ఒకేరోజు.. 50 లక్షలు!
Published Tue, Jan 28 2014 3:29 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : దాదాపు పక్షం రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కళకళలాడాయి. డాక్యుమెంట్ రైటర్ల సమ్మె కారణంగా క్రయ, విక్రయ దస్తావేజులు సిద్ధం చేసే పని నిలిచిపోయి కళావిహీనంగా కనిపించిన రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిసరాలు సోమవారం జన, వాహన సంచారంతో నిండిపోయాయి. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం విపరీతమైన రద్దీ నెలకొంది. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మీ-సేవ కేంద్రాలకు బదలాయించాలనే ప్రభుత్వ యోచనకు నిరసనగా ఈ నెల 16 నుంచి డాక్యుమెంట్ రైటర్లు నిరవధిక సమ్మెకు దిగగా, అంతకుముందు నుంచే (11వ తేదీ) సంక్రాంతి సెలవులు, ఇతర కారణాలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందగించింది.
ఒక్కరోజునే 150 రిజిస్ట్రేషన్లు...
సేవలు తిరిగి అందుబాటులోకి రావడంతో సోమవారం ఒక్కరోజే దాదాపు 150 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వానికి సుమారుగా *50 లక్షల దాకా ఆదాయం వచ్చినట్టు అంచనా. ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడం రికార్డుగా భావిస్తున్నా రు. గత రెండు, మూడు నెలల సగటును పరిశీలిస్తే ప్రతి రోజు 20 నుంచి 25 రిజి స్ట్రేషన్ల వరకే జరిగేవి. సీజన్‌లో చూసినా 50నుండి 60 వరకు రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. ఈ యేడాది జనవరి నెలలో 26వ తేదీ వరకు 696 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
కొంతకాలంగా నిలిచిపోయినందునే..
కొద్దికాలంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో సోమవారం భారీగా తరలివచ్చారు. రాత్రి పొద్దుపోయే వరకు పనులు చేయాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్దస్థాయిలో ఒకేరోజు రిజిస్ట్రేషన్లు జరగడం ఇదే ప్రథమం. - గులాం దస్తగిరి, సబ్ రిజిస్ట్రార్ నల్లగొండ
Advertisement