అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయం
సాయంత్రం 5 గంటల వరకే చెక్ స్లిప్పులు
రిజిస్ట్రేషన్ శాఖలో నేటినుంచి నూతన నిబంధనలు
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో బుధవారం నుంచి నూతన నిబంధనల అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా ఇచ్చే చెక్ స్లిప్పులను సాయంత్రం 5 గంటలకే నిలుపుదల చేయాలనేది వీటిలో ప్రధాన నిబంధన కాగా.. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ-చలాన్ విధానాన్ని అమలు చేయాలని రెండో నిబంధనగా విధించారు.
రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు అందుకు సంబంధించిన ఫీజును బ్యాంకుల్లోనే చెల్లించాల్సి వచ్చేది. కొత్త నిబంధన ప్రకారం కక్షిదారులు తమ బ్యాంక్ ఖాతాల నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. ఐతే దీని కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రతీ లావాదేవీకి రూ.1,100 అదనంగా చెల్లిం చాల్సి ఉంటుంది.
నివేదిక ఇచ్చిన సబ్ రిజిస్ట్రార్ల సంఘం నూతన విధానాలకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ల సంఘం ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే డాక్యుమెంట్ చెక్ స్లిప్పులు ఇవ్వాలని సూచిం చింది.
ఆ తరువాత సర్వర్ నిలిపివేయడం ద్వారా తమ శాఖలో జరిగే వైట్ కాలర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని పేర్కొంది. సాయంత్రం 5 గంటలకు సర్వర్లను నిలిపివేస్తే కంప్యూటర్లు డాక్యుమెంట్ చెక్ స్లిప్పులను తీసుకోవని, రిజిస్ట్రేషన్లు మాత్రం రాత్రి 10 గంటల వరకూ చేసుకునే అవకాశం ఉంటుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని బుధవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
సర్వర్‌పైనా ఒత్తిడి తగ్గుతుంది
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ సర్వర్‌పై రాష్ట్రంలోని 13 జిల్లాల సమాచార భారం ఒకేసారి పడుతుండటంతో కంప్యూటర్లు తరచూ మొరాయిస్తున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే.. సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు తప్ప ఈ ప్రక్రియలో జాప్యానికి తావుండదని చెబుతున్నారు. మరోవైపు సర్వర్ సామ ర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
సబ్ రిజిస్ట్రార్లకు తగ్గనున్న పనిభారం
జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రార్ కార్యాల యాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, భీమవరం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిద్వారా ప్రతిరోజూ సుమారు 300 నుంచి 500 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటారు. దశమి, ఏకాదశి, కొన్ని పర్వదినాల్లో ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 100 నుంచి 150 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అవుతుం టాయి. దీనిని ఆసరా చేసుకుని కొంతమంది దళారులు సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తెచ్చి అక్రమాలకు పాల్పడేట్టు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఎక్కు వ రిజిస్ట్రేషన్లు జరిగితే పర్సంటేజీలు భారీగా వస్తాయనే ఆశతో అర్ధరాత్రి వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తుంటారనే అపప్రద కూడా ఉంది. డాక్యుమెంట్లు పూర్తయ్యాక వాటిని పరిశీలించాల్సిన కొం దరు అధికారులు చూసీచూడనట్టు వది లేస్తున్నారు.
కీలకం కానున్న డేటా ఎంట్రీ
డేటా ఎంట్రీ ఆపరేటర్ల నిర్లిప్తత కారణంగా రిజిస్ట్రేషన్లలో తప్పులు దొర్లుతున్నాయి. డాక్యుమెంట్ నంబర్లతోపాటు కక్షిదారుల పేర్లలోనూ తప్పులు నమోదవుతున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి తిరిగి అదే శాఖకు చార్జీలు చెల్లించి, ఒకటి రెండు వారాలు తిరిగితే గాని పని పూర్తికాని పరిస్థితి నెలకొంది. చెక్ స్లిప్పులను 5 గంటలకే నిలుపుదల చేస్తే వారిపై పని ఒత్తిడి తగ్గి డేటా ఎంట్రీ సక్రమంగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏ రోజు దస్తావేజులు ఆ రోజే
పని ఒత్తిడి కారణంగా ఇప్పటివరకూ క్రయదారులకు దస్తావేజులను ఇవ్వడానికి దాదాపు మూడు నుంచి వారం రోజులు పట్టేది. కొత్త విధానంతో ఏ రోజు దస్తావేజులు ఆ రోజే క్రయదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సమయ పాలనపై చైతన్యం వస్తుంది. సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పనిభారం తగ్గుతుంది.
- పి.విజయలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్, ఏలూరు