‘మీ సేవ’ నుంచి రేషన్ కార్డులు
► రూ.35 చెల్లించి దరఖాస్తు చేస్తే చాలు
► 30 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి
► ఆన్‌లైన్’ సేవలతో మధ్యవర్తుల
► ప్రమేయం లేకుండా చర్యలు
పోచమ్మమైదాన్ : కొత్త రేషన్ కార్డు(ఆహార భద్రత కా ర్డు)కు మీరు అర్హులా? అయితే నేరుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేస్తే చాలు. నిర్ణీత 30 రోజుల తర్వాత రేషన్ సరుకులు తీసుకోవచ్చు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ప్రభుత్వం పారదర్శకంగా ఎంపిక చేస్తోంది. గతంలో రేషన్ కార్డు కోసం చెప్పుల రిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగనుంది. కొత్తగా కార్డు కావాలనుకునేవారు తెల్ల కాగితంపై వివరాలను రాసి, ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌తో స్థానిక మీసేవలో రూ.35 చెల్లించి, దరఖాస్తు సమర్పించాలి. ఆ తర్వాత 30 రోజుల్లోగా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, దరఖాస్తుదారులు అర్హులా? అనర్హులా? అనేది నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ క్రమంలో అర్హులైన వారి వివరాలను సంబంధి త రేషన్ షాపుకు అలాట్ చేస్తారు.
మార్పులు.. చేర్పులకు..
జిల్లాలో ఇప్పటిదాకా అంత్యోదయ కార్డులు 58,487, ఆహార భద్రత కార్డులు 9,14,542, అన్నపూర్ణ కార్డులు 141 ఉన్నాయి. పొట్ట చేత పట్టుకుని వలస వచ్చి ఆయా చోట్ల స్థిరపడిన వారంతా ఎక్కువగా ఒక చోట ఉండరు. వారి ఆర్థిక, వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో ఇంటి అద్దెలను ఒకచోటి నుంచి మరోచోటికి మార్చుతారు. అరుుతే ఇలా ఇళ్లు మారిన సమయంలో రేషన్ కార్డును స్థానిక రేషన్ షాప్‌కు మార్చుకోవడం కష్టసాధ్యమైన పని.
ఈ నేపథ్యంలోనే ప్రహసనంగా మారిన రేషన్ కార్డుల బదిలీ ప్రక్రియను సులభతరం చేశారు. కొత్తగా పెళ్లయిన వారు రేషన్ కార్డులు పొందేందుకు మొదట కుటుంబంలో ఉన్న వారి పేరును తొలగించాలి. ఆ తరువాత తెల్ల కాగితంపై సదరు వ్యక్తి స్వయంగా రాసి, దానికి కొత్తగా మారిన ఇంటి కరెంట్ బిల్లును జోడించి మీ సేవా కేంద్రంలో అందించి, రూ.35 చెల్లిస్తే సరిపోతుంది. 30 రోజుల్లో వారికి సంబంధించిన కార్డు జారీ ప్రక్రియ పూర్తి అవుతుంది. పేర్లు తప్పుగా పడినా సంబంధిత ఆధారాల తో జత చేసి దరఖాస్తు చేస్తే, మార్పులు చేస్తారు.