో గ్రామాల్లో అనేక భూ వివాదాలు రెవెన్యూ ఆధికారులుకు సవాల్‌గా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాకత్మంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పలు సంఘటనలు వెలుగు చూశాయి. వీటన్నింటినీ అరికట్టేందుకు ప్రభుత్వం తహసీల్ కార్యాలయలో రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేడు ధరణి వెబ్సైట్ ప్రారంభం రైతులకు భూముల వివరాలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ నెల 19న ధరణి వెబ్సైట్ ప్రారంభానికి సిద్ధం చేసింది. భూ రికార్డుల నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రైతులకు అందుబాటులో ఉండేవిధంగా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్సైట్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రికార్డులను రెవెన్యూ శాఖ పొందుపర్చనుంది. తహసీల్ కార్యాలయలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూముల, ఆస్తుల క్రయవిక్రయాల వివరాలు వెబ్సైట్లో నమోదు చేసే విధంగా ఈ వెబ్సైట్ రూపుదిద్దుకుందని అధికారులు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న తహసీల్ కార్యాలయాల్లో నూతన భవనాలు నిర్మించకుండానే ఓ గదిలో ఈ సేవలు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అరకొర వసతుల మధ్య రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అసలే సిబ్బంది కొరతను ఎదుర్కొంటుండుగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విధానం తహసీల్ కార్యాలయంలో అమలకు నిర్ణయించడంతో రెవెన్యూ సిబ్బందికి సవాల్‌గా మారుతోంది. -
రూ. కోట్లలో ‘స్టాంప్‌ల’ కుంభకోణం!
కడప అర్బన్: జిల్లాలో ‘స్టాంప్‌ల’ కుంభకోణం కొత్త మలుపులు తిరుగుతోంది. నిందితులంతా సమాజంలో కీలక ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా ఉన్న రిజిస్ట్రేషన్, రెవెన్యూ, బ్యాంక్ అధికారులు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జిల్లాతోపాటు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు కూడా ఈ కుంభకోణం విస్తరించిందని పోలీసులు చెబుతున్నారు. – ఈ కుంభకోణంలో ప్రధానంగా మైదుకూరుకు చెందిన స్టాంప్ వెండర్, డాక్యుమెంట్ రైటర్ కోడూరు విజయభాస్కర్ రెడ్డి అలియాస్ భాస్కర్ సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించాడు. – ఈ క్రమంలో మైదుకూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరగుతున్న అవినీతిపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదులు అందాయి. ఆ శాఖ వారు ఈఏడాది జూన్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీంతో అక్కడి నుంచి విజయభాస్కర్ రెడ్డి తన మకాం కడప రవీంద్రనగర్‌కు మార్చాడు. – కడప రవీంద్రనగర్‌లో విజయభాస్కర్ రెడ్డి నివసిస్తుండగా రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు పాతకాలపు స్టాంప్‌లను కొనేందుకు వస్తూ, వెళుతూ ఉండటంతో ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలిగింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రవీంద్రనగర్‌లో విజయభాస్కర్ రెడ్డి నివసిస్తున్న ఇంటిపై తాలూకా ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో దాడి చేశారు. అతను పరారవడంతో ఆ ఇంటి వాతావరణాన్ని గమనించి కేసు నమోదు చేశారు. – నిందితుడు విజయభాస్కర్ రెడ్డిని ఎట్టకేలకు ఆగస్టు 15న బిల్టప్ సమీపంలో అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన అనంతరం ప్రస్తుతం ఈ కుంభకోణంలో 50 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 40 మందికి పైగా అరెస్ట్ కావాల్సి ఉంది. రూ.కోట్లలో కుంభకోణం రూ. కోట్లలో కుంభకోణం జరిగిందనే వాస్తవాలు క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. విజయ భాస్కర్‌రెడ్డి వద్ద నుంచి 2800 ఖాళీ స్టాంప్ పేపర్లు, ఇతర నిందితుల దగ్గరి నుంచి 22 నకిలీ రబ్బరు స్టాంప్‌లు, 24 నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న స్టాంప్‌లలో 1960–70 కాలం నాటివి సీజ్ చేశామని పోలీసులు చెబుతున్నారు. వీటి ఆధారంగా తాము ఎంచుకున్న ఆస్తినిగానీ, స్థలాలను గానీ, భూములనుగానీ సొంతం చేసుకుని బ్యాంకుల్లో సైతం రుణాలు పొందారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎంచక్కా రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోవడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇలా కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. – ఈ కుంభకోణంలో కొందరు బ్యాంకు అధికారులు, సిబ్బంది, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1960, 1970, 1990 కాలం నాటి స్టాంపులను కూడా వేలాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని విచారణలో తెలుస్తోంది. అరెస్టు అయిన వారంతా డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్లు, నకిలీ రబ్బరు స్టాంపుల తయారీదారులు, రెవెన్యూశాఖలోని ఉద్యోగులు, వారి బంధువులు కావడం గమనార్హం. ఇంకా లోతుగా విచారిస్తామని, త్వరలో బ్యాంకులకు, రిజిస్ట్రేషన్, రెవెన్యూ కార్యాలయాలకు నోటీసులు కూడా జారీ చేస్తామని పోలీసులు అంటున్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఈ కుంభకోణం విషయంలో ప్రత్యేక దృష్టితో విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. -
రిజిస్ట్రేషన్ ఆఫీసుపై ఏసీబీ దాడి
- రూ.56 వేల నగదు స్వాధీనం నిజామాబాద్ నాగారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి, మెదక్ జిల్లాకు చెందిన ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ముడుపులు తీసుకొని రిజిస్ట్రేషన్ పనులు చేయిస్తున్నారని ఏసీబీ తనిఖీల్లో తేలింది. కార్యాలయంలో ఉన్న 8 మంది దస్తవేజు లేఖరులు, 18 మంది దళారులను తనిఖీ చేసి, రూ.56వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పనులన్నీ ఆన్లైన్ విధానం, చలానా రూపంలోనే నిర్వహిస్తుండగా, నగదు ఎందుకు ఉందంటూ అధికారులు ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కనే డాక్యమెంట్ రైటర్ల కార్యాలయాలున్నాయి. వీరు రోజు ఆఫీస్‌లోకి వెళ్లి ముడుపులు ఇచ్చి రిజిస్ట్రేషన్ పనులు చేయిస్తున్నారని తేలడంతో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మధ్యాహ్నం 3 నుంచి గేట్లు మూసేసి, సాయంత్రం 6 గంటల వరకు సోదాలు నిర్వహించారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట భారీ చోరీ
హైదరాబాద్ నగరంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. రాజేంద్రనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు అందులో ఉన్న రూ. 13 లక్షల సూట్‌కేస్‌తో ఉడాయించారు. నూతనంగా తీసుకున్న భూమి రిజిస్ట్రేషన్ కోసం గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలమానికి వచ్చిన ఓ వ్యక్తి నగదును కార్లో ఉంచి కాగితాలు సిద్ధం చేసుకుంటుండగా.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అర్ధరాత్రి రిజిస్ట్రేషన్‌లుండవ్
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయం సాయంత్రం 5 గంటల వరకే చెక్ స్లిప్పులు రిజిస్ట్రేషన్ శాఖలో నేటినుంచి నూతన నిబంధనలు ఏలూరు (ఆర్ఆర్ పేట) : రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో బుధవారం నుంచి నూతన నిబంధనల అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా ఇచ్చే చెక్ స్లిప్పులను సాయంత్రం 5 గంటలకే నిలుపుదల చేయాలనేది వీటిలో ప్రధాన నిబంధన కాగా.. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ-చలాన్ విధానాన్ని అమలు చేయాలని రెండో నిబంధనగా విధించారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు అందుకు సంబంధించిన ఫీజును బ్యాంకుల్లోనే చెల్లించాల్సి వచ్చేది. కొత్త నిబంధన ప్రకారం కక్షిదారులు తమ బ్యాంక్ ఖాతాల నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. ఐతే దీని కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రతీ లావాదేవీకి రూ.1,100 అదనంగా చెల్లిం చాల్సి ఉంటుంది. నివేదిక ఇచ్చిన సబ్ రిజిస్ట్రార్ల సంఘం నూతన విధానాలకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ల సంఘం ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే డాక్యుమెంట్ చెక్ స్లిప్పులు ఇవ్వాలని సూచిం చింది. ఆ తరువాత సర్వర్ నిలిపివేయడం ద్వారా తమ శాఖలో జరిగే వైట్ కాలర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని పేర్కొంది. సాయంత్రం 5 గంటలకు సర్వర్లను నిలిపివేస్తే కంప్యూటర్లు డాక్యుమెంట్ చెక్ స్లిప్పులను తీసుకోవని, రిజిస్ట్రేషన్లు మాత్రం రాత్రి 10 గంటల వరకూ చేసుకునే అవకాశం ఉంటుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని బుధవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. సర్వర్‌పైనా ఒత్తిడి తగ్గుతుంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ సర్వర్‌పై రాష్ట్రంలోని 13 జిల్లాల సమాచార భారం ఒకేసారి పడుతుండటంతో కంప్యూటర్లు తరచూ మొరాయిస్తున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే.. సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు తప్ప ఈ ప్రక్రియలో జాప్యానికి తావుండదని చెబుతున్నారు. మరోవైపు సర్వర్ సామ ర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సబ్ రిజిస్ట్రార్లకు తగ్గనున్న పనిభారం జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రార్ కార్యాల యాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, భీమవరం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిద్వారా ప్రతిరోజూ సుమారు 300 నుంచి 500 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటారు. దశమి, ఏకాదశి, కొన్ని పర్వదినాల్లో ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 100 నుంచి 150 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అవుతుం టాయి. దీనిని ఆసరా చేసుకుని కొంతమంది దళారులు సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తెచ్చి అక్రమాలకు పాల్పడేట్టు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఎక్కు వ రిజిస్ట్రేషన్లు జరిగితే పర్సంటేజీలు భారీగా వస్తాయనే ఆశతో అర్ధరాత్రి వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తుంటారనే అపప్రద కూడా ఉంది. డాక్యుమెంట్లు పూర్తయ్యాక వాటిని పరిశీలించాల్సిన కొం దరు అధికారులు చూసీచూడనట్టు వది లేస్తున్నారు. కీలకం కానున్న డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నిర్లిప్తత కారణంగా రిజిస్ట్రేషన్లలో తప్పులు దొర్లుతున్నాయి. డాక్యుమెంట్ నంబర్లతోపాటు కక్షిదారుల పేర్లలోనూ తప్పులు నమోదవుతున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి తిరిగి అదే శాఖకు చార్జీలు చెల్లించి, ఒకటి రెండు వారాలు తిరిగితే గాని పని పూర్తికాని పరిస్థితి నెలకొంది. చెక్ స్లిప్పులను 5 గంటలకే నిలుపుదల చేస్తే వారిపై పని ఒత్తిడి తగ్గి డేటా ఎంట్రీ సక్రమంగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ రోజు దస్తావేజులు ఆ రోజే పని ఒత్తిడి కారణంగా ఇప్పటివరకూ క్రయదారులకు దస్తావేజులను ఇవ్వడానికి దాదాపు మూడు నుంచి వారం రోజులు పట్టేది. కొత్త విధానంతో ఏ రోజు దస్తావేజులు ఆ రోజే క్రయదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సమయ పాలనపై చైతన్యం వస్తుంది. సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పనిభారం తగ్గుతుంది. - పి.విజయలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్, ఏలూరు -
వీరి అవసరం..వారికి ఆదాయం
కర్నూలు(జిల్లా పరిషత్): భూముల ధరలు పెరగనుండడంతో జిల్లాలో రిజిస్ట్రేషన్లకు విశేష స్పందన వస్తోంది. రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. వీరి బలహీనతను ఆసరగా చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బందిమామూళ్లకు తెరలేపారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్టుగా ఉన్నా తెలియని తప్పులు చూపుతూ భారీగా దండుకుంటున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌పై కార్యాలయంలో రూ.20వేల నుంచి రూ.40వేల వరకు చేతులు మారుతున్నాయి. జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా మండల, మున్సిపాలిటీల పరిధిలోని సబ్రిజిస్టార్ల ప్రతిపాదనలను జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆధ్వర్యంలోని కమిటీ పది రోజుల క్రితం ఆమోదించింది. జిల్లాలో 20 నుంచి 60 శాతం వరకు స్టాంప్ డ్యూటీ పెంచేసింది. 2013 ఏప్రిల్ ఒకటిన స్టాంప్ డ్యూటీని పెంచారు. మార్కెట్లో విక్రయిస్తున్న ధరల కంటే చెల్లిస్తున్న ధర తక్కువగా ఉందని, ఈ కారణంగా ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో రెండురోజుల్లో భూముల విలువలు పెరిగితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ భారం అధికమవుతుందన్న కారణంగా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత వారంతో పోలిస్తే ఈ సోమవారం నుంచి రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జిల్లాలో 24 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో కర్నూలు, కల్లూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, మున్సిపాలిటీల పరిధిలో బుధ, గురువారాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు కర్నూలులో 272 రిజిస్ట్రేషన్లు జరగ్గా, 27 నుంచి 30వ తేదీ వరకు 490 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. అలాగే కల్లూరులో సోమవారం నుంచి గురువారం వరకు 458 రిజిస్ట్రేషన్లు జరిగాయి. పెరిగిన మామూళ్లు సందట్లో సడేమియా అన్నట్లు ప్రజల అవసరాన్ని, భయాన్ని ఆసరగా చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులు భారీగా మామూళ్ల మొత్తాన్ని పెంచేశారు. ఏదైనా భూమి, ఇళ్లు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించాలంటే ముందుగా డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లాలి. డాక్యుమెంట్ చేయడానికి రూ.1000 నుంచి రూ.1500ల వరకు వసూలు చేస్తున్నారు. అయితే అనధికారికంగా కొంతమంది కీలక డాక్యుమెంట్ రైటర్లు దళారులుగా మారారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని, స్థలం లిటికేషన్లో ఉందని చెబుతూ రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఫలితంగా డాక్యుమెంట్ రైటర్లు చెప్పిన మేరకు కాస్త అటూ ఇటూగా బేరమాడి మామూళ్లు ముట్టచెప్పి పని ముగించుకుంటున్నారు. ఇటీవల బుధవారపేటలోని ఓ స్థలానికి ఎలాంటి ఇబ్బందులూ లేకున్నా కోర్టు చిక్కులు ఉన్నాయంటూ ఓ కీలక ఉద్యోగి రూ.2లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి అందరి ముందూ గట్టిగా వాదించడంతో రూ.2లక్షల మొత్తం కాస్తా రూ.20వేలకు దిగినట్లు చర్చ జరుగుతోంది. ఏమీ తెలియకుండా రిజిస్ట్రేషన్‌కు వెళ్లే వారికి పలు రకాల భయాలు సృష్టించి ఉద్యోగులు లబ్ధిపొందుతున్నారు. కార్యాలయంలో ఒక్కోసీటుకు ఒక్కో రేటు చెబుతూ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. -
ఫోర్జరీ నేరంపై ముగ్గురికి రిమాండ్
సంగారెడ్డి మున్సిపాలిటీ(మెదక్): మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ముగ్గురిని రిమాండ్‌కు పంపారు. సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కమీషనర్, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తన ఇంటిని మరొకరు అక్రమంగా సొంత చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పట్టణానికి చెందిన అంజయ్య చారి ఫిబ్రవరి 2వ తేదీన మునిసిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై కమిషనర్ విచారణ చేయించగా పట్టణానికి చెందిన ఉమర్‌హుసేన్, జావిద్, జిహీనోద్దీన్‌సాబేర్‌లు నకిలీ ఓనర్ షిప్ సర్టిఫికెట్ జతచేసి అంజయ్య చారికి చెందిన ఇంటిని తమ పేరున మార్చుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. దీనిపై కమిషనర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు వ్యక్తులపై ఫిబ్రవరి 2న 468, 471, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరిపారు. కేసును విచారించిన న్యాయస్థానం కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉమర్‌హుసేన్, జావిద్, జహీనోద్దీన్ సాబేర్‌లకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. -
ఒకేరోజు.. 50 లక్షలు!
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : దాదాపు పక్షం రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కళకళలాడాయి. డాక్యుమెంట్ రైటర్ల సమ్మె కారణంగా క్రయ, విక్రయ దస్తావేజులు సిద్ధం చేసే పని నిలిచిపోయి కళావిహీనంగా కనిపించిన రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిసరాలు సోమవారం జన, వాహన సంచారంతో నిండిపోయాయి. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం విపరీతమైన రద్దీ నెలకొంది. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మీ-సేవ కేంద్రాలకు బదలాయించాలనే ప్రభుత్వ యోచనకు నిరసనగా ఈ నెల 16 నుంచి డాక్యుమెంట్ రైటర్లు నిరవధిక సమ్మెకు దిగగా, అంతకుముందు నుంచే (11వ తేదీ) సంక్రాంతి సెలవులు, ఇతర కారణాలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందగించింది. ఒక్కరోజునే 150 రిజిస్ట్రేషన్లు... సేవలు తిరిగి అందుబాటులోకి రావడంతో సోమవారం ఒక్కరోజే దాదాపు 150 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వానికి సుమారుగా *50 లక్షల దాకా ఆదాయం వచ్చినట్టు అంచనా. ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడం రికార్డుగా భావిస్తున్నా రు. గత రెండు, మూడు నెలల సగటును పరిశీలిస్తే ప్రతి రోజు 20 నుంచి 25 రిజి స్ట్రేషన్ల వరకే జరిగేవి. సీజన్లో చూసినా 50నుండి 60 వరకు రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. ఈ యేడాది జనవరి నెలలో 26వ తేదీ వరకు 696 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొంతకాలంగా నిలిచిపోయినందునే.. కొద్దికాలంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో సోమవారం భారీగా తరలివచ్చారు. రాత్రి పొద్దుపోయే వరకు పనులు చేయాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్దస్థాయిలో ఒకేరోజు రిజిస్ట్రేషన్లు జరగడం ఇదే ప్రథమం. - గులాం దస్తగిరి, సబ్ రిజిస్ట్రార్ నల్లగొండ