‘రేట్లు’ పెంచేశారు.. అంతా వారి ఇష్టారాజ్యమే..! | Mediators Collects Huge Money Non Agricultural Property Registration | Sakshi
Sakshi News home page

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు...  మధ్యవర్తుల కనుసన్నల్లో..

Published Mon, Jan 11 2021 9:09 AM | Last Updated on Mon, Jan 11 2021 10:35 AM

Mediators Collects Huge Money Non Agricultural Property Registration - Sakshi

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కె.శ్రీను స్థానికంగా ఓ వెంచర్‌లో 160 గజాల ఓ ప్లాటు కొనుగోలు చేశాడు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ప్లాటు విలువ రూ.1.20 లక్షలు. ఈ ప్లాటు రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీల రూపంలో రూ.8,100 చెల్లించాడు. అయితే ఈ ప్లాటు రిజిస్ట్రేషన్‌ చేయించినందుకు మధ్యవర్తికి చెల్లించిన ఫీజు రూ.6,500. డాక్యుమెంట్‌ ప్రిపరేషన్‌తో పాటు త్వరగా పని పూర్తి చేయించినందుకు ఈ మొత్తం చెల్లించినట్లు శ్రీను చెబుతున్నాడు. 

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన సి.రమేశ్‌ మండల పరిధిలో 150 చదరపు గజాల ఖాళీ స్థలం కొనుగోలు చేశాడు. రెండ్రోజుల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు కార్యాలయం సమీపంలోని మధ్యవర్తిని సంప్రదించాడు. నిబంధనల ప్రకారం సదరు ప్లాటుకు స్టాంపు డ్యూటీతో పాటు ఇతర ఫీజుల కోసం రూ. 10,200 చెల్లించాడు. డాక్యుమెంట్‌ ప్రిపరేషన్‌ తదితర ప్రక్రియల కోసం రూ.5 వేలు మీడియేటర్‌కు చెల్లించడంతో రిజి్రస్టేషన్‌ కార్యాలయంలో అరగంటలో ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించిన ఫీజులో దాదాపు సగభాగం మీడియేటర్‌కు చెల్లించుకోవాల్సి వచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయేతర (నాన్‌ అగ్రికల్చర్‌) ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మధ్యవర్తులు దోచుకుంటున్నారు. నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీస్‌‌ రిజిస్ట్రేషన్‌ కూడా ధరణి పోర్టల్‌ ద్వారా నిర్వహించాలనుకున్నా... ఆధార్, ఇతర సమాచార సేకరణకు హైకోర్టు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజి్రస్టేషన్‌కు పాత విధానాన్నే కొనసాగిస్తోంది. దీంతో గత నాలుగు నెలలుగా నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు జోష్‌ వచ్చింది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంటున్న మధ్యవర్తులు... ప్రతి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌పైనా పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పాత విధానం రిజిస్ట్రేషన్లలో డాక్యుమెంట్‌ తయారీ మొదలు.. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఫైల్‌ మూవ్‌మెంట్, డాటా ఎంట్రీ, ఫొటో క్యాప్చర్, సంతకాల ప్రక్రియ వరకు అంతా మధ్యవర్తుల కనుసన్నల్లోనే నడుస్తుండడంతో అమ్మకం, కొనుగోలుదారులు నేరుగా కార్యాలయంలో సంప్రదించే పరిస్థితి లేకుండా పోయింది. (చదవండి: ఓటీపీ చెబితేనే రేషన్‌)

‘రేట్లు’పెంచేశారు...
పాత రిజిస్ట్రేషన్‌ విధానంలో డాక్యుమెంట్‌ ప్రిపరేషన్‌ ప్రక్రియ అమ్మకం, కొనుగోలుదారుకు కాస్త ఇబ్బందే. ఈ క్రమంలో కార్యాలయం సమీపంలో ఉన్న మధ్యవర్తులను (డాక్యుమెంట్‌ రైటర్లను) ఆశ్రయించక తప్పదు. దాంతో ప్రభుత్వానికి చెల్లించే వివిధ రకాల డ్యూటీల మొత్తానికి దాదాపు సమాన ఫీజును మీడియేటర్లు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు రిజి్రస్టేషన్‌ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి రూ.5 వేలు  ఫీజు చెల్లిస్తే... మధ్యవర్తికి కూడా రూ.5 వేలు చెల్లించాల్సి వస్తోంది. స్టాంపు డ్యూటీ రూ.10 వేలు ఉంటే... మీడియేటర్‌కు రూ.6,500 చొప్పున లేదా వారు చెప్పినంత చెల్లించాల్సిందే. ప్రతి సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయ పరిధిలో ఉన్న మీడియేటర్లంతా ఉమ్మడిగా ధరలు నిర్ధారించి వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ వసూళ్ల ప్రక్రియ ఏళ్లుగా ఉన్నప్పటికీ... ప్రభుత్వం తాజాగా వ్యవసాయేతర ఆస్తులకు ధరణి పోర్టల్‌లో రిజి్రస్టేషన్ల విధానాన్ని నిలిపివేసి పాత పద్ధతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చనప్పటి నుంచి వసూళ్ల తీరు మారింది. ఇదివరకు రూ.2 వేలు తీసుకునే మీడియేటర్‌... ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నాడు. అన్నిచోట్లా ఇదేరకమైన దోపిడీ కనిపిస్తోంది. గత నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో నష్టపోయిన మీడియేటర్లు... ఇప్పుడు ఈ రకంగా ‘రేట్లు’ పెంచేసి ఆదాయాన్ని భర్తీ చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

జాడలేని నిఘా...
రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పని జరగదనే విషయం తెలిసిందే. అయితే ఈ మీడియేటర్ల ఆగడాలను పట్టించుకునే వారే లేరు. మీడియేటర్ల వసూళ్లకు చెక్‌పెట్టని ఎస్‌ఆర్‌ఓ అధికారులు... మరింత ప్రోత్సహిస్తుండడంతో తిరుగులేకుండా పోతోంది. ఎందుకంటే మధ్యవర్తుల వసూళ్లలోంచి... అధికారులకు ప్రతి డాక్యుమెంట్‌పై నిరీ్ణత మొత్తం ముడుతుందనేది బహిరంగ రహస్యమే. ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ధరణి పోర్టల్‌ రిజి్రస్టేషన్లలో మధ్యవర్తుల ప్రమేయం దాదాపు లేదు. పోర్టల్‌ తెరిచి దరఖాస్తును పూరించి సబి్మట్‌ చేసి స్లాట్‌ తేదీని ఎంపిక చేసుకుంటే  రిజి్రస్టేషన్‌ సులువుగా పూర్తయ్యేది. వ్యవసాయ భూముల రిజి్రస్టేషన్‌ అంతా ధరణి ద్వారా జరుగుతుండడంతో అమ్మకం, కొనుగోలుదారులకు మధ్యవర్తుల బెడద తప్పింది.  

మా దృష్టికి రాలేదు 
అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. లీగలైజ్డ్‌ డాక్యుమెంట్‌ రైటర్స్‌పై చర్యలు తీసుకునే అంశం మా పరిధిలో ఉంటుంది. కానీ ఇక్కడ లీగలైజ్డ్‌ రైటర్స్‌ లేరు. ఇది పూర్తిగా కార్యాలయం బయట జరిగే అంశం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే అంశంపై సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తా. 
– మధుబాబు, సబ్‌ రిజిస్ట్రార్‌, ఇబ్రహీంపట్నం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement