వివాదాల రిజిస్ట్రేషన్‌! | Disputes In Vizianagaram Registration Office | Sakshi
Sakshi News home page

వివాదాల రిజిస్ట్రేషన్‌!

Published Sun, Sep 15 2019 10:54 AM | Last Updated on Sun, Sep 15 2019 10:55 AM

Disputes In Vizianagaram Registration Office - Sakshi

జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల సందడి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో స్టాంప్‌ ఆండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఏటా స్టాంప్స్‌ ఆండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు రూ.200 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్‌ ఫీజుల ద్వారా ఆదాయం సమకూరుతోంది. సగటున రోజుకు రూ.60 లక్షల ఆదాయం రిజిస్ట్రేషన్‌ ఫీజు రూపేణా ప్రభుత్వానికి వస్తోంది. అయితే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు భూముల కొనుగోలుదారులు చెల్లించే చలా నా ఫీజులో అధికారులకు 0.5 శాతం నుంచి 1 శాతం వరకు కమీషన్‌ రూపంలో చెల్లించేవారు. వీటిని దస్తావేజు లేఖర్లే వసూలు చేసి అధికారులకు అందజేసేవారు. గతంలో ఒక్కో అధికారి కార్యాలయం ప్రదేశాన్ని బట్టి వారి నెల జీతంతో సమానమైన ఆదాయాన్ని ఒక్క రోజులోనే తీసుకువెళ్లిన సందర్భాలు అనేకం. వీటికి మూలకారకులైన దస్తావేజు లేఖర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోవడంతో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోయేది.

లేఖర్ల గుప్పిట్లోనే అధికారులు..
జిల్లాలో 13 సబ్‌ రిజిస్ట్రార్ల కార్యాలయాల పరిధిలో సరాసరి 5 నుంచి 10 మంది డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నారు. వీరివద్ద 100 మంది వరకు పనిచేస్తుం టారు. వీరే అధికారులకు, క్రయవిక్రయదారులకు మధ్య దళారులుగా వ్యవహరించి పనికానిచ్చేస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా పని చేసి ఉండటంతో ఆ శాఖలో లోటుపాట్లు వీరికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవు. ఈ కారణంగానే అధికారులను సైతం వీరి గుప్పిట్లో పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్రయవిక్రయదారుల నుంచి అధికారుల పేరిట వసూలు చేసేది కొంతైతే వీరి సంపాదన దానికి రెట్టింపు ఉంటుందని అధికారులే అంటున్నారు.

విజయనగరంలో కొత్త వివాదం..
విజయనగరం జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కొద్ది రోజుల క్రితం అధికారులు తమ పేరిట ఎవరైనా లంచాలు అడిగినా ఇవ్వొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. క్రయవిక్రయదారులు దస్తావేజులు నేరుగా కార్యాలయానికి తీసుకువస్తే రిజిస్ట్రేషన్లు చేస్తామని దానిలో పేర్కొన్నారు. అయితే దీని వెనుక కారణం వేరే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా కొనుగోలు దారులతో ‘అన్ని విధాలుగా సత్సంబంధాలు’ నెరపిన అధికారి ఆకస్మికంగా మంచివాడిగా మారిపోవడానికి అసలు కారణం ఆయన ఉద్యోగోన్నతుల జాబితాలో ఉండటమేనని తెలుస్తోంది. రెండు, మూడు నెలల్లో ఉద్యోగోన్నతి వచ్చే అవకాశం ఉన్నం దున ఈ సమయంలో అవినీతి చేసి పట్టుబడితే నష్టం చాలా ఎక్కువని భావించిన ఆయన తన పంథాను మార్చుకున్నట్లుగా చెబుతున్నారని కొందరు కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు.

ఆ అధికారి ఇటీవల తన వద్దకు రిజిస్ట్రేషన్‌కోసం ఎవరు వచ్చినా రోజంతా వెయిట్‌ చేయించి చివరి నిమిషంలో సర్వర్‌ పనిచేయడం లేదంటూ తప్పించుకుంటున్నారని, దీనివల్ల వేరే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నామని చెబుతున్నారు. అలా రోజం తా వేచిఉన్నవారికి, అధికారులకు మధ్య వాగ్వివా దాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయమై జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ రాపాక మురళి వద్ద సాక్షి ప్రతినిధి ప్రస్తావించగా... తాను కార్యాలయంలో లం చాలు ఇవ్వొద్దని ఫ్లెక్సీ పెట్టినందునే తనపై బెదిరింపులకు దిగుతున్నారనీ, ఆకాశ రామన్న ఉత్తరాలతో భయపెడుతున్నారని, దీనిపై రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో తాను ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement